సప్తసాగరాలు దాటి సైడ్ ఏ రివ్యూ.. ఇదొక జీవితం

సప్తసాగరాలు దాటి సైడ్ ఏ రివ్యూ.. ఇదొక జీవితం

  కొన్ని సినిమాలు అందరికీ నచ్చాలని లేదు..  సినిమాల్లో నిజజీవితానికి, వాస్తవికతను దూరంగా ఉండేవి ఉంటాయి.. కొన్ని మన జీవితాల్లోంచే తీసుకుని చేసినవి ఉంటాయి. మనుషుల జీవితాల్లోంచి, వారి ప్రేమ, బాధ, ఆవేదనల్లోంచి తీసుకుని చేసే కథలు గుండెను బరువెక్కిస్తుంటాయి. అలాంటి సినిమాలు చూడాలంటే కూడా కాస్త గుండెను కఠిన పర్చుకోవాల్సి వస్తుంది. సినిమాలో పాత్రలు ఏడిస్తే.. మనం ఏడ్వడం, ఆ పాత్రలకు సమస్యలు వస్తే మనం కదిలిపోవడం అన్ని సినిమాలకు జరగదు. అలా జరగాలంటే ఆ పాత్రలతో మన ప్రయాణం చేయగలగాలి.. అలా కనెక్ట్ చేయించగలగాలి దర్శకుడు.

  ఇప్పుడు కన్నడలో సప్త సాగార ఎల్లో అంటూ వచ్చిన చిత్రం తెలుగులోకి సప్తసాగరాలు దాటి అంటూ వచ్చింది. ఇది రెండు పార్టులుగా వస్తుండటంతో.. మొదటి పార్టులో సగ జీవితాన్ని చూసినట్టుగా అనిపిస్తుంది. పూర్తి జీవితాన్ని చూస్తే గానీ సంతృప్తి ఉండదన్నట్టుగా సినిమా అందరినీ వెంటాడుతుంది. మను (రక్షిత్ శెట్టి), ప్రియ (రుక్మిణి)  జీవితం తలుచుకుని ప్రేక్షకుల గుండె సైతం బరువెక్కిపోతుంది.

  మను, ప్రియలు గాఢంగా ప్రేమించుకుంటారు. ఒకరి కోసం ఒకరు బతుకుతుంటారు. మధ్య తరగతి బతుకులు, చిన్న చిన్న కలలు కంటూ బతికేస్తుంటారు. సింగర్ అవ్వాలని ప్రియ అనుకుంటుంది. సొంతింటి కలను కంటూ ఉంటారు. ప్రియకు బీచ్ పక్కన ఇళ్లు కొనుక్కుని హాయిగా మనుతో కలిసి బతికేయాలని అనుకుంటుంది. మను ఏమో ఓ పెద్దింట్లో కారు డ్రైవర్‌గా పని చేస్తాడు. ఇలాంటి  స్థోమతతో అలాంటి కలలను నెరవేర్చుకోవడం కష్టమైన పనే. అయితే ప్రియ కోసం మను ఓ సాహాసం చేస్తాడు. దాని వల్ల మను, ప్రియల జీవితం ఎలా మారింది? ఈ ఇద్దరి మధ్య ఎడబాటు ఎలా వచ్చింది? పద్మవ్యూహంలాంటి జైల్లో చిక్కుకున్న మను బయటకు వస్తాడా? వస్తే అప్పటికి పరిస్థితులు ఎలా మారాయి? అసలు మను జైల్లోనే ఇరుక్కోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? అనేది కథ.

  ఈ చిత్రంలో ఏ పాత్ర కూడా ఏదో నటించేయాలని నటించినట్టుగా కనిపించదు. సహజంగా అనిపిస్తాయి. బయట సమాజం అయినా, లోపల జైలు వాతావరణం అయినా కూడా ఎంతో న్యాచురల్‌గానే అనిపిస్తుంది. ప్రియ, మనుల ప్రేమను చూపించిన తీరు, ఒకరిపై ఒకరికి ఉండే నమ్మకం, అభిమానం చూపించే విధానం అందరికీ నచ్చుతుంది. అయితే ఈ సినిమా మన జీవితాల్లానే చాలా నెమ్మదిగా సాగుతుంటాయి. జీవితంలో ఏది కూడా ఒక్క రోజులోనే మారదు.. మనకు ఈ రోజు నచ్చలేదు కదా? అని వేగంగా వెళ్లదు.. అలానే ఈ సినిమా సైతం పరిగెత్తదు. చాలా నిదానంగా సాగుతుంది. అంత ఓపిక ఉంటేనే ఈ చిత్రాన్ని చూడగలం, ఆస్వాధించగలం.

  ఈ సినిమాను చూస్తుంటే.. ఒక్కోసారి మన గుండె చాలా ఒత్తిడికి, భావోద్వేగానికి గురైనట్టుగా అనిపిస్తుంది. వారి మధ్య వచ్చిన సమస్యలు, విధి వారిని దూరం చేసిన తీరు, హీరో హీరోయిన్లు కష్టాలు పడే తీరు చూసి ప్రేక్షకుడు కదిలిపోతాడు. కొందరు స్వార్థం, ఇంకొందరి కుట్రల మధ్య హీరో పాత్ర నలిగిపోతుంది. హీరో కోసం హీరోయిన్ పడే తాపత్రయం, ఎదురు చూసే తీరు, పోరాడే విధానం ప్రేమకు నిదర్శనంగా అనిపిస్తుంది.

