• June 21, 2024

సీతా కళ్యాణ వైభోగమే రివ్యూ.. విలువలు చాటి చెప్పే చిత్రం

సీతా కళ్యాణ వైభోగమే రివ్యూ.. విలువలు చాటి చెప్పే చిత్రం

  సుమన్ తేజ్, గరీమ చౌహన్ హీరో హీరోయిన్లుగా సీతా కళ్యాణ వైభోగమే అనే సినిమా వచ్చింది. డ్రీమ్ గేట్ ప్రొడక్షన్స్ పతాకంపై రాచాల యుగంధర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాకు సతీష్ పరమవేద దర్శకత్వం వహించారు. ఇక ఈ చిత్రం జూన్ 21న భారీ ఎత్తున విడుదలైంది. ఇప్పటికే టీజర్, ట్రైలర్, పాటలు సినిమా మీద హైప్ పెంచాయి. మరి ఈ మూవీ ఎలా ఉందో ఓ సారి చూద్దాం.

  కథ
  దేవరకథ అనే గ్రామంలో ఊరి పెద్ద ధర్మకర్త జానకి రామయ్య (నాగినీడు), ఆ ఊరి బడి పంతులు మూర్తి (శివాజీ రాజా)లకు మంచి గౌరవ మర్యాదలుంటాయి. జానకి రామయ్య కూతురు సీత (గరిమ చౌహాన్), మూర్తి కొడుకు రామ్ (సుమన్ తేజ్) ప్రేమించుకుంటారు. ఆ ఊర్లో రావణాసురుడు వంటి రమణ (గగన్ విహారీ) ఉంటాడు. కంటపడిన అమ్మాయిలందరనీ అనుభవిస్తూ ఊరికి పీడలా, శనిలా ఉంటాడు. అలాంటి రమణ.. సీతకి బావ అవుతాడు. కానీ సీతకి మాత్రం రామ్ అంటేనే ఇష్టం. వీరిద్దరి ప్రేమ సంగతి తెలుసుకోకుండా రమణతో సీత నిశ్చితార్థం జరిపిస్తాడు జానకి రామయ్య. మూర్తి మాత్రం సీతా, రామ్‌ల పెళ్లి చేసేందుకు ప్రయత్నిస్తాడు. ఈ క్రమంలో జానకి రామయ్యతో వాగ్వాదం జరుగుతుంది. ఇక సీతని రామ్ తీసుకెళ్లి పెళ్లి చేసుకుంటాడు. తన పరువు పోయిదని, తన ప్రాణమైన సీత దూరమైందనే బాధలో జానకి రామయ్య గుడిలోని సీత విగ్రహాన్ని తీసుకొచ్చేస్తాడు. అలా ఆ ఊర్లో ఉన్న గుడిని మూసేస్తాడు. మరో పక్క తను చేసుకోబోయే సీతని రామ్ ఎత్తుకెళ్లాడు రమణ రగిలిపోతుంటాడు. పారిపోయిన వాళ్లు మళ్లీ ఎందుకు తిరిగి రావాలని అనుకుంటారు? ఊర్లోకి వచ్చిన రామ్, సీతలకు ఎదురైన అనుభవాలు ఏంటి? చివరకు జానకి రామయ్య మనసు మార్చుకుని తన కూతురి ప్రేమను అంగీకరిస్తాడా? రమణకు ఎలాంటి గతి పడుతుంది? తిరిగి మళ్లీ ఆ గుడికి పూర్వ వైభవం వస్తుందా? అన్నదే కథ.

