- July 20, 2023
HER Review: HER రివ్యూ.. రుహానీ శర్మ యాక్షన్ అదుర్స్
HER Review: మాస్ మసాలా కమర్షియల్ చిత్రాలకు అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి రెస్పాన్స్ ఉంటుంది. అయితే సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ జానర్లకు మాత్రం ఓ వర్గం నుంచి మాత్రమే ఆదరణ ఉంటుంది. ఇలాంటి సినిమాలు థియేటర్లో, ఓటీటీలోనూ బాగా ఆడుతుంటాయి. తాజాగా రుహానీ శర్మ నటించిన HER మూవీ థియేటర్లోకి వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉందనేది ఓ సారి చూద్దాం.
కథ
సిటీలో ఓ జంట హత్య జరుగుతుంది. ఆ కేసును ఏసీపీ అర్చన ప్రసాద్ (రుహానీ శర్మ) చేతికి వస్తుంది. ఆరు నెలల పాటు సస్పెన్షన్‌కు గురైన అర్చన ప్రసాద్‌కు తిరిగి డ్యూటీలోకి జాయిన్ అవ్వగానే ఈ కేసు సవాల్‌గా మారుతుంది. తన ప్రియుడు శేషాద్రిని అర్చన ఓ నేరస్థుడిని (కేశవ్) పట్టుకునే ఆపరేషన్లో పోగొట్టుకుంటుంది. ఇక ఈ జంట హత్యల కేసులోనూ కేశవ్‌కు సంబంధించిన లీడ్ ఉంటుంది. కేశవకు సంబంధించిన కేసును ఎన్ ఐ ఏ చూస్తుంటుంది. అసలు ఆ జంట మధ్య ఉన్న సంబంధం ఏంటి? ఆ హత్యను ఎవరు చేశారు?ఎందుకు చేశారు? దాని వెనుకున్నది ఎవరు? కేశవ్ ఫ్లాష్ బ్యాక్ ఏంటి? అర్చన ప్రసాద్ ఈ కేసును ఎలా చేధించింది? అనేది కథ.
నటీనటులు
HER సినిమాలో ఎన్నో పాత్రలుంటాయి. ముఖ్యంగా కొన్ని పాత్రల చుట్టూ ఈ కథ తిరుగుతుంది. అందులో అర్చన ప్రసాద్ పాత్ర ముఖ్యం. ఏసీపీ అర్చన ప్రసాద్‌గా రుహానీ శర్మ అద్భుతంగా నటించింది. ఎంతో ఇంటెన్సిటీతో నటించింది. యాక్షన్, ఎమోషనల్ సీన్స్‌లో మెప్పిస్తుంది. ఇక ఆ తరువాత స్వాతిగా అభిజ్ఞ్య అక్కడక్కడా కనిపిస్తుంది. అనిల్ కారెక్టర్లో రవి వర్మ కనిపించినంత సేపు మెప్పిస్తాడు. విలన్ పాత్రలైనా లోహ్యా, కేశవ్‌లు ఓకే అనిపిస్తారు. వికాస్ వశిష్ట, ప్రదీప్ రుద్ర, జీవన్ కుమార్, అభిగ్న్య, సంజయ్ స్వరూప్, బెనర్జీ ఇలా అందరూ పర్వాలేదనిపిస్తారు.
విశ్లేషణ
శ్రీధర్ స్వరాఘవ్‌కు ఇది మొదటి సినిమానే అయినా ఎక్కడా ఆ ఛాయలు కనిపించదు. ఒక కేసును పోలీసులు ఎంత నిశితంగా గమనిస్తారు.. చిన్న చిన్న అంశాలను కూడా ఎంతగా పరిశీలిస్తారో.. చక్కగా చూపించాడు. ఇన్వెస్టిగేషన్ సీన్లను బాగా రాసుకున్నాడు. అయితే ఇవన్నీ కూడా చాలా సినిమాల్లో చూసినట్టుగా అనిపిస్తాయి. అయినా తెరపై మాత్రం ఎక్కడా బోర్ కొట్టించకుండా సినిమాను ముందుకు తీసుకెళ్లాడు దర్శకుడు.
ప్రథమార్దంలో దర్శకుడు ప్రేక్షకుల్లో ఎన్నో అనుమానాలను కలిగించేలా స్క్రీన్ ప్లే రాసుకున్నాడు. హత్య చేసింది ఎవరు? అసలు అర్చనా ప్రసాద్ ఫ్లాష్ బ్యాక్ ఏంటి? ఆమె లవ్ స్టోరీ ఏంటి? సెకండాఫ్‌లో ఏం జరుగుతుంది? అనే ఆసక్తిని కలిగించేలా దర్శకుడు కథను రాసుకున్నాడు. తాను అనుకున్న కథను పర్ఫెక్ట్‌గా, సింపుల్‌గా ఎగ్జిక్యూట్ చేశాడు దర్శకుడు. ఎలాంటి గందరగోళం లేకుండా కథ, కథనాన్ని నడిపించడంలో సక్సెస్ అయ్యాడు.
సాంకేతికంగానూ ఈ సినిమా మెప్పిస్తుంది. ఇలాంటి సినిమాలకు ఆర్ఆర్ ముఖ్యం. పవన్ అందించిన ఆర్ఆర్, విష్ణు బేసి సినిమాటోగ్రఫీ, చాణక్య తూరుపు ఎడిటింగ్ బ్యాక్ బోన్‌లా నిలిచాయి. నిర్మాత ఎక్కడా రాజీపడకుండా నిర్మించాడు. నిర్మాణ విలువలు ఉన్నతంగా అనిపిస్తాయి.
రేటింగ్ 3
బాటమ్ లైన్.. మొదటి చాప్టర్‌తో మెప్పించిన రుహానీ శర్మ