- August 18, 2023
Prem Kumar Movie Review.. ప్రేమ్ కుమార్ రివ్యూ.. పెళ్లి కోసం పాట్లు

Prem Kumar Movie Review And Rating సంతోష్ శోభన్ హీరోగా వచ్చే సినిమాల మీద క్లాస్ ఆడియెన్స్‌కు కాస్త సాఫ్ట్ కార్నర్ ఉంటుంది. సినిమాలు ఎలా ఉన్నా కూడా సంతోష్ యాక్టింగ్ బాగానే ఉంటుందని జనాల్లో ఓ మార్క్ ఉంది. సంతోష్ శోభన్ సరైన హిట్టు కోసం బాగానే కష్టపడుతున్నారు. ఈ క్రమంలోనే ప్రేమ్ కుమార్ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మరి ఈ చిత్రం ఆడియెన్స్‌ను ఎంత వరకు మెప్పించిందో ఓ సారి చూద్దాం.
కథ
ప్రేమ్ కుమార్ (సంతోష్ శోభన్)కు నిత్య (రాశీ సింగ్) తొలి పెళ్లి చూపులు, పెళ్లి కలిసి రాదు. పెళ్లి పీటల మీదే పెళ్లి ఆగిపోతుంది. అప్పటి నుంచి ప్రతీ పెళ్లి ఏదో ఒక సమస్యతో ఆగిపోతూనే ఉంటుంది. పెళ్లి చూపులు సైతం వర్కౌట్లు కావు. పెళ్లి కోసం ప్రేమ్ కుమార్ నానా పాట్లు పడుతూనే ఉంటాయి. మ్యాట్రిమోని సైట్లను ఆశ్రయిస్తాడు. పెళ్లి కోసం ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని ప్రయత్నాలు చేస్తాడు. కానీ ఒక్కటీ సక్సెస్ అవ్వదు. పెళ్లి ఎన్ని రకాలుగా ఆగిపోద్ది.. ఎన్నిరకాలుగా ఆపొచ్చు అనే దాంట్లో అనుభవం వస్తుంది. అదే అనుభవాన్ని పెట్టి.. ఓ డిటెక్టివ్ ఏజెన్సీ ఓపెన్ చేసి పెళ్లిళ్లు అపే ప్రోగ్రాం పెట్టుకుంటాడు ప్రేమ్ కుమార్. మరో వైపు నిత్య (రాశీ సింగ్) పెళ్లిళ్లు జరిపే ఈవెంట్ మేనెజ్మెంట్ నిర్వహిస్తుంటుంది. వీరిద్దరూ మళ్లీ కలుసుకుంటారా? వీరిద్దరి మధ్య ప్రేమ చిగురిస్తుందా? అసలు నిత్య ప్రేమించిన రైజింగ్ స్టార్ రోషన్ అసలు స్వరూపం ఏంటి? ఈ కథలో అంగనా (రుచిత) పాత్ర ఏంటి? చివరకు ప్రేమ్ కుమార్ పెళ్లి, ప్రేమ సక్సెస్ అవుతుందా? లేదా? అన్నది కథ.
నటీనటులు
ప్రేమ్ కుమార్ పాత్రకు సంతోష్ శోభన్ వంద శాతం న్యాయం చేశాడు. ప్రస్తుతం యువత ఎదుర్కొంటోన్న ప్రధాన సమస్యను సంతోష్ శోభన్ చూపించాడు. పెళ్లి కోసం తాపత్రయపడే కుర్రాడి పాత్రలో సంతోష్ చక్కగా నటించాడు. ఎప్పటిలానే సహజమైన నటన, కామెడీ టైమింగ్‌తో ఆకట్టుకున్నాడు. ఇందులో ఎమోషనల్ సీన్స్‌లోనూ ఆకట్టుకున్నాడు. హీరోయిన్ల పాత్రలైన నిత్య, అంగనాలకు ప్రేక్షకులు కనెక్ట్ అవుతారు. ఇద్దరూ అందంగా కనిపించారు. తెరపై చక్కగా నటించారు. డాడీ కారెక్టర్లో సుదర్శన్ నవ్విస్తాడు. రైజింగ్ స్టార్ రోషన్ పాత్ర కూడా ఆకట్టుకుంటుంది. హీరో ఫ్రెండ్ పాత్ర ఆద్యంతం నవ్విస్తూనే ఉంటుంది.
విశ్లేషణ
ప్రేమ, పెళ్లి కాన్సెప్టులు అనేవి సినిమా కథలకు ఎప్పుడూ ఎవర్ గ్రీన్ పాయింటే. ఏ సినిమాలో అయినా సరే ప్రేమ, పెళ్లి సీన్లు ఉంటాయి. ఈ ప్రేమ్ కుమార్ సినిమా అంతా కూడా పెళ్లి చుట్టే తిరుగుతుంది. పెళ్లి సంబంధాలు రాకపోతే, పెళ్లిళ్లు చెడిపోతూ ఉంటే.. చుట్టు పక్కల ఉండేవారు, ఈ సమాజం ఎలా హేలన చేస్తుందో ఇందులో చూపించారు. పెళ్లి కోసం హీరో చేసే ప్రయత్నాలు నవ్విస్తాయి. ఇక పెళ్లిళ్లను చెడగొట్టే క్రమంలోనూ హీరో చేసే పనులు నవ్విస్తాయి. ఫస్ట్ హాఫ్ అంతా కూడా అలా సరదాగా సాగుతూ ఉంటుంది.
సెకండాఫ్‌కి వచ్చే సరికి కథ కాస్త ఎమోషనల్‌గా సాగుతుంది. కానీ అందులోనూ కామెడీని పెట్టి వర్కౌట్ చేయించాడు దర్శకుడు. ఇక డైరెక్టర్ రాసిన కౌంటర్లు, పంచ్ డైలాగ్స్ బాగుంటాయి. కమెడియన్, హీరో పాత్రలన్న తేడా లేకుండా అందరికీ పంచ్ డైలాగ్స్ రాసేశాడు దర్శకుడు. రైటర్ కమ్ దర్శకుడు అయితే ఇలాంటి సౌలభ్యాలుంటాయి. అయితే ప్రేమలో సంఘర్షణను మాత్రం అంతగా ఎలివేట్ చేయలేకపోయాడనిపిస్తుంది. క్లైమాక్స్, ప్రీ క్లైమాక్స్ మరింత ఎమోషనల్‌గా చూపిస్తే ప్రేక్షకులకు మరింతగా కనెక్ట్ అయ్యేదనిపిస్తుంది.
సాంకేతికంగా ఈ సినిమా మెప్పిస్తుంది. పాటలు సందర్భానుసారంగా వస్తాయి. కాస్త వినసొంపుగానే ఉంటాయి. ఆర్ఆర్ ఓకే అనిపిస్తుంది. కెమెరా వర్క్ బాగుంటుంది. సహజమైన లొకేషన్లలో తెరకెక్కించడంతో స్క్రీన్ కాస్త ఫ్రెష్‌గా కనిపిస్తుంది. ఎడిటింగ్ ఓకే అనిపిస్తుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. నిర్మాతల ఖర్చు తెరపై కనిపిస్తుంది.
రేటింగ్ 2.75