• December 2, 2022

Matti Kusthi Movie Review : మట్టి కుస్తీ రివ్యూ.. మస్త్ ఫన్నీ

Matti Kusthi Movie Review : మట్టి కుస్తీ రివ్యూ.. మస్త్ ఫన్నీ

    Matti Kusthi Movie Review విష్ణు విశాల్ నటించిన మట్టి కుస్తీ అనే చిత్రం డిసెంబర్ 2న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రంలో ఐశ్వర్య లక్ష్మీ హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్రాన్ని తెలుగులో ఆర్టీ టీం వర్క్స్ మీద రవితేజ రిలీజ్ చేశాడు. అయితే ఈ చిత్రం ఎలా ఉంది అనేది ఓసారి చూద్దాం.

    కీర్తి (ఐశ్వర్య లక్ష్మీ) కుస్తీ పోటీల్లో జాతీయ స్థాయిలో ఆడాలని అనుకుంటుంది. కానీ కీర్తికి పెళ్లి చేయాలని ఆమె తండ్రి ప్రయత్నిస్తాడు. ఇలా పొట్టి జుట్టు, బట్టలు వేసుకుని కుస్తీ పడే అమ్మాయిని చేసుకునేందుకు ఎవ్వరూ ముందుకురారు. మరోవైపు వీర (విష్ణు విశాల్) తన భార్య ఎలా ఉండాలో పెద్ద లిస్ట్ వేసుకుంటాడు. అణుకువుగా ఉండాలి.. పెద్దగా చదువుకోకూడదు.. పొడవాటి జుట్టు ఉండాలని అనుకుంటాడు. కానీ కీర్తిలో వీర కోరుకున్న ఒక్క లక్షణం కూడా ఉండదు. మొత్తానికి కీర్తి బాబాయ్ అబద్దాలు ఆడి వీరకు ఇచ్చి కట్టబెడతాడు. ఆ తరువాత జరిగిన పరిణామాలు ఏంటి? వీర జీవితంలో ఎలాంటి మార్పులు వచ్చాయి? కీర్తి తన కుస్తీ పోటీలను ఎందుకు కంటిన్యూ చేయాల్సి వచ్చింది? భార్యతోనే కుస్తీ పడేందుకు వీర ఎందుకు సిద్దపడతాడు? చివరకు కీర్తి, వీరల మధ్య ఏం జరిగింది? అనేది కథ.

    వీర పాత్రలో అల్లరిచిల్లరగా కనిపించాడు విష్ణు విశాల్. ఇలాంటి పోకిరి, మాస్ పాత్రలను విష్ణు విశాల్ పోషించాడు. డ్యాన్సులు చేయడంలో కష్టపడ్డట్టు కనిపిస్తోంది. యాక్షన్ సీక్వెన్స్ బాగానే చేశాడు. కామెడీ కూడా అక్కడక్కడా వర్కౌట్ అయింది. అయితే ఈ సినిమాకు రియల్ హీరో మాత్రం హీరోయినే. ఐశ్వర్య లక్ష్మీ తన యాటిట్యూడ్, బాడీ లాంగ్వేజ్‌తో కుస్తీ పడే సీన్లు మాత్రం అదిరిపోయాయి. విలన్‌లుగా కనిపించిన శత్రు, అజయ్ మన తెలుగు వాళ్లే కావడం కాస్త ఉపశమనంగా అనిపిస్తుంది. మిగిలిన అంతా కూడా నవ్వించే ప్రయత్నం చేశారు.

    అమ్మాయిలు తక్కువ కాదు.. వారిని చులకనగా చూడాల్సిన పని లేదు.. వారిలో ఎంతో శక్తి ఉంది.. తలుచుకుంటే ఏదైనా సాధించగలరు.. మగాళ్ల ముందు ఆడది అణిగిమణిగి ఉండాలనే నియమాలు ఇంకెంత కాలం అనేట్టుగా ఈ చిత్రం సాగుతుంది. ఆడవాళ్లను గౌరవించాలి.. వారి అభిప్రాయాలకు విలువను ఇవ్వాలి.. వారి హక్కులను గుర్తించాలి.. వారికంటూ గుర్తింపు ఇవ్వాలని సందేశం ఇస్తూ కథ, కథనం ముందుకు సాగుతుంది. అయితే అంతర్లీనంగా ఈ సందేశాన్ని ఇస్తూనే కామెడీని పైపైన టచ్ చేశారు.

    ప్రథమార్థం అంతా కూడా హీరో డామినేషన్ కనిపిస్తుంది. అయితే క్లైమాక్స్‌కు వచ్చే సరికి హీరోయిన్‌కు ఫుల్ మార్కులు పడతాయి. ఇక అక్కడి నుంచి హీరో గ్రాఫ్ తగ్గినట్టుగా అనిపిస్తుంది. హీరోయినే హీరోగా ముందుకు సాగుతున్నట్టుగా అనిపిస్తుంది. ఈ సినిమా కోసం ఎంచుకున్న పాయింట్ మంచిదే అయినా కూడా అది చాలా పాతది. ఈ లైన్‌తో ఎన్నెన్నో సినిమాలు వచ్చాయి. కానీ దీన్ని కాస్త లైటర్ వేలో చెప్పడంతో కాస్త రిలాక్సింగ్‌గానే అనిపిస్తుంది. ఫన్ మాత్రం వర్కౌట్ అయింది. పాటలు ఓకే అనిపిస్తాయి. కొన్ని మాటలు ఆలోచింపచేస్తాయి. కెమెరా, సంగీతం, ఎడిటింగ్, పొడ్రక్షన్ వాల్యూస్ అన్నీ చక్కగా కుదిరాయి.

    రేటింగ్ 2.5

    చివరగా.. మట్టి కుస్తీలో గెలిచిన భార్యభర్తలు