  నటీనటులు
  సుమన్ తేజ్‌కు ఇది మొదటి సినిమానే అయినా అలా ఎక్కడా కనిపించదు. యాక్షన్ సీక్వెన్స్, ఎమోషనల్ సీన్స్ ఇలా అన్నింట్లోనూ ఆకట్టుకుంటాడు. లెంగ్తీ ఎమోనల్ డైలాగ్స్‌ను కూడా బాగానే హ్యాండిల్ చేశాడు. సీత పాత్రలో కొత్త అమ్మాయి గరిమ చౌహాన్ చక్కగా కనిపించింది.. నటించింది. గ్లామరస్‌గానూ మెప్పిస్తుంది. ఇక ఎమోషనల్ సీన్స్‌లోనూ ఓకే అనిపిస్తుంది. విలన్‌గా రమణ పాత్రలో కనిపించి గగన్ విహారి తన పాత్రలోనూ క్రూరత్వాన్ని చూపించాడు. చూసే ప్రేక్షకుడికే చంపేయాలనేంత కసి పుడుతుంది. అలా తన పాత్రకు వంద శాతం న్యాయం చేశాడు. నాగినీడు, మూర్తి పాత్రలు రెగ్యులర్ ఫాదర్ పాత్రల్లానే అనిపిస్తాయి. ఊర్లో కనిపించే మిగిలిన కారెక్టర్లు ఓకే అనిపిస్తాయి.

  విశ్లేషణ
  సీతా కళ్యాణ వైభోగమే అనే టైటిల్‌ను చూస్తే ఇదేదో కొత్త అని ఎవ్వరూ అనుకోరు. మనకు తెలిసిన, మనం ఎన్నో సార్లు చూసిన కథనే చెప్పబోతోన్నారని అర్థం అవుతుంది. సీతారాముడి లాంటి జంటకు రావణాసురుడు వంటి వాడి వల్ల ఎదురైన కష్టాలేంటి? అన్నది అందరికీ తెలిసిందే. పరువు హత్యలు, ప్రేమను వ్యతిరేకిస్తూ అర్థం చేసుకోలేని తండ్రి.. ఇలాంటి పాయింట్‌లతో ఇది వరకెన్నో సినిమాలు చూశాం. ఈ సీతా కళ్యాణ వైభోగమే కూడా పాత పాయింట్‌తోనే వచ్చింది. మన విలువల్ని మర్చిపోతోన్న ఈ తరానికి ఇలాంటి కాన్సెప్ట్‌తో మళ్లీ సినిమాను తీసి అందరికీ వాటిని పరిచయం చేసే ప్రయత్నం చేశారు.

  ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఊరి పరిచయం, పాత్రల పరిచయం, ప్రేమ చిగురించడం, విలన్ వికృత చేష్టలను చూపిస్తూ అతని వ్యక్తిత్వాన్ని పరిచయం చేయడం వంటి సన్నివేశాలతో ముందుకు సాగుతుంటుంది. ఊరి నుంచి వెళ్లిపోయిన జంట.. మళ్లీ ఊళ్లోకి తిరిగి రావడం, ఈ జంట ఉండే ఇంటిమీద రమణ దాడికి దిగడంతో ఇంటర్వెల్ సీన్‌ కార్డ్ పడుతోంది. కానీ శ్రీరామనవమి కావడం.. ఊరి కట్టుబాట్లకు అనుగుణంగా ఎవ్వరూ ఎవరిపై దాడి చేయకూడదనే నిబంధన ఉండటం కథనం ఆసక్తికరంగా మారుతుంది.

  రమణ చేసే వికృత చేష్టలకు చరమ గీతాన్ని ఎలా పాడుతారు? తండ్రి మనసును ఎలా మారుస్తారు? అనేది సెకండాఫ్‌లో ఎమోషనల్‌గా సాగుతుంది. సాంకేతికంగా ఈ చిత్రం మెప్పిస్తుంది. కెమెరామెన్ ఇచ్చిన విజువల్స్ సహజంగా ఉంటాయి. ఆర్ఆర్ మూడ్‌కు తగ్గట్టుగా ఉంటుంది. పాటలు వినసొంపుగా ఉంటాయి. ఎడిటింగ్ మీద ఇంకాస్త దృష్టి పెట్టాల్సింది. మాటలు ఆలోచింపజేలా ఉంటాయి. రాముడు, రామాయణ విశిష్టతలు చెప్పే డైలాగ్స్ బాగుంటాయి. నిర్మాత పెట్టిన ప్రతీ పైసా తెరపై కనిపిస్తుంది. డ్రీమ్ గేట్స్ బ్యానర్ స్థాయికి తగ్గట్టుగా సినిమా ఉంటుంది.

  రేటింగ్ : 3