రామ్ గోపాల్ వర్మ ‘వ్యూహం’ రివ్యూ.. సినిమాకు అవే హైలెట్

రామ్ గోపాల్ వర్మ ‘వ్యూహం’ రివ్యూ.. సినిమాకు అవే హైలెట్

    Vyooham Movie Review రామ్ గోపాల్ వర్మ తీసిన వ్యూహం ఎన్ని అడ్డంకుల్ని దాటిందో అందరికీ తెలిసిందే. ఎప్పుడో రిలీజ్ కావాల్సిన ఈ సినిమాకు కోర్టు, సెన్సార్ సమస్యలు రావడంతో నేడు విడుదలైంది. మార్చి 2న వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకుల్ని ఏ మేరకు ఆకట్టుకుందో ఓ సారి చూద్దాం. అసలు వర్మ వ్యూహం కథ కథనాలు ఏంటి? సినిమా ఉద్దేశం ఏంటి? ఏ పాత్రలను ఎలా చూపించాడన్నది ఓ సారి చూద్దాం.

    కథ
    ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వీఎస్ వీరశేఖర రెడ్డి మరణం తర్వాత ఆయన కుమారుడు వీఎస్ మదన్ మోహన్ రెడ్డి (అజ్మల్ అమీర్) ఓదార్పు యాత్ర చేయాలని ప్లాన్ చేస్తాడు. కానీ భారత్ పార్టీ అధినేత్రి అందుకు ఒప్పుకోదు. దాంతో వీఎస్ఆర్ సీపీ పార్టీని మదన్ మోహన్ రెడ్డిని స్థాపిస్తాడు. భారత్ పార్టీని ఎదురించి సొంత పార్టీని స్థాపించడానికి ముందు జరిగిన సంఘటనలు ఏమిటి? వీఎస్ఆర్ సీపీ పార్టీ ప్రారంభించిన తర్వాత జరిగిన సంఘటనలు ఏంటి? మదన్ రెడ్డిని అడ్డుకొనేందుకు ఇంద్రబాబు (ధనుంజయ్ ప్రభు) పన్నిన వ్యూహాలు ఏమిటి? భర్త మదన్ మోహన్ రెడ్డికి ఎదురైన గడ్డు పరిస్థితుల్లో వీఎస్ మాలతి రెడ్డి (మానస రాధాకృష్ణన్) ఎలాంటి పాత్ర పోషించింది? ఏపీ రాజకీయాల్లో శ్రవన్ కల్యాణ్ ఎలాంటి పాత్రను పోషించాడు? ఏపీలో అధికారాన్ని చేజిక్కించుకోవడానికి ఎలాంటి అడ్డంకులను అధిగమించాడు అనే ప్రశ్నలకు సమాధానమే ఈ చిత్రం.

    నటీనటులు
    జగన్ పాత్రలో అజ్మల్ అమీర్ చక్కగా నటించాడు. కొన్ని సార్లు జగన్‌ను చూస్తున్నామా? అన్నట్టుగా ఉంటుంది. ఆ హావభావాలు, నటన అన్నీ కూడా జగన్‌కు దగ్గరగా ఉన్నట్టు కనిపిస్తాయి. ఇక మాలతి రెడ్డిగా వైఎస్ భారతీ పాత్రలో మానస రాధకృష్ణన్‌కు మంచి గుర్తింపు వచ్చేలా ఉంది. అంబటిగా వాసు ఇంటూరి, చంద్రబాబుగా ధనుంజయ్ ప్రభు ఇలా అన్ని పాత్రలు బాగానే ఉంటాయి. అయితే సినిమా అంతా కూడా జగన్ పాత్ర చుట్టూనే తిరగడంతో అజ్మల్ అమిర్ ఎక్కువగా గుర్తుండిపోతాడు.

    విశ్లేషణ
    ఈ సినిమాలోని పాత్రల పేరు మార్చినంత మాత్రాన.. అది ఎవరు? ఈ పాత్ర ఎవరిని ఉద్దేశించి తీశారు? ఎవరి మీద కౌంటర్లు వేశారు? అన్నది తెలుసుకోలేనంత అమాయకపు జనాలు అయితే లేరు. ఇక్కడ వర్మ తన మేకింగ్‌ను చూపించాడు. తాను చెప్పదల్చుకున్నట్టుగా క్లియర్ కట్‌గా చూపించాడు. తన ఉద్దేశాన్ని తెరపై చెప్పకనే చెప్పేశాడు. కొన్ని సీన్లు తన ఊహా శక్తికి తగ్గట్టుగా రాసుకున్నాడు. అవన్నీ కూడా తెరపై సినిమాటిక్ లిబర్టీలానే అనిపిస్తాయి.

    సాంకేతికంగా అయితే.. సజీష్ రాజేంద్రన్ సినిమాటోగ్రఫి మెప్పిస్తుంది. చాలా రిచ్‌గా కనిపిస్తుంది. మ్యూజిక్ ఈ సినిమాకు ప్లస్ అవుతుంది.  నిర్మాత దాసరి కిరణ్ కుమార్ పెట్టిన ఖర్చుకి తగ్గ ప్రతిఫలాన్ని వర్మ ఇచ్చాడు. నిర్మాణ విలువలు బాగున్నాయి.

    రేటింగ్ 3