- October 29, 2021
Romantic Review : రొటీన్ ‘రొమాంటిక్’

Romantic Review రొమాంటిక్ సినిమా విషయంలో అందరూ చాలా కాన్ఫిడెంట్‌గానే కనిపించారు. సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అంటూ అందరూ తెగ ఊదరగొట్టేశారు. టాలీవుడ్ దర్శకులందరికీ సినిమా చూపించారు. ఆహా ఓహో అని కీర్తించేశారు. ఇండస్ట్రీకి మరో మాస్ హీరో దొరికేశాడంటూ ఆకాష్ పూరిని ఆకాశానికి ఎత్తేశారు. అయితే నేడు (అక్టోబర్ 29) ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఎలా ఉందో ఓ సారి చూద్దాం.
కథ
వాస్కోడిగామా(ఆకాష్ పూరి) తప్పుడు దారిలో డబ్బులు సంపాదిస్తుంటాడు. తనలా అనాథలైన వారికి సాయంగా ఉంటాడు. నాన్నమ్మ మేరీ (రమాప్రభ) దగ్గర పెరుగుతాడు. బస్తీ కోసం వాస్కో పోరాడుతాడు. అక్కడి అనాథలో కోసం ఆశ్రమం కట్టాలని డబ్బులు సంపాదించాలని అడ్డదారులు తొక్కుతాడు. డబ్బులు సంపాదిస్తాడు. ఈ క్రమంలోనే రోజ్ గ్యాంగులోకి చేరతాడు. అవన్నీ కూడా ఇల్లీగల్ పనులే. ఆ గ్యాంగుకు వాస్కో లీడర్ అవుతాడు. ఆ గ్యాంగు పని చెప్పేందుకు ఏసీపీ రమ్య గోవార్కర్ (రమ్యకృష్ణ)రంగంలోకి దిగుతుంది. ఇక ఈ కథలతో మోనిక పాత్ర ఏంటి? వాస్కో వెనకాల ఉన్న గతం ఏంటి? ఎందుకు చోటా డాన్‌లా మారాల్సి వచ్చింది? చివరకు కథ ఎలా ముగిసింది? అనేదే రొమాంటిక్.
నటీనటులు
వాస్కో పాత్రలో ఆకాష్ నిజంగానే బాగా చేశాడు. కొన్ని చోట్ల చిన్న పిల్లాడిలా అనిపించినా అలా నెట్టుకొచ్చేశాడు. భారీ యాక్షన్ సీక్వెన్స్‌లు, డైలాగ్స్‌లు పెట్టేశారు. అవన్నీ కూడా ఆకాష్ స్థాయిని మించే ఉన్నాయి. కానీ ఓ మోస్తరుగా మోసేశాడు. ఇక కేతిక శర్మ అందాలకు ఫిదా కానివారు ఎవ్వరూ ఉండరు. కేతిక అందరినీ కట్టిపడేసేలా ఉంది. రమ్యకృష్ణ ఈసినిమాకు నిజంగానే ఓ బలం. రమ్యకృష్ణ, ఆకాష్ మధ్య వచ్చే సీన్స్ అదిరిపోయాయి. మిగతా పాత్రల్లో అందరూ తమ పరిధి మేరక నటించేశారు.
విశ్లేషణ
పూరి జగన్నాథ్ సినిమా అంటే అందరికీ కొన్ని గుర్తుకు వస్తాయి. గ్యాంగు వార్లు, ఇల్లీగల్ వ్యాపారాలు, పోకిరి తరహా ట్విస్టులు అనేవి కామన్. ఇందులో కూడా అవే ఉంటాయి. కానీ ప్రేమ, మోహం అనే లైన్ మాత్రమే కొత్తగా ఉంటుంది. మిగతాది అంతా సేమ్ టు సేమ్. అన్ని సినిమాలు కలిపి చూసినట్టుగా అనిపిస్తుంది. కానీ పూరి జగన్నాథ్ డైలాగ్స్ మాత్రం వేరే లెవెల్‌లో ఉన్నాయి.
అంతా తానై ముందుండి నడిపించాడు పూరి జగన్నాథ్. ఈ సినిమాకు కథ, కథనం, మాటలు అన్నీ ఇచ్చేశాడు. ఒక్క దర్శకత్వం మాత్రమే అనిల్ చేశాడు. అనిల్ మాత్రం తాను అనుకున్నది తెరపై చూపించాడు. కానీ ఇది పక్కా పూరి మార్క్ సినిమాలానే ఉంది. పరమ రొటీన్ కథలా అనిపిస్తుంది. అయితే పాటలు, విజువల్స్, కేతిక అందాలు సినిమాను నిలబెట్టాయని అనుకోవచ్చు.
అయితే దర్శకుడిగా అనిల్ తన ముద్రను ఏ మాత్రం చూపించలేదనిపిస్తోంది. సినిమా మొత్తం కూడా పూరి తీసినట్టుగానే అనిపిస్తుంది. ప్రతీ సీన్, ప్రతీ డైలాగ్ అన్నీ కూడా పూరి పలికించినట్టుగానే అనిపిస్తుంది. ఇక ఎడిటింగ్, ఫోటోగ్రఫీ, ప్రొడక్షన్ వాల్యూస్ అన్నీ కూడా బాగానే ఉన్నాయి. మొత్తానికి రొమాంటిక్ సినిమాలో పూరి మార్క్ అయితే పూర్తిగా కనిపించింది.
చివరగా.. రొటీన్ రొమాంటిక్