RDX Movie Review : ఆర్‌డీఎక్స్ మూవీ రివ్యూ..ప్రతీకారం తీర్చుకునే మిత్రత్రయం

RDX Movie Review : ఆర్‌డీఎక్స్ మూవీ రివ్యూ..ప్రతీకారం తీర్చుకునే మిత్రత్రయం

  RDX Movie Review మాలీవుడ్ మూవీలు ఎలా ఉంటాయి.. వాటి నెరేషన్ ఎలా ఉంటుంది.. ఎంత డిటైలింగ్‌గా చూపిస్తారు అన్నది తెలిసిందే. ఇప్పుడు మాలీవుడ్‌లో ఆర్‌డీఎక్స్ మీద మంచి హైప్ వచ్చింది. బ్లాక్ బస్టర్‌గా నిలిచిన ఈ మూవీ సోషల్ మీడియాలోనూ హాట్ టాపిక్‌‌గా మారింది. మరి ఈ మూవీ కథాకమామీషు ఏంటో ఓ సారి చూద్దాం.

  ఆర్‌డీఎక్స్ కథ కొచ్చిలో జరుగుతుంది. రాబర్ట్, డోని (టోని), జేవియర్ ముగ్గరు చిన్ననాటి స్నేహితులు. ఈ ముగ్గురూ కూడా కరాటే, మార్షల్ ఆర్ట్స్ వంటి వాటిలో ఆరితేరిన వారు. ఇలాంటి కళలు ఆత్మరక్షణకే కానీ ఎదుటివాళ్లను కొట్టడానికి కాదు నమ్మే గురువు ఉంటాడు ఆ ముగ్గురికి. ఇందులో రాబర్ట్, టోని అన్నదమ్ములు కూడా. కొన్ని కారణాల వల్ల రాబర్ట్ ఇంటికి దూరం అవుతాడు. పెద్ద కొడుకు టోని తరుచూ గొడవలు పడుతుంటాడని తండ్రికి కోపం. ఇలానే ఓ సారి జాతర (సినిమాలో కార్నివాల్)లో గొడవ జరుగుతుంది.   ఆ గొడవ మూలనా టోని కుటుంబం ఏం అవుతుంది? తన కుటుంబానికి జరిగిన దానికి రాబర్ట్ పగ తీర్చుకునేందుకు ఏం చేస్తాడు? తన మిత్రుల కోసం జేవియర్ ఎలా నిలబడ్డాడు? ఈ మిత్రత్రయం కలిసి తమ పగను ఎలా తీర్చుకున్నారు? అనేది కథ.

  ఈ చిత్రం ప్లాట్‌గా చెప్పుకుంటే రివేంజ్ యాక్షన్ డ్రామా. తన కుటుంబాన్ని రౌడీ మూకలు ఏదో ఒకటి చేయడం.. దానికి ప్రతిగా హీరో ప్రతినాయకులను చంపుకుంటూ వెళ్లడం.. చివర్లో హీరో చేతిలో విలన్ హతమవ్వడం అనేది యాక్షన్ రివేంజ్ డ్రామాకు ఉండే నియమం. ఇందులోనే అదే నియమం కనిపిస్తుంది.కానీ కాస్త కొత్తగా అనిపిస్తుంది. మేకింగ్, టేకింగ్ అన్నీ కూడా స్టైలీష్‌గా ఉంటాయి. వింటేజ్, రెట్రో వాతావరణంలో తెరకెక్కించడంతో ఫ్రెష్ ఫీలింగ్ వస్తుంది. అయితే రాబర్ట్, టోని పాత్రలతో ప్రేక్షకులు కనెక్ట్ అవుతారు. వారికి బాధ కలిగితే ప్రేక్షకుడు సైతం రియాక్ట్ అయ్యేలా చేశారు.

