Jai Bhim Review : జై భీమ్.. కదిలించిన సూర్య!

Jai Bhim Review : జై భీమ్.. కదిలించిన సూర్య!

    జై భీమ్.. ఈ సినిమా కథ ఏంటో టైటిల్‌లోనే చెప్పేశారు. అణగారిన వర్గాలు, బడుగు బలహీన వర్గాలు ఒకప్పుడు ఈ సమాజంలో ఎలా బతికాయి. వారిని ఎలా చూశారు.. అధికార, డబ్బు మదంతో కొందరు వారిని ఎలా అణగదొక్కేశారో చూపించే చిత్రమిది. తమిళనాడులో జరిగిన యథార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించేశారు. న్యాయవాది చంద్రూ వాదించిన ఓ కేసు నేపథ్యంలోనే ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. తమిళనాడు చరిత్రలోనే కాకుండా న్యాయవ్యవస్థలోనూ ఆ కేసు ఎప్పటికీ నిలిచిపోతోంది. అలాంటి సినిమాను నేపథ్యంగా ఎంచుకుని సూర్య నటించి నిర్మించిన సినిమాయే జై భీమ్.

    కథ.
    తమిళనాడులో ఓ ప్రత్యేక. కొండజాతి గిరిజనుల్లాంటి వారు. పాములు పట్టడం, కలుగుల్లో దాక్కున్న ఎలుకలను ఎంతో నైపుణ్యంతో పొగబెట్టి మరీ పట్టడం వారి వృత్తి. వారికి అది తప్పా ఇంకో ప్రపంచం తెలియదు. ఉండదు. వారు అడుగడుగునా వివక్షకు గురవుతూనే ఉంటారు. వారు అడుగు, వారి చూపు పడితే పాపం అన్నట్టుగా అగ్రవర్ణాలు ప్రవర్తిస్తాయి. అయితే ఓ సారి ఆ ఊరి ప్రెసిడెంట్ ఇంట్లో పాము వస్తుంది. అది నగల పెట్టె వద్ద ఉంటుంది. ఆ పామును పట్టుకునేందుకు రాజన్న అనే వ్యక్తిని పిలుస్తారు. అతను ఎంతో చాకచక్యంగా పామును పడతాడు. అయితే ఆ తరువాత ఆ ఇంట్లో దొంగతనం జరుగుతుంది. అది చేసింది రాజన్నే అని కేసు పెడతాడు. దీంతో పోలీసులు కొండ ప్రజల మీద తమ అధికారాన్ని చూపిస్తారు. ఆడ, మగ, గర్భంతో ఉందని కూడా చూడకుండా చిత్రహింసలు పెడతాడు. అందులో రాజన్న భార్య చిన్నతల్లి నిండు గర్భిణి. అయినా కూడా పోలీసులు ఏ మాత్రం కనికరించరు. చివరకు అరెస్ట్ చేసిన వారంతా తప్పించుకున్నారంటూ పోలీసులు బుకాయిస్తారు. దీంతో చినతల్లి తన భర్త రాజన్న కోసం వెతికి వెతికి అలిసిపోతోంది.

    అయితే చెన్నై హైకోర్టులో న్యాయవాది బడుగు బలహీన వర్గాల కోసం పోరాడుతూ ఉంటాడు చంద్రు (సూర్య). న్యాయం కావాలి అంటూ న్యాయస్థానంలో లేదా రోడ్డు మీద పోలీసులకు వ్యతిరేకంగా ధర్నాలు చేస్తూనే ఉంటాడు. అలాంటి చంద్ర వద్దకు చిన్నతల్లి వస్తుంది. జరిగింది మొత్తం వివరిస్తుంది. తన భర్తను తనకు తెచ్చిస్తారా? సారూ అని అడుగుతుంది. దీంతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా, పోలీసు అధికారులకు వ్యతిరేకంగా హెబియర్ కార్పస్ పిటీషన్‌ను రాజన్న కోసం చిన్నతల్లి తరుపున చంద్ర వేస్తాడు. అక్కడి నుంచి కథ మలుపు తిరుగుతుంది. అసలు ఆ దొంగ తనం చేసింది ఎవరు? రాజన్న ఏమయ్యాడు? ఎందుకు తప్పించుకున్నాడు? నిజంగానే తప్పించుకున్నాడా? లేక పోలీసులు ఏమైనా చేశారా? ఈ కేసులో చంద్రు ఎలా గెలిచాడు? ఎలా న్యాయం చేయగలిగాడు? అనేదే జై భీమ్.

