• June 21, 2024

ఓ మంచి ఘోస్ట్ రివ్యూ.. నవ్విస్తూ, భయపెట్టారే

ఓ మంచి ఘోస్ట్ రివ్యూ.. నవ్విస్తూ, భయపెట్టారే

    వెన్నెల కిషోర్, నందితా శ్వేత, నవమి గాయక్, షకలక శంకర్, రజత్ రాఘవ్, నవిన్ నేని, రఘుబాబు ఇలా భారీ క్యాస్టింగ్‌తో ఓ మంచి ఘోస్ట్ అనే చిత్రం వచ్చింది. మార్క్ సెట్ నెట్‌వర్క్స్ బ్యానర్ మీద డా.అబినికా ఇనాబతుని నిర్మించిన ఈ చిత్రానికి శంకర్ మార్తాండ్ దర్శకత్వం వహించారు. ఈ మూవీ జూన్ 21న విడుదలైంది. ఈ సినిమా ఎలా ఉందో ఓ సారి చూద్దాం.

    కథ
    ఊరికి చివరనా ఓ మహల్ ఉంటుంది. ఆ మహల్‌లో దెయ్యం ఉంటుంది. కిడ్నాప్ అనే పదం వింటే చాలు ఆ దెయ్యానికి పూనకం వస్తుంది. కిడ్నాప్ చేసే దుర్మార్గులను హతమార్చుతుంది. అక్కడ సీన్ కట్ చేస్తే.. చైతన్య (రజత్), రజియా (నవమి గాయక్), లక్ష్మణ్ (నవీన్), పావురం (షకలక శంకర్) వంటి వారంతా డబ్బు సమస్యతో ఒక చోటకు చేరుతారు. వారు తమ బాధల నుంచి బయటకు రావాలంటే ఎమ్మెల్యే సదా శివ రావు (నాగినీడు) కూతురు కీర్తి (నందితా శ్వేత)ను కిడ్పాన్ చేయాలని ప్లాన్ చేస్తారు. కీర్తిని కిడ్నాప్ చేసిన ఆ నలుగురు ఊరి చివరన ఉన్న మహల్‌కు వెళ్తారు. అసలే అక్కడ కిడ్నాప్ అంటే పడని దెయ్యం ఉంటుంది. కీర్తికి కూడా ఓ సమస్య ఉంటుంది. ఈ ఇద్దరి మధ్య ఆ నలుగురు ఎలా చిక్కుకున్నారు? ఆ మహల్ కథ ఏంటి? ఈ దెయ్యాల గోల ఏంటి? మధ్యలో ఆత్మ (వెన్నెల కిషోర్) పాత్రకు ఉన్న ప్రాధాన్యం ఏంటి? అసలు వారంతా బతికి బయటపడ్డారా? అన్నదే కథ.

    నటీనటులు
    వెన్నెల కిషోర్, షకలక శంకర్ థియేటర్లో ప్రేక్షకుల్ని పగలబడేలా నవ్విస్తుంటారు. వీరిద్దరికీ ఇలాంటి పాత్రలేమీ కొత్త కాదు. మరోసారి ఈ చిత్రంతో ఆడియెన్స్‌ను విరగబడేలా నవ్విస్తారు. నందిత ఆల్రెడీ ఘోస్ట్‌గా ఇది వరకు భయపెట్టేసింది. మళ్లీ ఇప్పుడు ఈ చిత్రంలో అదరగొట్టేసింది. నవమి గాయక్ గ్లామరస్‌గా అనిపిస్తుంది. రఘుబాబు కనిపించినంత సేపు నవ్విస్తాడు. రజత్ చక్కగా నటించాడు. నవీన్ నేని మధ్య మధ్యలో నవ్విస్తాడు. మిగిలిన పాత్రలు ఓకే అనిపిస్తాయి.

    విశ్లేషణ
    హారర్ కామెడీ జానర్ అంటే ఎంతగా నవ్విస్తారో.. అంతగా భయపెడతారు. ఈ ఫార్మాట్ కొత్తేమీ కాదు. ఈ జానర్, ఈ ఫార్మాట్‌లో ఎన్నో సినిమాలు వచ్చాయి.. ఇక ముందు కూడా వస్తాయి. రీసెంట్‌గా వచ్చిన బాక్ కూడా హారర్, కామెడీ జానరే. ఓ మంచి ఘోస్ట్‌లో ఎంతగా నవ్విస్తారో.. అంతగా భయపెడతారు. ఇక ఇందులో కాన్సెప్ట్ కన్నా.. ఎగ్జిక్యూషన్ గురించి చెప్పుకోవాలి.. ముందు ఏం జరుగుతుందో అని అందరికీ అర్థం అవుతుంది. కానీ ఆర్టిస్టుల పర్ఫామెన్స్ వల్ల దాన్ని జనాలు అంతగా పట్టించుకోకుండా సీన్లను ఎంజాయ్ చేస్తుంటారు.

    ఫస్ట్ హాఫ్‌లో ప్రారంభం కాస్త నెమ్మదిగా అనిపిస్తుంది. ఒక్కసారి ఈ గ్యాంగ్ ఆ మహల్‌లో ఎంట్రీ ఇచ్చాక కథ మారుతుంది. అక్కడి నుంచి నవ్వుల పంట పండిచేస్తుంటారు. ఇంటర్వెల్‌కు ట్విస్ట్ అదిరిపోతుంది. ఇక సెకండాఫ్‌లో దెయ్యాలతో చేసే కామెడీ హైలెట్ అనిపిస్తుంది. దెయ్యాలు కూడా కామెడీ చేస్తుంటాయి. సీరియస్‌గా భయపెడుతుంటాయి. ఫ్లాష్ బ్యాక్ సీన్ ఓకే అనిపిస్తుంది. ఎండింగ్‌ను చూస్తే సీక్వెల్ ఉందా? అనే అనుమానం కలుగుతుంది.

    టెక్నికల్‌గా ఈ మూవీ బాగుంటుంది. ఆర్ఆర్ అదిరిపోతుంది. పాటలు కూడా మెప్పిస్తాయి. అనూప్ ఈ చిత్రానికి మేజర్ అస్సెట్. విజువల్స్ బాగుంటాయి. కెమెరా వర్క్‌తోనే భయపెట్టేశారు. ఆర్ట్ డిపార్ట్మెంట్ బాగానే పని చేసింది. ఎడిటింగ్ బాగుంది. మాటలు నవ్విస్తాయి. పంచ్‌లు బాగానే పేలాయి. మొదటి సినిమానే దర్శకుడు ఎక్కడా తడబడలేదు. మొదటి ప్రాజెక్ట్ అయినా కూడా నిర్మాతలు రిచ్‌గా సినిమా తీశారు.

    రేటింగ్ 3