  సినిమా ప్రారంభంలోని ఓ పది నిమిషాలు అంతగా ఎక్కకపోయినా.. హీరో ఫ్యామిలీ మీద అటాక్ సీన్ నుంచి ఆసక్తి కలుగుతుంది. అయితే ఆ తరువాత కొద్ది సేపటికే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ స్టార్ట్ అవుతుంది. ప్రారంభంలో అది కూడా కాస్తా బోరింగ్‌గా అనిపిస్తుంది. రాబర్ట్, సిమి లవ్ స్టోరీ ఆసక్తికరంగా అనిపిస్తుంది. నాటి రెట్రో లుక్, ఆ సెట్టింగ్, లుక్స్ అన్నీ కూడా బాగుంటాయి. ఇంటర్వెల్‌లో భారీ యాక్షన్ సీక్వెన్స్ ఉంటుంది. ఈ మిత్రత్రయం విలన్లను చితక్కొట్టేస్తారు. అక్కడి యాక్షన్ సీక్వెన్స్, ఎలివేషన్ షాట్స్, ఆర్ఆర్ అన్నీ అద్భుతంగా అనిపిస్తాయి.

  ఆ తరువాత సెకండాఫ్ కాస్త స్లోగా స్టార్ట్ అవుతుంది. కానీ రాబర్ట్, టోనిలు ప్రతీ కారం తీసుకోవడం మొదలుపెట్టినప్పటి నుంచి వెేగం పుంజుకుంటుంది. సెకండాఫ్‌లో రెండు భారీ యాక్షన్ సీక్వెన్స్ అదిరిపోతాయి. విలన్ల కాలనీలోకే వెళ్లి రాబర్ట్, టోనీలు ఫైట్ చేయడం, ఆపత్కాలంలో జేవియర్ వచ్చి కాపాడటం, అతని ఎంట్రీ బాగుంటుంది. ఇక చివర్లో క్లైమాక్స్ ఫైట్ సైతం యాక్షన్ సీక్వెన్స్ హై ఇస్తుంది. యాక్షన్ సినిమాలను ఇష్టపడే వారికి ఆర్‌డిఎక్స్ బాగుంటుంది.

  ఇందులో యాక్షన్‌తో పాటు, రివేంజ్‌తో పాటు అంతర్లీనంగా కొన్ని సందేశాలు కూడా ఇచ్చాడు. కరాటే, మార్షల్ ఆర్ట్స్ ఇలా ఏదైనా సరే మన టాలెంట్ చూపించుకోవడానికి, ఎదుటి వాడిని భయపెట్టడానికి కాదు.. ఆత్మ రక్షణకు మాత్రమే వాడుకోవాలని చెప్పాడు. హీరోయిన్ వచ్చి.. ఒకడ్ని కొట్టాలి.. నాకు కరాటే నేర్పించండి.. అంటే ఆ మాస్టర్ దానికి ఒప్పుకోడు. ఇలాంటి పనులకు ఈ విద్యను చెప్పను అని విలువల గురించి చెప్పకనే చెప్పేశాడు. కష్టనష్టాల్లో మిత్రులు ఎలా తోడుంటారు.. ఎలా నిల్చుంటారు.. ఎలా నిల్చుండాలో కూడా చూపించాడు.

  స్కూల్, కాలేజ్‌‌లో సార్ వంకర బుద్ది, దాని వల్ల అమ్మాయిలు పడే ఇబ్బందిని కూడా చూపించాడు. ఒక అమ్మాయి తన నిర్ణయాన్ని ఎలాంటి బెరుకు, భయం లేకుండా చెబితే సమస్యలు రావని హీరో చేత ఓ సీన్‌లో చెప్పిస్తాడు. ఇలా ఈ రివేంజ్ యాక్షన్ డ్రామాలో దర్శకుడు మంచి సందేశాలను చెప్పే ప్రయత్నం చేశాడు.

  టెక్నికల్‌గా ఆర్‌డీఎక్స్ మెప్పిస్తుంది. విజువల్స్ ఈ సినిమాకు ప్రధాన బలం. పాటలు మన తెలుగు వారికి అర్థం కావు. అంతగా ఎక్కవు. మాటలు మెప్పిస్తాయి. సినిమా అక్కడక్కడ కాస్త బోరింగ్‌గా అనిపించినా.. నెక్ట్స్ ఏం జరుగుతుందా? అనే ఆసక్తిని, ఉత్సుకతను రేకెత్తించేలా ముందుకు సాగుతుంది.

  రేటింగ్ 3

  చివరగా.. ఆర్‌డీఎక్స్ (RDX బాంబ్) లాంటి మిత్రత్రయం