  ప్రేమించిన అమ్మాయి కోసం ఆ ప్రేమను, ఆ అమ్మాయిని వదులుకునేందుకు సిద్దపడ్డ హీరోకి చావే శరణ్యం అనుకుంటాడు. అంత వరకు తాను అనుచుకున్న కోపాన్ని ఒక్కసారిగా జైల్లో చూపిస్తాడు. చావుకు సిద్దపడ్డ వాడు దేనికీ భయపడడు అనేలా ఆ సీన్ అనిపిస్తుంది. ఇక తాను ప్రేమించిన అమ్మాయి పెళ్లి పీటలెక్కుతోందని, దూరం అయిందని ఊహించుకున్న తరువాత బతకడం వృథా, బతికి చేసేదేం లేదని హీరో అనుకున్నట్టుగా ప్రేక్షకుడికి అనిపిస్తుంది. అలా మొదటి పార్ట్ ముగుస్తుంది.

  రెండో పార్ట్ మీద ప్రేక్షకుడికి ఆశ పెరుగుతుంది. పదేళ్ల తరువాత బయటకు వచ్చిన హీరో ఏం చేస్తాడు.. తనకు అన్యాయం చేసిన వాళ్లని ఏం చేస్తాడు.. పెళ్లి చేసుకుని కాపురం చేసుకుంటున్న తన ప్రేయసిని చూసి ఏం అవుతాడు? అసలు ప్రియ, మనుల జీవితం ఎటు మలుపు తిరుగుతుంది? ఏం అవుతుంది? అనేది సైడ్ బీలో చూపించబోతోన్నాడు.

  సాంకేతికంగా ఈ చిత్రం ఓ కావ్యంలా అనిపిస్తుంది. ఫోటోగ్రఫీ అయినా, మాటలు అయినా, సందర్భానుసారంగా వచ్చే పాటలు అయినా కూడా ఓ కవిత్వంలానే అనిపిస్తుంది. ప్రేమలో మునిగి, విషాదంలో తేలి, బతుకు మీద ఇంకా ఆశ ఉండేవారికి సప్తసాగరాలు దాటి సినిమా కదిలిస్తుంది. సహజత్వానికి దగ్గరా ఉండే ఈ సప్తసాగరాలు రెండో పార్ట్ కోసం వేచి చూసేలా చేయడంలో దర్శకుడు సఫలం అయ్యాడు.

  ప్రేమికుడిగా మను పాత్రలో రక్షిత్ శెట్టి ప్రేక్షకులను ఏడిపిస్తాడు. చార్లీ సినిమాలో అందరినీ ఏడిపించిన రక్షిత్ శెట్టి..  ఈసారి కూడా కన్నీళ్లు పెట్టించేస్తాడు. రక్షిత్ శెట్టి ఎంత సహజమైన నటుడో చెప్పడానికి ఈ సినిమా మరో ఉదాహరణగా నిలుస్తుంది. ఏ మాత్రం హీరోయిజం కనిపించని పాత్రలు, చూపించాల్సిన అవసరం లేని పాత్రలో ఎంతో అద్భుతంగా నటించాడు. ప్రేమ, బాధను, కోపాన్నీ అన్నింటినీ కళ్లలోనే చూపించాడు.

  ఇక రుక్మిణి అయితే జీవించినట్టు అనిపిస్తుంది. ఈ పదం అందరికీ వాడి వాడి దాన్ని కూడా కామెడీగా చేసేశారు. కానీ రుక్మిణి మాత్రం నిజంగానే ప్రియ పాత్రకు ప్రాణం పోసింది. మేకప్‌‌లు వేసుకుని, అందంగా కనిపించడమే తెలిసిన హీరోయిన్లకు భావాలను కళ్లలోనే పలికించాలని తెలియదు. అలాంటి వారికి రుక్మిణిని చూపించాల్సి ఉంటుంది. రుక్మిణి తన కంటితోనే ఎన్నో సీన్లను లాగించేసింది. అసలు ఇప్పుడు క్లోజప్ షాట్స్ అంటే హీరో హీరోయిన్లు భయపడిపోతుంటారు. మొహంలో అంత ఎమోషన్స్ పలికించే వారు కూడా ఇప్పుడు దొరకడం లేదు. కానీ రుక్మిణి పాత్ర ప్రేమలోని సంతోషాన్ని, విరహపు వేదనను కంటిచూపుల్లోనే చూపించేసింది. ఈ రెండు పాత్రలతో ప్రేక్షకుడు ప్రయాణం చేస్తాడు.. వారి జీవితాన్ని తన జీవితంగా భావించి బాధపడతాడు.

  జైల్లో ఒకతను తన భార్యకు, ఈ ప్రియకు ఉన్న తేడాను చెప్పే సీన్ ఒక్కటి చాలు.. ప్రేమకు నిర్వచనం ఏంటో. రుక్మిణి తన హావభావాలతోనే సినిమాను నిలబెట్టేసింది. రుక్మిణి, రక్షిత్‌ల జోడి అలా థియేటర్ నుంచి బయటకు వచ్చాక కూడా వెంటాడుతూనే ఉంటుంది.

  రేటింగ్ 3.5

  చివరగా.. సప్త సాగరాలు దాటి.. గుండెను మీటే కావ్యం