• November 11, 2022

Yashoda Movie Review : యశోద మూవీ రివ్యూ.. హిట్ కొట్టేసిన సమంత

Yashoda Movie Review : యశోద మూవీ రివ్యూ.. హిట్ కొట్టేసిన సమంత

    సమంత యశోద సినిమా నేటి శుక్రవారం (నవంబర్ 11) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సరోగసి నేపథ్యంలో ఈ చిత్రాన్ని తీసినట్టుగా టీజర్, ట్రైలర్ ద్వారా అందరికీ అర్థమైంది. మరి యశోద కథ ఏంటి? సినిమా లోపల ఏం ఉంది? సమంతకు ఈ చిత్రం ఎలా ఉపయోగపడింది? అసలు సమంతకు హిట్ వచ్చిందా? యశోద కథ, కథనాలు ఏంటో ఓ సారి చూద్దాం.

    కథ
    యశోద (సమంత) తన చెల్లి బృందా (ప్రీతి అస్రాణి)కి ఆపరేషన్ చేయించేందుకు డబ్బు అవసరం పడుతుంది. తన చెల్లి కోసం సరోగసికి సిద్దపడుతుంది యశోద. ఇలా యశోద కథ ఒక వైపు జరుగుతుంటుంది. మరో వైపు సిటీలో వరుసగా మర్డర్లు జరుగుతుంటాయి. ఇందులో హాలీవుడ్ నటి ఓలివియా, ఇండియన్ మోడల్ ఆరూషి వంటి వారు కూడా ఉంటారు. వీరి హత్యల వెనుకున్న ఉన్న మిస్టరీ కోసం సంపత్ అండ్ టీం వెతుకుతుంటుంది. ఇక యశోద చివరకు మధు (వరలక్ష్మీ శరత్ కుమార్), డాక్టర్ గౌతమ్ (ఉన్ని ముకుందన్) వద్దకు చేరుతుంది. అక్కడ యశోదలానే చాలా మంది సరోగసి కోసం ఉంటారు. అసలు అక్కడేం జరుగుతోంది? సిటీలో ఆ హత్యలు ఎందుకు జరుగుతున్నాయి? వాటికి వీటికి ఏమైనా లింక్ ఉందా? ఈ కథలో సెంట్రల్ మినిస్టర్ గిరిధర్ (రావు రమేష్‌) పాత్ర ఏంటి? చివరకు యశోద ఏం చేసింది? అనేది తెరపై చూడాల్సిందే.

    యశోద పాత్రలో సమంత అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. ఫ్యామిలీ మెన్ సీజన్ 2లో సమంత చేసిన యాక్షన్ సీక్వెన్స్ చూశాం. మజిలీ, ఓబేబీలో ఎమోషన్స్ చూశాం. ఇందులో అవన్నీ కలిపి ఉంటాయి. యాక్షన్, ఎమోషనల్ సీన్స్‌లో సమంత మెప్పిస్తుంది. ఉన్ని ముకుందన్ పాత్రలోని వేరియేషన్స్, షేడ్స్ షాకింగ్‌గా అనిపిస్తాయి. వరలక్ష్మీ శరత్ కుమార్ పాత్ర ఓకే అనిపిస్తుంది. రొటీన్ విలన్‌లా అనిపించదు. ఇక సంపత్, శత్రు, మురళీ శర్మ పాత్రలు మెప్పిస్తాయి. రావు రమేష్‌ తనకు అలవాటైన విలన్ రోల్‌లో కనిపించాడు. సరోగసి గ్యాంగులో కల్పికా గణేష్‌, దివ్య వంటివారు ఓకే అనిపిస్తారు.

    యశోద సినిమా కాస్త డిఫరెంట్‌గా స్టార్ట్ అవుతుంది. హాలీవుడ్ నటి వింత మరణంతో కథ స్టార్ట్ అవ్వడం బాగానే ఉంటుంది. కానీ సమంత పోర్షన్ మాత్రం అంత ఎఫెక్టివ్‌గా అనిపించదు. ప్రథమార్థంలో సమంత, సరోగసి కేంద్రం, అక్కడి మిత్రులు, మధ్యలో ఓ పాట, ఆ సీన్లన్నీ కూడా ప్రేక్షకుడికి సహన పరీక్షలా అనిపిస్తాయి. అయితే మరో వైపు పోలీసుల ఇన్వెస్టిగేషన్ మాత్రం కాస్త గ్రిప్పింగ్‌గా అనిపిస్తుంది. ఇంటర్వెల్ సీన్ మాత్రం అందరినీ మెప్పిస్తుంది.

    సెకండాఫ్ పరుగులు పెడుతున్నట్టుగా అనిపిస్తుంది. కానీ ప్రీ క్లైమాక్స్‌లో అసలు కథ రివీల్ కావడం, ప్లాట్ ఏంటో తెలియడంతో ప్రేక్షకుడికి క్లైమాక్స్ ఎలా ఉండబోతోందో అర్థమవుతుంది. కానీ సమంత అసలు కారెక్టర్ రివీల్ చేసే సమయంలో లేని పోని ఎలివేషన్స్ పెట్టి పోకిరి సీన్‌ను రిపీట్ చేసినట్టుగా అనిపిస్తుంది. సినిమా ఒక మూడ్‌లో పోతోంటే.. మధ్యలో అక్కడ కూడా ఓ పాటలాంటిది పెట్టడం నవ్వుతెప్పిస్తుంది.

    అలా ఈ సినిమాలో ఎన్నెన్నో లాజిక్స్ మిస్ అయిన సీన్స్ ఉన్నాయి. అవన్నీ పక్కన పెడితే ఎంచుకున్న కథ, కథనం మాత్రం కాస్త గ్రిప్పింగ్‌గానే అనిపిస్తుంది. దీంతో సినిమాను ఒకసారి చూసేందుకు బాగానే ఉంటుంది. మాటలు, పాటలు పర్వాలేదనిపిస్తాయి. మణిశర్మ బీజీఎం ప్రాణంగా నిలిచింది. కెమెరా, ఎడిటింగ్, ఆర్ట్, ప్రొడక్షన్ వాల్యూస్ ఇలా అన్నీ సెట్ అయ్యాయి.

    రేటింగ్ 2.75

    బాటమ్ లైన్.. యశోద.. కొంత రొద.. ఇంకొంత వ్యథ