    నటీనటులు
    జై భీమ్ సినిమాలో ఎన్నో పాత్రలున్నాయి. మొత్తంగా అయితే ఇందులో చంద్రూ పాత్రలో న్యాయవాదిగా సూర్య కనిపిస్తాడు. న్యాయం కోసం పోరాడే నీతివంతమైన లాయర్‌గా కనిపిస్తాడు. ఒక్క రూపాయి కూడా ఫీజు తీసుకోకుండా కేవలం న్యాయం కోసం మాత్రమే పని చేస్తాడు. అంత నిజాయితీ గత పాత్రలో సూర్య జీవించేశాడు. ఎన్నో సీన్స్‌లో కంటతడి పెట్టించేలా నటించేశాడు. ఇక కోర్ట్ రూంలో అయితే అసలు సిసలు వకీల్‌లా వాదించేశాడు. ఆ తరువాత చినతల్లికే ఎక్కువ మార్కులు పడతాయి. సినిమాలో చాలా వరకు గర్భంతోనే కనిపిస్తుంది. ఒకప్పుడు పోలీసులకు భయభయంగా వణుకుతూ కళ్లలో బెరుకు చూపిస్తూ ఉండే చినతల్లి ఒకానొక సీన్‌లో పోలీసుల కళ్లలోకి కళ్లు పెట్టి చూస్తూ.. నువ్వెంత అనేట్టు ఓ నవ్వు నవ్వేస్తుంది. ఇక డీజీపీ ఎదుట నిలబడి ధైర్యంగా చెప్పే మాటలు అందరినీ టచ్ చేస్తాయి. ప్రకాష్ రాజ్, జయ ప్రకాష్, రావు రమేష్ ఇలా అందరూ కూడా తమ తమ పాత్రల్లో అద్భుతంగా నటించేశారు.

    విశ్లేషణ

    జై భీమ్ సినిమా వాస్తవ సంఘటనల ఆధారంగానే తీశామని చెప్పేశారు. 1995 ప్రాంతంలో ఈ చిత్రం జరుగుతుంది. అప్పటి పరిస్థితులు ఎలా ఉండేవో కళ్లకు కట్టినట్టు చూపించారు. కొండ జాతి ప్రజలు, గిరిజనులకు అసలు జనాభా లెక్కల్లో చోటే ఉండేది కాదు. ఇదే విషయాన్ని దర్శకుడు జ్ఞానవేల్ చూపించాడు. వీళ్లకు కూడా ఓటు హక్కు ఇప్పించి.. ఎన్నికల సమయంలో వీళ్ల కాళ్లు కూడా పట్టుకోవాలా? వీళ్లకు అవన్నీ అవసరమా? అంటూ అనే సీన్‌తో అసలు కథ అందరికీ అర్థమవుతుంది. అమాయక గిరిజనుల మీద తప్పుడు కేసులు ఎలా పెట్టేవారో క్లియర్‌గా చూపించాడు దర్శకుడు. వారి కోసం ఎవరూ రారు.. వారినేం చేసినా ఎవ్వరూ అడిగే వారు లేరు అనే ధైర్యంలో అధికారులు వారిని ఎన్నిరకాలుగా చిత్రహింసలు పెట్టేవారో చూపించాడు.

