• February 28, 2026

సన్ ఆఫ్ రివ్యూ.. ఆకట్టుకునే ఎమోషనల్ స్టోరీ

సన్ ఆఫ్ రివ్యూ.. ఆకట్టుకునే ఎమోషనల్ స్టోరీ

    సాయి సింహాద్రి సైన్మా బ్యానర్ మీద సాయి సింహాద్రి హీరోగా, నిర్మాతగా చేసిన చిత్రం ‘సన్ ఆఫ్’. ఈ మూవీని బత్తుల సతీష్ తెరకెక్కించారు. ఈ చిత్రంలో వినోద్ కుమార్, మీరా రాజ్ కీలక పాత్రల్ని పోషించారు. ఈ సినిమాని ఫిబ్రవరి 27న రిలీజ్ చేశారు. తండ్రీకొడుకుల సెంటిమెంట్‌తో వచ్చిన ఈ చిత్రం ఆడియెన్స్‌ని ఏ మేరకు ఆకట్టుకుందో ఓ సారి చూద్దాం.

    కథ
    వెంకట్రావు (వినోద్ కుమార్) తన భార్య చనిపోవడంతో అన్నీ తానై తన కొడుకు ఆనంద్ (సాయి సింహాద్రి)ని చూసుకుంటాడు. అయితే కొడుకు మాత్రం ఎప్పుడూ కూడా తండ్రీ ఆశలకు అనుగుణంగా పెరగడు. ప్రతీ సారి చదువుల్లో ఫెయిల్ అవుతూ ఉంటాడు. ఇక ఊర్లోనే అను (మీరా రాజ్)తో అతనికి చిన్నతనం నుంచి స్కూల్‌లో లవ్ స్టోరీ ఉంటుంది. అను, ఆనంద్ ఆ ప్రేమకు అందరూ ఒప్పుకుంటారు. కానీ ఎంగేజ్మెంట్ టైంకి వెంకట్రావు అడ్డం తిరుగుతాడు. పనీ పాట లేని గాలికి తిరిగే తన కొడుకు ఎలా నచ్చాడు? అసలు ఈ పెళ్లికి ఎలా ఒప్పుకున్నారు? అంటూ అందరి ముందు వెంకట్రావ్ పరువు తీస్తాడు. దీంతో వారసత్వంగా రావాల్సిన ఆస్తిని, ఇంటిని తనకు ఇప్పించండి అంటూ కన్న తండ్రి మీదే ఆనంద్ కేసు వేస్తాడు. ఆ తరువాత ఏం జరిగింది? ఆస్తిని ఇచ్చేందుకు తండ్రి పెట్టిన కండీషన్ ఏంటి? చివరకు జీవితం విలువ, బరువు, బాధ్యతల గురించి ఆ కొడుకు తెలుసుకుంటాడా? తన ప్రేమను గెలిపించుకుంటాడా? అన్నది కథ.

    తండ్రీ కొడుకుల నేపథ్యంలో ఎన్నో కథలు వచ్చాయి. సన్ ఆఫ్ కథ కూడా కొత్తగా ఏమీ అనిపించదు. కానీ ప్రస్తుతం ఉన్న యువతరానికి మేల్కొలుపులా ఉంటుంది. బాధ్యత లేకుండా గాలికి తిరిగితే జీవితంలో ఎదురయ్యే సమస్యలు, కష్టాల్ని చక్కగా చూపించాడు. జీవితంలో ప్రేమ, బంధాలు,బరువు,బాధ్యతల గురించి యువత తెలుసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పే క్రమంలో తీసిన సన్ ఆఫ్ అందరినీ ఆకట్టుకునేలా ఉంది.

    ఫస్ట్ హాఫ్ అంతా కూడా తండ్రీకొడుకుల మధ్య ఉండే దూరం, హీరో గాలి తిరుగుడు, హీరోయిన్‌తో ప్రేమ ఇలా సరదాగా సాగుతూ ఉంటుంది. కథలో అసలు సంఘర్షణ, టర్నింగ్ పాయింట్ అంతా కూడా ఇంటర్వెల్ బ్లాక్‌కి వస్తుంది. కోర్ట్‌లో వినిపించే వాదనలు, తండ్రీ పెట్టే కండీషన్‌తో కథలో ఆసక్తి పెరుగుతుంది. ఆ తరువాత సెకండాఫ్‌లో బిడ్డను పెంచేందుకు ఆనంద్ పడే కష్టాలు, ఎమోషనల్ ట్రాక్‌తో కంటతడి పెట్టిస్తారు. చివర్లో వచ్చే ట్విస్ట్ అందరినీ షాక్‌కు గురి చేస్తుంది. అయితే చివరకు ఓ పూర్తి సంతృప్తికరమైన సినిమాని చూశామనే ఫీలింగ్‌ను మాత్రం కలిగేలా చేస్తుంది.

    సాయి సింహాద్రి ఆనంద్ అనే పాత్రలో ఎంతో ఒదిగిపోయాడు. తొలి సినిమా, కొత్త హీరో అన్న ఫీలింగ్ ఎక్కడా కలగదు. అన్ని రకాల ఎమోషన్స్‌ను పలికించాడు. కామెడీ, యాక్షన్, ఎమోషన్స్ ఇలా అన్ని రకాలుగా సాయి సింహాద్రి మెప్పించాడు. ఇక తండ్రి పాత్రలో వినోద్ కుమార్ తన అనుభవాన్ని చూపించారు. కొత్త హీరోయిన్ మీరా రాజ్.. అను అనే పాత్రలో చక్కగా కనిపించడమే కాకుండా అద్భుతంగా నటించింది. మిగిలిన పాత్రలన్నీ కూడా తమ పరిధి మేరకు మెప్పిస్తాయి.

    సాంకేతికంగా చూసుకుంటే సంగీతం, విజువల్స్ ఈ చిత్రానికి ప్రధాన బలం. ఫీల్ గుడ్ మ్యూజిక్‌తో సాగే పాటలు అందరినీ ఆకట్టుకుంటాయి. గ్రామీణ వాతావరణాన్ని తెరపై మరింత అందంగా చూపించారు. అలా మ్యూజిక్ డైరెక్టర్, కెమెరామెన్‌ ఈ మూవీని తమ భుజాల మీద మోశారు. ఎడిటింగ్, ఆర్ట్, క్యాస్టూమ్ ఇలా అన్ని డిపార్ట్మెంట్స్ చేసిన వర్క్ చక్కగా కుదిరింది. ఇక తొలి సినిమా అయినా, ప్రొడక్షన్‌లో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సాయి సింహాద్రి చాలా గొప్పగా ఈ మూవీని నిర్మించారు. నిర్మాణ విలువలు ఎంతో ఉన్నతంగా కనిపిస్తాయి.

    రేటింగ్ 2.75