- January 15, 2022
Nagarjuna: ఒక్క మాట అనలేదు, రెచ్చిపోలేదు!.. చైసామ్ విడాకులపై నాగ్ కామెంట్స్
Nagarjuna సమంత నాగ చైతన్య విడాకుల అంశం ఈ మధ్య మళ్లీ ఎక్కువగా వార్తల్లోకి వచ్చేసింది. బంగార్రాజు సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా నాగ చైతన్య చెప్పిన మాటలతో ఒక్కసారిగా విడాకుల వ్యవహారం మరోసారి చర్చల్లోకి వచ్చింది. విడాకుల ప్రకటన తరువాత నాగ చైతన్య ఎప్పుడూ కూడా ఎలాంటి కామెంట్ చేయలేదు.
దీంతో నాగ చైతన్య మొదటి రియాక్షన్ అవ్వడంతో అంతగా ప్రాధాన్యతను ఇచ్చారు. విడాకులు అనేది ఇద్దరి మంచి కోసం, ఆనందం కోసమే తీసుకున్నాను.. తను హ్యాపీ. నేను హ్యాపీ.. పరిస్థితులకు తగ్గట్టు ఇద్దరికీ మంచిదనే ఈ నిర్ణయాన్ని తీసుకున్నాం.. ఫ్యామిలీ అంతా కూడా సపోర్ట్ చేసిందంటూ నాగ చైతన్య విడాకుల విషయం మీద నోరు విప్పాడు.
ఈ విడాకుల సమయంలో నాగార్జున కూడా ఓ పోస్ట్ వేశాడు. తమకు ఇద్దరూ ఇష్టమేననని, వారి పర్సనల్ విషయాన్ని, వారిష్టాలను గౌరవించండి.. అని నాగార్జున స్పందించాడు. అయితే మామూలుగానే చై సామ్ పెళ్లి విషయంలో మొదటగా నాగార్జున వారించాడని, వద్దన్నాడనే వార్తలు వినిపిస్తుంటాయి. నాగార్జునకు ఇష్టం లేకపోయినా కూడా నాగ చైతన్య పెళ్లి చేసుకున్నాడని అంటారు.
మొత్తానికి ఈ జంట విడిపోయింది. అయితే కొడుకు జీవితంలో ఇలా విడాకులు, పెళ్లి పెటాకులు అయితే తండ్రి కాస్త బాధపడతాడు. అలానే నాగార్జున కూడా బాధపడ్డట్టున్నాడు. మొత్తానికి వారిద్దరి విడాకుల మీద నాగార్జున మరోసారి స్పందించాడు. బంగార్రాజు ప్రమోషన్స్‌లో భాగంగా ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ అసలు విషయాన్ని చెప్పేశాడు.
ఆ క్లిష్ట సమయంలో చై ఎంతో సైలెంట్‌గా ఉన్నాడు.. అది నాకు ఎంతో గొప్పగా అనిపిస్తుంది. ఎంత మంది ఎన్ని రకాలుగా అన్నా కూడా ఒక్క మాట కూడూ అనలేదు. ప్రొవోక్ కాలేదు. అందరి తండ్రుల్లానే నేను కూడా కొడుకు గురించి బాధపడ్డాను. ఆలోచించాను. నేను వాడి గురించి బాధపడిన దాని కంటే ఎక్కువగా.. ఈ విషయంలో నేను ఏమనుకుంటున్నానో అని బాధపడతానని నా గురించి ఎక్కువగా చై ఆలోచించాడు. నువ్ ఓకేనా? డాడ్ అని వాడు అడిగాడు. నేను వాడిని అడగాల్సిన ప్రశ్న వాడు నన్ను అడిగాడు అంటూ విడాకుల నాటి పరిస్థితులపై నాగ్ స్పందించాడు.