• January 26, 2024

రామ్ మూవీ రివ్యూ.. హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే

రామ్ మూవీ రివ్యూ.. హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే

    RAM Rapid Action Mission Movie Review పేట్రియాటిక్ జానర్లో రామ్ (RAM ర్యాపిడ్ యాక్షన్ మిషన్) అనే చిత్రం ఈ రిప్లబిక్ డేకి వచ్చింది. ఈ చిత్రంతో హీరో దర్శక నిర్మాతలు తొలిసారిగా తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు వచ్చారు. మొదటి చిత్రమే ఇలాంటి ఓ ప్రయోగం కావడంతో హీరో సూర్య అయ్యలసోమయాజుల, దర్శకుడు మిహిరాం, నిర్మాత దీపికలకు ఏ మేరకు కలిసి వచ్చింది అన్నది ఓ సారి చూద్దాం.

    కథ
    బరువు బాధ్యతలంటూ లేని జాలీగా తిరుగుతూ తాగుతూ ఉండే కుర్రాడు రామ్ (సూర్య సోమయాజుల). రామ్ తండ్రి మేజర్ సూర్య ప్రకాష్ (రోహిత్) ఓ మిషన్‌లో భాగంగా ప్రాణాలు కోల్పోతాడు. తోటి అధికారి జేబీ (భాను చందర్) ఆ ఘటనను తలుచుకుంటూనే ఉంటాడు. జేబీ ఎలాగైనా సరే సూర్య కొడుకుని డిపార్ట్మ్ంట్‌లోకి తీసుకోవాలని చూస్తాడు. కానీ రామ్ మాత్రం అయిష్టంగా ఉంటాడు. రామ్ జీవితంలోకి జాహ్నవి (ధన్య బాలకృష్ణ) వస్తుంది. ఆమె జేబీ కూతురే. అమ్మాయితో పెళ్లికి ఒప్పుకోవాలంటే.. డిపార్ట్మెంట్‌లో జాయిన్ అవ్వాలని కండీషన్ పెడతాడు జేబీ. అలా అమ్మాయి ప్రేమ కోసం డిపార్మెంట్‌లో జాయిన్ అవ్వడానికి ప్రయత్నిస్తుంటాడు. డిపార్ట్మెంట్‌లో జాయిన్ అయిన తరువాత రామ్‌కు ఎదురైన పరిస్థితులు ఏంటి? ఉగ్ర వాదుల కుట్రను రామ్ ఎలా అడ్డుకున్నాడు? అసలు ర్యాపిడ్ యాక్షన్ మిషన్ అంటే ఏంటి?అన్నది తెలుసుకోవాలంటే థియేటర్లో చూడాల్సిందే.

    నటీనటులు
    రామ్ కారెక్టర్‌‌కు సూర్య అయ్యలసోమయాజుల వంద శాతం న్యాయం చేశాడు. అసలు స్క్రీన్ మీద కొత్త వాడు కదా? అన్న భావన తీసుకు రాడు. కొత్త వాడైనా ఎక్కడా ఆ బెరుకు లేకుండా నటించేశాడు. యాక్షన్ సీక్వెన్స్‌లో ఓ మాస్ హీరోగా ఫైట్స్ చేశాడు. కామెడీ టైమింగ్, ఎమోషనల్ సీన్స్‌లోనూ ఆకట్టుకున్నాడు. ఫస్ట్ హాఫ్‌కు, సెకండాఫ్‌కు ఆహార్యం, నటనలోనూ వేరియేషన్స్ చూపించిన తీరు బాగుంటుంది. అక్కడే సూర్యకు వందకు వంద మార్కులు పడతాయి. ఇక ఈ చిత్రంలో సాయి కుమార్ తన డైలాగ్స్‌తో మరోసారి ఆకట్టుకున్నాడు. మతాల గురించి చెప్పిన డైలాగ్ మళ్లీ చాలా కాలం నిలిచేలా ఉంది. శుభలేఖ సుధాకర్, రోహిత్, భాను చందర్ పాత్రలు బాగున్నాయి. రోహిత్ చాలా కాలం తరువాత ఆడియెన్స్‌ను మెప్పించాడు. శుభలేఖ సుధాకర్ కనిపించేది కొద్ది సేపే అయినా ఇంపాక్ట్ చూపిస్తాడు. ధన్య బాలకృష్ణ లుక్స్ పరంగా బాగుంది. ఎమోషనల్‌గానూ నటించి ఆకట్టుకుంది. భాషా కామెడీ, రవి వర్మ, మీనా వాసు, అమిత్ ఇలా అందరూ ఓకే అనిపిస్తారు.

