- October 24, 2021
Radheshyam Teaser : గమనించాల్సిన విషయాలివే

డార్లింగ్ అభిమానులు ఎప్పటి నుంచో ఎదురుచూసిన తరుణం రానే వచ్చింది. ప్రభాస్ రాధేశ్యామ్ నుంచి ఇవ్వండి మొర్రో అంటూ అభిమానులు వేడుకున్నారు. తిట్టారు. శాపనార్థాలు పెట్టారు. కానీ సరైన టైంకు సరైన అప్డేట్ వస్తుందని మేకర్స్ చెప్పుకుంటూ వచ్చారు. ఇక ఒకానొక సమయంలో రాధే శ్యామ్ మీద అభిమానులు ఆశలు వదులుకున్నారు. అయితే ప్రభాస్ బర్త్ డే సందర్భంగా అదిరిపోయే అప్డేట్ వస్తుందని అభిమానులు ఫిక్స్ అయ్యారు. దానికి తగ్గట్టుగానే రాధేశ్యామ్ అదిరిపోయే అప్డేట్‌తో ముందుకు వచ్చింది.
ప్రభాస్ బర్త్ డే సందర్బంగా రాధే శ్యామ్ టీజర్‌ను వదిలారు. ఈ సినిమా ఒక పీరియాడిక్ డ్రామా అని ఇది వరకే లీకులు వచ్చాయి. రైల్వే స్టేషన్ సీన్స్ ఎంతో ముఖ్యమని కూడా తెలుసు. పారిస్ నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కుతుందని కూడా తెలుసు. ఇందులో హీరోయిన్ పూజా హెగ్డే మ్యూజిక్ టీచర్‌గా నటిస్తుందని ఇది వరకు వదిలిన పోస్టర్లతో అర్థమైంది. పియానో, రైల్వే స్టేషన్, ఓ పెద్ద లైబర్రీ వంటి రూం ఇవన్నీ కూడా ఇది వరకు బయటకు వచ్చాయి.
టీజర్‌ను సరిగ్గా గమనిస్తే ఇవన్నీ అందులో ఉన్నాయి. విక్రమ్ ఆదిత్య అనేవాడు చేయి చూసి జాతకాలు చెప్పేవాడని తెలుస్తోంది. ఎప్పుడు ఏం జరుగుతుంది.. ఎప్పుడు గెలుస్తారు.. ఎప్పుడు ఓడతారు.. ప్రేమకు బ్రేకప్ ఎప్పుడు జరుగుతుంది.. చివరకు ఎప్పుడు మరణిస్తారో కూడా అన్నీ తెలుస్తాయి. కానీ నేను చెప్పను.. ఎందుకంటే అది ఊహలకు కూడా అందదు అంటూ ప్రభాస్ అదిరిపోయే డైలాగ్స్‌ను చెప్పాడు. నా పేరు విక్రమ్ ఆదిత్య.. నేను దేవుడిని కాదు.. అలాగనీ మీలాంటి మనుషుల్లో ఒకడిని కాదు అని తన కారెక్టర్ ఏంటో చెప్పేశాడు.
టీజర్‌లో డైలాగ్స్ ఒకెత్తు అయితే.. విజువల్స్ మరో ఎత్తు. ఇందులో చాలా క్లూస్ వదిలారు. ప్రభాస్ గతం, భవిష్యతులో కనిపించనున్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే ఇండియాకు ఎమర్జెన్సీ విధిస్తారు అని ముందే ప్రకటించిన వ్యక్తి విక్రమ్ ఆదిత్య అని టైమ్స్ పత్రికలో వచ్చినట్టు టీజర్‌లో ఓ షాట్ కనిపిస్తుంది.
ఇక మెట్లు ఎక్కుతుంటే.. అక్కడ విక్రమ్ ఆదిత్య ప్లస్ ప్రేరణ (VA+P) అనే అక్షరాలు చెక్కి ఉంటాయి. ఇక రోజా పువ్వు కింద పడటం, ఓ క్లాక్ టవర్ లాంటిది పడిపోవడం, సునామీ వచ్చినట్టుగా ఏదో పెద్ద ప్రమాదం జరగడం, ఓ పెద్ద షిప్పు బొమ్మను కూడా చూపిస్తుండటంతో కథ ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. రాధాకృష్ణుల బొమ్మతో విక్రమ్ ఆదిత్య రక్తపుచుక్కలు కూడా పడతాయి. అంటే దానికి కూడా ఏదో స్పెషల్ ఇంపార్టెన్స్ ఉందన్న మాట.
అలా టీజర్‌లో ఎన్నెన్నో హింట్లు ఇచ్చారు. మొత్తానికి అన్ని తెలిసిన విక్రమ్ ఆదిత్య తన జీవితాన్ని ఎలా మలుచుకున్నాడు.. తన ప్రేయసిని ఎలా పోగొట్టుకున్నాడు? అసలు ఇంతకీ విక్రమ్ ఆదిత్య కథ ఏంటి? అనేది తెలియాలంటే జనవరి 14 వరకు ఆగాల్సిందే.