• August 22, 2023

Mega Star Chiranjeevi : తెరపై ఎప్పటికీ‘విజేత.. ఎందరికో చేయూత.. చిరు పుట్టిన రోజు స్పెషల్

Mega Star Chiranjeevi : తెరపై ఎప్పటికీ‘విజేత.. ఎందరికో చేయూత.. చిరు పుట్టిన రోజు స్పెషల్

    Mega Star Chiranjeevi Birthday మామూలుగా చరిత్రలో ఎందరి పేర్లో ఉంటాయి.. కానీ ఓ పేరుకే చరిత్ర ఉండటం చాలా అరుదుగా ఉంటుంది. ఆ పేరే మెగాస్టార్ చిరంజీవి. తెలుగు చిత్ర సీమకు సంబంధించిన చరిత్ర రాయాల్సి వస్తే.. రెండు భాగాలు రాయాల్సిందే.. అందులో చిరంజీవి రాక ముందు ఒక భాగం.. వచ్చాక ఇంకో భాగం.. అవుతుంది. అంతలా చిరంజీవి ఈ టాలీవుడ్‌ గతిని తిప్పాడు. అంతకు ముందెన్నడూ చూడని డ్యాన్సులను, నటనను, మ్యానరిజాన్ని, స్టైల్‌ను చూపించాడు. చిరు హెయిర్ స్టైల్, డ్రెస్సులకు అప్పట్లో ఉన్న డిమాండ్ ఇప్పటి నిబ్బా బ్యాచ్‌లకు, పిల్లలకు తెలియదు.

    ఇప్పుడంటే సోషల్ మీడియా పెరిగింది.. అందరికీ అందుబాటులో స్మార్ట్ ఫోన్లున్నాయి. ఏది పడితే అది.. ఎవరు పడితే వాళ్లు పిచ్చి కూతలు కూస్తూ ఉండొచ్చు.. చిరంజీవి అంతటి మహా శిఖరాన్ని విమర్శించొచ్చు. కానీ ఆ శిఖరం నుంచి ఓ చిన్న ముక్క కూడా రాలిపడదు.. ఆకాశం మీద ఉమ్మేస్తే అది మన మీద పడుతుంది.. చిరంజీవి మీద విమర్శలు చేస్తే ఆయనకు పోయేదేమీ ఉండదు.. పడ్డవాడెప్పుడూ చెడ్డవాడు కాదన్నట్టుగా.. ఆయన సినిమాలు ఆడకపోతే.. ట్రోలింగ్ చేస్తున్నారు.. కానీ యావరేజ్ టాక్‌లతో రికార్డులు క్రియేట్ చేశాడని మరిచిపోతోన్నారు. ఆయన చూడని ఇండస్ట్రి హిట్లు, బాక్ల్ బస్టర్ హిట్లున్నాయా?.. ఆచార్య, గాడ్ ఫాదర్, భోళా శంకర్‌లు ఎన్ని వచ్చినా.. ఒక్కటి సరైన సినిమా పడితే అన్ని రికార్డులు బద్దలవుతాయని అందరికీ తెలుసు.

    ఇక ఆయన తెరపై ఎప్పటికీ విజేత.. ప్రయోగాలు చేస్తూ స్వయం కృషితో ఎదిగాడు. ఎంతో మందికి బాట చూపిస్తూ అందరి వాడు అయ్యాడు. ఇంకెంతో మందికి చేయూత నిచ్చి తనతో పాటు ఇండస్ట్రీలో ఎదిగేట్టు చేశాడు. ఇక సేవా కార్యక్రమాల గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎంతో మంది ఎన్నో రకాలుగా సాయం చేశాడు. అభిమానుల కష్టాలను తీర్చే త్రినేత్రుడు.. ఆదుకునే ఆపద్భాంధవుడు. రాజకీయాల్లో ఫ్లాప్ అయినా.. మంచి మనిషిగా, అవినితి మచ్చలేని ఇంద్రుడిగా నిల్చున్నారు. ఇప్పుడు ఎప్పుడూ ఆయన అందరివాడు.. ఎవ్వరికీ అందనివాడే.