• November 9, 2021

ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చినట్టు!.. చిక్కుల్లో అల్లు అర్జున్

ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చినట్టు!.. చిక్కుల్లో అల్లు అర్జున్

    ఒక్కోసారి అలానే ఉంటుంది.. ఏదో చేద్దామని అనుకుంటే.. ఇంకేదో జరుగుతుంది. అయితే వాణిజ్య ప్రకటనల్లో మాత్రం మనం చేతులు దులిపేసుకుని వెళ్లలేం. ఎందుకంటే ఓ ప్రొడక్ట్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా మారిన తరువాత ఒక్కోసారి కొన్ని చిక్కుముళ్లు ఏర్పడతాయి. ప్రకటనల్లో ఈ మధ్య ఒక ప్రొడక్ట్‌ను పొగడాలంటే ఇంకో ప్రొడక్ట్‌ను కించపరచాల్సిందే అన్నట్టుగా మారిపోయింది. తాజాగా రాపిడో యాప్ కోసం క్రియేట్ చేసిన యాడ్,అందులో నటించిన అల్లు అర్జున్‌కు షాక్ తగిలింది.

    రాపిడో యాప్ గురించి అందరికీ తెలిసిందే. సిటీలో చాలా మంది ఓలా, ఉబర్ వంటి వాటిని వాడుతుంటారు. కానీ బైక్స్‌తో రాపిడో ఒక్కసారిగా దూసుకొచ్చింది. ఇప్పుడు రాపిడో ఫుల్ ఫాంలోకి వచ్చింది. ఇంక జనాల్లోకి తీసుకెళ్లేలానే ఉద్దేశ్యంతో బన్నీతో సౌత్ వరకు ఓ యాడ్ చేసింది రాపిడో. ఉత్తరాదిన రణ్ వీర్ సింగ్‌తో యాడ్ చేసింది. అయితే ఈ యాడ్ పట్ల తెలంగాణ ఆర్టీసీ భగ్గు మంది. ఆర్టీసీ ఎండీ సజ్జనార్ అల్లు అర్జున్‌కు షాక్ ఇచ్చాడు. ఆర్టీసీని కించపరిచేలా యాడ్ చేశారంటూ నోటీసులు పంపించారు.

    ఇంతకీ ఆ యాడ్ కథ ఏంటంటే.. దోశలు వేసేవాడిగా అల్లు అర్జున్ కనిపిస్తాడు. ఓ వ్యక్తికి రాపిడో గురించి వివరిస్తాడు. సాద దోశ లాంటివాడిని కూడా అందులోంచి వస్తే.. మసాలా దోశలా పిప్పిచేస్తారు.. చెమట పట్టకుండా గమ్యానికి చేరేసేయ్.. ఎందుకొచ్చిన పేరంటమండి..రాపిడో బుక్ చేసుకోండి.. చెమట పట్టకుండా గమ్యానికి చేరుకోండి.. అటో ఇటో ఎటో ఎక్కేయ్ రాపిడో అని అల్లు అర్జున్ తన స్టైల్లో యాడ్‌కు న్యాయం చేశాడు. కానీ ఆర్టీసీని కించపరిచాను అని గమనించలేకపోయాడు. అందుకే ఇలా చిక్కుల్లో ఇరుక్కున్నాడు. అయితే ఆర్టీసీ నోటీసులపై బన్నీ, రాపిడోలు ఎలా స్పందిస్తారో చూడాలి.

    Leave a Reply