    విశ్లేషణ
    రామ్ సినిమా కోసం దర్శకుడు రాసుకున్న కోర్ పాయింట్ పాతది. కానీ ఆ పాయింట్ చుట్టూ అల్లుకున్న కథనం కొత్తగా ఉంటుంది. ప్రతీ పాయింట్ చాలా కొత్తగా ఉంటుంది. ఉగ్రవాదం మీద ఎన్నో సినిమాలు వచ్చాయి. బార్డర్ లోపల, సీక్రెట్ స్లీపర్స్ అంటూ ఇలా ఎన్నో కాన్సెప్టుల మీద సినిమాలు వచ్చాయి. కానీ బ్యూరో క్రాటిక్ జిహాద్ అనే కొత్త పాయింట్‌ను టచ్ చేశాడు. సిన్సియర్ ముస్లిం ఆఫీసర్ పాత్రను పోషించిన సాయికుమార్‌తో ఆ పాయింట్‌ను మరింత బలంగా చెప్పించడంలో, ప్రేక్షకులను కనెక్ట్ చేయడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు.

    ఫస్ట్ హాఫ్‌కు సంబంధించి కొన్ని సీన్లు రొటీన్‌గా అనిపిస్తాయి. కొన్ని చోట్ల రామ్, ఫ్రెండ్ కారెక్టర్ చేసిన భాష నవ్వులు పూయిస్తారు. అల్లరి చిల్లరగా తిరిగే వ్యక్తి.. ఆఫీసర్‌గా మారే క్రమంను ఫస్ట్ హాఫ్‌లో చక్కగా చూపించారు. సెకండాఫ్‌లో ఫుల్ ఎమోషనల్‌గా సాగుతుంది. ధన్య బాలకృష్ణ చేసిన ఎమోషనల్ సీన్ సెకండాఫ్‌లో అందరినీ కంటతడి పెట్టిస్తుంది.

    శుభలేక సుధాకర్ పాత్రతో ఉగ్రవాదానికి, రాజకీయానికి ఉన్న కనెక్షన్, చరిత్రకి రాజకీయానికి ఉన్న కనెక్షన్‌ను చక్కగా చూపించారు. సెకండాఫ్ పూర్తి సీరియస్ మోడ్‌లో దేశ భక్తి కోణంలో నడిపించాడు. మిహిరాం క్లైమాక్స్‌ను మాత్రం నెక్ట్స్ లెవెల్లో ప్లాన్ చేసుకున్నాడు. ప్రతీ ఒక్క భారతీయుడికి ఈ సీన్లు చూస్తే రోమాలు నిక్కబొడుచుకోవాల్సిందే. త్రివర్ణ పతాకం కనిపించే షాట్, దేశ భక్తిని, మత సామరస్యాన్ని చాటేలా చివర్లో హిందూ ముస్లిం భాయ్ భాయ్ అనేలా చూపించే షాట్.. హిందూ అధికారికి, ముస్లిం పౌరుడు సాయం చేసే సీన్‌కు దండం పెట్టాల్సిందే. భారత్ మాతాకి జై అని తెరపై అంటే.. థియేటర్లో కూర్చున్న ప్రేక్షకులకి సైతం ఆ వైబ్ వచ్చేలా చేయడంలో ఫుల్ సక్సెస్ అయ్యాడు దర్శకుడు.

    టెక్నికల్‌గా అంటే.. కెమెరా వర్క్ గురించి ముందుగా చెప్పాలి. ధారన్ విజువల్స్ బాగున్నాయి. మిహిరాం రాసుకున్న డైలాగ్స్, పాటలు, సంగీతం ఇలా అన్నీ కూడా అద్భుతంగా అనిపిస్తాయి. మల్టీ టాలెంటె‌గా మిహిరాం అన్ని క్రాఫ్ట్స్‌ను చక్కగా హ్యాండిల్ చేయడంలో సక్సెస్ అయ్యాడు. నిర్మాతలు పెట్టిన ఖర్చు తెరపై కనిపిస్తోంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా హై గా ఉన్నాయి.

    రేటింగ్ 3