• March 1, 2024

రాధా మాధవం రివ్యూ.. గుండెను తాకే ప్రేమ కథ

రాధా మాధవం రివ్యూ.. గుండెను తాకే ప్రేమ కథ

  Radha madhavam Movie Review వింటేజ్ విలేజ్ లవ్ స్టోరీలు తెరపైకి ఈ మధ్య ఎక్కువగా వస్తున్నాయి. గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కించే సినిమాలు, అందులోనూ ప్రేమ కథలు అంటే ఓ మంచి ఫీలింగ్ వస్తుంది. ఈ క్రమంలో రాధా మాధవం అనే సినిమా కూడా వచ్చింది. ఈ చిత్రంలో వినాయక్ దేశాయ్, అపర్ణా దేవీ హీరో హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రాన్ని గోనాల్ వెంకటేష్ నిర్మించగా.. దాసరి ఇస్సాకు దర్శకత్వం వహించారు. వసంత్ వెంకట్ బాలా ఈ చిత్రానికి కథ, మాటలు, పాటలను అందించారు. ఈ చిత్రం మార్చి 1న విడుదలైంది. మరి ఈ సినిమా ఎలా ఉందో ఓ సారి చూద్దాం.

  కథ
  చిన్నతనం నుంచి రాధ (అపర్ణా దేవీ) , మాధవ (వినాయక్ దేశాయ్)లు స్నేహితులు. అది చివరకు ప్రేమగా మారుతుంది. కానీ ఆ ఊరు పెద్ద, రాధ తండ్రి వీరభద్రం (మేక రామకృష్ణ)కు కుల పట్టింపులు ఎక్కువగా ఉంటాయి. ఊరి పెద్దని, కులాన్ని ధిక్కరించి రాధ,మాధవ ఏం చేశారు? అసలు మాధవ కేర్ సెంటర్ అని పెట్టి రాధ ఎందుకు నడుపుతుంది? మాధవకు జీవితంలో ఉన్న లక్ష్యం ఏంటి? మాధవ గతం ఏంటి? ఈ ప్రేమ కథ చివరకు ఏం అవుతుంది? ఊరి పెద్ద వీరభద్రం జైలుకి ఎందుకు వెళ్తాడు? చివరకు వీరభద్రం ఏం అవుతాడు? మాధవ కోసం రాధ ఏం చేసింది? అన్నది థియేటర్లో చూడాల్సిందే.

  నటీనటులు
  వినాయక్ దేశాయ్ మాధవ పాత్రలో చక్కగా నటించాడు. చదువుకున్న గ్రామీణ యువకుడిగా కనిపిస్తాడు. ఊర్లోని ఉండే అమాయకత్వాన్ని తన నటనలో చూపించాడు. తన ప్రేమను, లక్ష్యాన్ని సాధించుకునే కుర్రాడిగా కనిపిస్తాడు. యాక్షన్, డ్యాన్సులు ఇలా అన్నింట్లోనూ మెప్పిస్తాడు. అపర్ణా దేవీ తన పాత్రకు వంద శాతం న్యాయం చేసింది. రాధగా ప్రేక్షకుల్ని కట్టి పడేస్తుంది. ఇక ఈ చిత్రం మేక రామకృష్ణ పాత్రే హైలెట్‌గా నిలుస్తుంది. ఇంత వరకు చూసింది ఒకెత్తు.. ఇందులో ఒకెత్తు అన్నట్టుగా ఉంటుంది. ఊరి పెద్ద, సర్పంచ్, వీర భద్రంగా మేక రామకృష్ణ అద్భుతంగా నటించాడు. మిగిలిన పాత్రలన్నీ కూడా పరిధి మేరకు ఆకట్టుకుంటాయి.

  విశ్లేషణ
  పరువు హత్యలు, ప్రేమకు కులాల అడ్డంకులు అనే పాయింట్ మీద ఎన్నో సినిమాలు వచ్చాయి. అయితే ఇలాంటి పాయింట్, ఇలాంటి ప్రేమ కథలకు పీరియడ్ బ్యాక్ డ్రాప్ యాడ్ చేస్తే కాస్త ఫ్రెష్ ఫీలింగ్ వస్తుంది. రాధా మాధవం సినిమాకు కూడా అదే ఫీలింగ్ కనిపిస్తుంది. ఈ పాయింట్‌తో ఎన్నో చిత్రాలు చూసినట్టుగా అనిపించినా.. రాధా మాధవం మాత్రం ఎక్కడా బోర్ కొట్టించదు. అలా బోర్ కొట్టకుండా చేయడంలో దర్శకుడు ఇస్సాకు సక్సెస్ అయ్యాడు.

  ఫస్ట్ హాఫ్ ప్రారంభం చిన్నపిల్లల ఎపిసోడ్, మాధవ కేర్ సెంటర్‌, అక్కడి ఫన్నీ సీన్లతో సరదా సరదాగా సాగుతుంది. ఆ తరువాత ఫ్లాష్ బ్యాక్ కథ మొదలవుతుంది. అలా ప్రేమ కథలోకి మెల్లిగా ప్రేక్షకుడ్ని తీసుకెళ్తాడు దర్శకుడు. ఊరు, ఊరు వాతావరణం, కుల వివక్ష మీద ఇలా పరోక్షంగా సీన్లను రాసుకుంటూ పోయాడు. ఇంటర్వెల్ వరకు ప్రేమ కథ మలుపు తిరుగుతుంది. అలా ఫస్ట్ హాఫ్ అంతా ఎంటర్టైనింగ్‌గా సాగుతుంది.

  ద్వితీయార్దం అంతా కూడా ఎమోషనల్‌గా సాగుతుంది. ప్రేమ జంట ఒక వైపు ఉంటే.. పగతో రగిలిపోయే పెద్ద మనుషులు మరో వైపు ఉంటారు. ఇక ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్‌ను మరింత ఎమోషనల్‌గా రాసుకున్నాడు. అసలు హీరో లక్ష్యాన్ని రివీల్ చేసే ట్విస్ట్ బాగుంది. కులాల మీద వేసిన డైలాగ్స్, రాసుకున్న సీన్స్ బాగుంటాయి. మాటలు అందరినీ ఆలోచింపజేస్తాయి. పాటలు తెరపై వినడానికి, చూడటానికి బాగున్నాయి. విజువల్స్ ఎంతో సహజంగా అనిపిస్తాయి. కొత్త నిర్మాతే అయినా కూడా ఖర్చుకి ఏ మాత్రం వెనుకాడలేదనిపిస్తుంది. నిర్మాణ విలువలు ఎంతో ఉన్నతంగా అనిపిస్తాయి.

  రేటింగ్ 3