    డబ్బు అధికారం ఉన్న వాళ్లు బలహీన వర్గాలను ఎలా వాడుకున్నారు.. ఆడుకున్నారు అనేది ఎంతో క్లియర్‌గా చూపించాడు. క్రైమ్ సస్పెన్స్ డ్రామాగా నడిచినా కూడా ఎక్కడా ఎమోషన్‌ను మిస్ అవ్వకుండా క్యారీ చేయించాడు. రాజన్న ఉన్నాడా? లేడా? అసలు ఏమై పోయాడా? పోలీసులు ఆడుతున్న నాటకం ఏంటి? ఇన్ని రకాలుగా దారులు మూసుకుపోయిన్న కేసును చంద్రూ ఎలా ముందుకు నడిపిస్తాడు? అనే ఆసక్తిని అందరిలోనే రేకెత్తించేశాడు డైరెక్టర్.

    ఒక సందర్భంలో చినతల్లితో ఓ డైలాగ్ చెప్పిస్తాడు డైరెక్టర్. మాకు శక్తి ఉంది.. మాది మేం సంపాదించుకుని బతకగలం. అలాంటప్పుడు మేం ఎందుకు దొంగతనం చేస్తామని పోలీసులతో అంటుంది. ఆ సమయంలో వారిలో ఆత్మ స్థైర్యాన్ని మనకు చూపించేశాడు దర్శకుడు.

    అందరికీ అన్ని రకాల హక్కులుంటాయి.. వారిని కూడా గౌరవంతో బతకనివ్వాలి అంటూ సూర్యతో చెప్పిన కొన్ని డైలాగ్స్ అద్భుతంగా ఉన్నాయి. ఇక చివరి షాట్‌లో చంద్రూ (సూర్య) తన కాళ్ల మీద కాళ్లు వేసుకుని పేపర్ చదువుతుంటాడు. పక్కనే రాజన్న కూతురు కూడా కుర్చీలో కూర్చుని ఉంటుంది. భయభయంగానే పేపర్ చేతిలోకి తీసుకుంటుంది.. చంద్రూలానే కాలు మీద కాలు వేసుకుని కూర్చుని పేపర్ చదవాలని అనుకుంటుంది. కానీ కాస్త భయపడుతుంది. ఓకే కానీయ్ అంటూ చంద్రూ సిగ్నల్ ఇవ్వడంతో రాజన్న కూతురు కాలు మీద కాలు వేసుకుని హ్యాపీగా పేపర్ చదువుకుంటుంది. ఈ ఒక్క ఎండింగ్ సీన్‌తో అందరిలోనూ తెలియని ఫీలింగ్ నింపేశాడు దర్శకుడు.

    సమాజంలో అందరూ సమానమే.. ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ కాదనడానికి సింబాలిక్‌గా లాస్ట్ షాట్ పెట్టినట్టు కనిపిస్తోంది. మొత్తానికి జై భీమ్ సినిమా మాత్రం అందరినీ ఎంగేజ్ చేస్తుంది. ముందుకు వెళ్తున్న కొద్దీ సినిమాలో ఇంకా లీనమవుతారు. ఆ పాటల్లో తమిళ నేటివిటీ ఎక్కువగా కనిపిస్తుంది. అది మనకు అంతగా ఎక్కవు. కానీ నేపథ్య సంగీతం అద్భుతంగా ఉంది. నాటి విలెజ్ సెటప్ తీసుకు రావడానికి ఆర్ట్ డైరెక్టర్, కెమెరామెన్ పడ్డ కష్టాలు కనిపిస్తాయి. ఎడిటిర్ కూడా తన బాధ్యతను చక్కగా నిర్వర్తించాడు. నిర్మాత, నటుడిగా సూర్య మరో మెట్టు ఎక్కేశాడు.

    చివరగా.. ఎప్పటికీ నిలిచేలా ‘జై భీమ్’

    రేటింగ్ : 3.5

    Leave a Reply