• December 2, 2022

HIT 2 Movie Review : హిట్ 2 రివ్యూ.. సెకండ్ కేసూ హిట్టే

HIT 2 Movie Review : హిట్ 2 రివ్యూ.. సెకండ్ కేసూ హిట్టే

  HIT 2 Movie Review హిట్ ఫస్ట్ కేస్‌లో విశ్వక్ సేన్ అదరగొట్టేశాడు. కొత్త డైరెక్టర్ శైలేష్ కొలను అందరినీ ఆశ్చర్యపరిచాడు. నిర్మాతగా నానికి మంచి పేరు వచ్చింది. దీంతో సెకండ్ కేస్‌ను మరింత గ్రాండియర్‌గా తీశారు.ఈ సెకండ్ కేస్‌లో అడివి శేష్ హీరోగా నటించాడు. ఇప్పటికే సినిమా మీద మంచి బజ్ ఏర్పడింది. ఈ సినిమా నేడు థియేటర్లోకి వచ్చింది. మరి ఈ చిత్రం ఆడియెన్స్‌ను మెప్పించిందా? లేదా? అన్నది చూద్దాం.

  వైజాగ్‌ సిటీ ఎస్పీగా కృష్ణ దేవ్ అలియాస్ కేడీ (అడివి శేష్‌) కూల్‌గా బాధ్యతలు నిర్విర్తిస్తుంటాడు. ఎలాంటి క్రైమ్‌నైనా తన తెలివి ఇట్టే పసిగట్టేస్తాననే నమ్మకం ఉంటుంది. ఆర్యా (మీనాక్షి చౌదరి) వెల్ఫెర్ అసోసియేషన్‌లో వాలంటీర్‌గా ఉంటూ ఓ బొటిక్ నడుపుతుంటుంది. వీరిద్దరూ సాఫీగా జీవితాన్ని సాగిస్తుంటారు. వైజాగ్‌ సిటీలో ఓ సారి సంజన అనే అమ్మాయి అతి దారుణంగా హత్యకు గురవుతుంది. అయితే ఆ అమ్మాయి మాత్రమే కాదు.. ఆమెతో పాటు ఇంకా ముగ్గురు కూడా హత్యకు గురయ్యారని తెలియడంతో పోలీస్ డిపార్ట్మ్ంట్ విస్మయానికి గురవుతుంది. ఆ సీనియర్ కిల్లర్‌ను పట్టుకునేందుకు కేడీ చేసిన ఇన్వెస్టిగేషన్ ఏంటి? ఈ ఇన్వెస్టిగేషన్‌లో బలైన అమాయకుడు ఎవరు? ఆ సీరియల్ కిల్లర్ బ్యాక్ గ్రౌండ్ ఏంటి? అసలు ఇదంతా ఎందుకు చేస్తాడు? చివరకు ఆర్యాను ఆ సైకో కిల్లర్ నుంచి కేడీ కాపాడుకుంటాడా? అన్నదే మిగతా కథ.

  అడివి శేష్‌ నటనకు వంక పెట్టేందుకు చాన్స్ దొరకదు. ఇలాంటి థ్రిల్లర్, సస్పెన్స్ జానర్లలో నటించడం అతనికి వెన్నతో పెట్టిన విద్యలా ఉంటుంది. ఇక ఇందులో కాస్త వెటకారాన్ని కూడా జోడించాడు. యాటిట్యూడ్, బాడీ లాంగ్వేజ్ అన్నీ కూడా అడివి శేష్‌కు పర్ఫెక్ట్‌గా సెట్ అయ్యాయి. మీనాక్షి చౌదరి అందంగానే కనిపించింది. ఉన్నంతలో బాగానే నటించింది. కోమలి ప్రసాద్ వర్ష పాత్రలో మెప్పిస్తుంది. ఇక ఇందులో హర్షవర్దన్, సుహాస్ పాత్రలు కూడా మెప్పిస్తాయి.

  మిస్టరీ అండ్ మర్డర్ థ్రిల్లర్ సస్పెన్స్ మూవీల్లో ఒక ఫార్మూలా ఉంటుంది. ఎవరి మీద అయితే అనుమానం రాదో.. ఎవరినైతే మంచిగా చూపిస్తారో.. వారే చివరకు నేరస్థులుగా బయటకు వస్తారు. ఆ ట్విస్ట్‌ను చివర్లో రివీల్ చేస్తారు. తెరపై అప్పటికీ ఓ రెండు మూడు సీన్లలో కనిపిస్తారు. కూడా జనాలు అంతగా పట్టించుకోరు. కానీ చివరకు ఆ వ్యక్తే సైకో కిల్లర్ అని తెలుస్తుంది. ఆ ట్విస్ట్ ఎలా రివీల్ చేశాం.. ఆ పాత్రకు తగ్గ నేపథ్యం పెట్టామా? సరైన జస్టిఫికేషన్ ఇచ్చామా? అన్నదే ఇంట్రెస్టింగ్ పాయింట్ అవుతుంది. జనాలు దానికే కనెక్ట్ అవుతారు.

  హిట్ సెకండ్ కేస్‌లోనూ అలాంటిదే జరుగుతుంది. ముందంతా కూడా మంచి వ్యక్తి, నార్మల్ పర్సన్ అని అనుకుంటాం. కానీ క్లైమాక్స్‌లో అతని సైకోయిజం తెలుస్తుంది. ఆ సైకోను పట్టుకునేందుకు చేసిన ఇన్వెస్టిగేషన్, తవ్విన నిజాలు, ఆ క్రమంలో హిట్ ఫస్ట్ కేస్ రిఫరెన్సెస్, ఇన్‌స్పెక్టర్ రుద్రరాజు (విశ్వక్ సేన్) సీన్లు అందరినీ ఆకట్టుకుంటాయి. ఫస్ట్ పార్ట్‌లోని సీన్లను రెండో పార్టులో తెలివిగా వాడుకున్నాడు శైలేష్ కొలను. అంటే మూడో పార్టులో ఈ రెండు సినిమాల రిఫరెన్స్ ఉంటుందన్నమాట.

  ఇక మూడో పార్ట్ కోసం అర్జున్ సర్కార్ (నాని)ని దించబోతోన్నట్టుగా చివర్లో చూపించారు.మరి ఈ మూడో పార్ట్ ఇంకెలా ఉంటుందో చూడాలి. రెండో పార్ట్ మాత్రం అందరినీ ఎంగేజ్ చేసింది. సీటు అంచున కూర్చోబెట్టేసింది. శైలేష్ కొలను మరోసారి తన డీటైలింగ్ స్క్రీన్ ప్లేతో ఆకట్టుకున్నాడు.

  రేటింగ్ ౩

  చివరగా.. హిట్ 2.. నాని, శైలేష్‌లకు డబుల్ హిట్