• July 21, 2023

Ala IIa Ela అలా ఇలా ఎలా రివ్యూ.. మెప్పించే ట్విస్టులు

Ala IIa Ela అలా ఇలా ఎలా రివ్యూ.. మెప్పించే ట్విస్టులు

    Ala IIa Ela ఏ సినిమా తీసినా కూడా ప్రేమ అనేది కామన్ పాయింట్. లవ్ స్టోరీ లేకుండా సినిమాను ఊహించుకోలేం. హీరో హీరోయిన్ విలన్ అన్నది కచ్చితంగా ఉండాల్సిందే. అయితే ఈ ముగ్గురి పాత్రలను ఎలా చూపించారు? కథ, కథనాలను ఎలా రాసుకున్నారు అనే దాని మీదే సినిమా ఫలితం ఆధారపడి ఉంటుంది. అలాంటి ఓ చిత్రం నేడు థియేటర్లోకి వచ్చింది. అలా ఎలా ఇలా అంటూ వచ్చిన ఈ మూవీ ఎలా ఉందో ఓ సారి చూద్దాం.

    కథ
    అను (పూర్ణ)కి చిన్నప్పటి నుంచి కూడా ఓ అలవాటు ఉంటుంది. చందమామను తీసుకొస్తాను అని బుజ్జగిస్తూ నాన్న అన్నం తినిపించే ప్రయత్నం చేస్తాడు. చందమామ రాదు.. అది అబద్దం నాన్నా.. నాకు ఎప్పుడూ నిజాలే చెప్పాలి.. నేను కూడా నిజాలే చెబుతాను అనే టైపు అమ్మాయి అను. అబద్దాలంటే అనుకి ఇష్టం ఉండదు. అలాంటి అను జీవితంలోకి సూర్య (శక్తి వాసుదేవన్) వస్తాడు. సూర్య ఎవరు? జైలు నుంచి తప్పించుకున్న కార్తీక్ (రాజా చెంబోలు) ఎవరు? మిత్ర ఎవరు? అబద్దాలే సహించని అను జీవితంలో సూర్య, కార్తీక్ వల్ల వచ్చిన సమస్యలు ఏంటి? చివరకు అను ఏం చేసింది? అన్నది కథ.

    నటీనటులు
    అలా ఇలా ఎలా అనే సినిమా ఎక్కువగా ముగ్గురు పాత్రల చుట్టే తిరుగుతుంది. అను, సూర్య, కార్తీక్. ఈ మూడు పాత్రలు బాగున్నాయి. అను పాత్రకు న్యాయం చేసింది పూర్ణ. లుక్స్ పరంగా బాగుంది. నటన కూడా మెచ్చుకునేలా ఉంది. శక్తి వాసుదేవన్ పాత్ర ఎలాంటిది? అనేది చెప్పడం కష్టమే. రెండు రకాలుగానూ మెప్పిస్తాడు. ఇక కార్తీక్ కారెక్టర్లో రాజా బాగా చేశాడు. హీరో తండ్రిగా నాగబాబు, తల్లిగా సీత, హీరోయిన్ తల్లిగా సితార , తండ్రిగా షాయాజీ షిండే చక్కగా నటించారు. హీరోయిన్ రేఖ ఓ ముఖ్య పాత్రలో కనిపిస్తుంది.

    విశ్లేషణ
    ప్రేమను స్వచ్చమైన భావన అని అనుకునే వ్యక్తి ఒకరు.. ప్రేమ అనేది కోరిక అని అనుకునే మరో వ్యక్తి.. ప్రేమ కోసం పిచ్చి వాడయ్యే కారెక్టర్ ఇంకొకరు. ఇలా ప్రేమను ప్రధానంగా చూపించాలని అనుకున్న దర్శకుడు రాసుకున్న మూడు పాత్రలివి. వీటితో ప్రేమ, కోరిక, మోసం అనే వాటిని చూపించాడు. అయితే ఇందు కోసం రాసుకున్న సీన్లు కాస్త సిల్లీగా అనిపిస్తాయి. ఎక్కడా కొత్తదనం కనిపించదు. కానీ చెప్పాలనుకున్న పాయింట్‌ను క్లియర్‌గా తడబడకుండా సూటిగా చెప్పాడు దర్శకుడు.

    ప్రథమార్దం అంతా కూడా ఒక టోన్‌లో జరుగుతుంటుంది సినిమా. ఇందులో ఏం ఉంది అనుకునే టైంలో ట్విస్ట్ ఇస్తాడు. ఇంటర్వెల్‌కు ఇచ్చిన ట్విస్ట్ బాగుంటుంది. అయితే సెకండాఫ్‌లో అసలు పాయింట్ రివీల్ అవుతుంది. ఇక ఇంతేనా? సినిమా అనుకునే టైంలో ప్రీ క్లైమాక్స్‌‌లో మరో ట్విస్ట్ ఇస్తాడు. క్లైమాక్స్‌ను ఊహకందని విధంగా మలిచాడు దర్శకుడు.

    సాంకేతికంగా ఈ సినిమా మెప్పిస్తుంది. మణిశర్మ పాటలు, ఆర్ఆర్ సినిమాను నిలబెట్టాయి. సినిమాటోగ్రఫీ ఓకే అనిపిస్తుంది. నిడివి ఎక్కువైందనే ఫీలింగ్ ఉంటుంది. ఈ విషయంలో ఎడిటింగ్ డిపార్ట్మెంట్ ఇంకాస్త పని చేయాల్సి ఉంది. ఆర్ట్ డిపార్ట్మెంట్ పర్వాలేదనిపిస్తుంది. నిర్మాత బాగానే ఖర్చు పెట్టినట్టు అనిపిస్తుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.

    రేటింగ్ 2.75