• March 18, 2023

Rangamarthanda Movie Review : రంగమార్తాండ ప్రి(రి)వ్యూ.. రేటింగ్‌లు వేసేందుకు ఇది సినిమా కాదు.. జీవితం!

Rangamarthanda Movie Review : రంగమార్తాండ ప్రి(రి)వ్యూ.. రేటింగ్‌లు వేసేందుకు ఇది సినిమా కాదు.. జీవితం!

    Rangamarthanda Movie Review in Telugu రంగమార్తాండ సినిమాకు రెగ్యులర్‌ ఫార్మాట్‌లో రివ్యూ రాయడం దాని స్థాయిని తగ్గించినట్టు అవుతుందనిపిస్తోంది. ఇక సినిమాకు రేటింగ్ వేసి కూడా దాని స్థాయి కొలవాలనుకోవడం తప్పే. ఎందుకంటే రంగమార్తాండ అనేది కేవలం సినిమా కాదు.. అదొక జీవితం. జీవిత సత్యాలను చెప్పే ఓ గురువు. జీవిత పాఠాలను చెప్పే దృశ్యకావ్యం. మన అమ్మనాన్నల కథ అని ముందుగానే చెప్పారు.

    రంగమార్తాండ చూస్తే అది ప్రతీ ఇంట్లో ఇప్పుడు జరుగుతున్నదే అనిపిస్తుంది. అయితే ఇటువంటి కథలు ఇది వరకు రాలేదా? అంటే.. ఎన్నో వచ్చాయి. ఎన్నో సినిమాలను చూశాం. అమ్మనాన్నలను నిర్లక్ష్యం చేసే బిడ్డల కథలు ఎన్నో చూశాం. నిత్యం ఇలాంటి కథలు వింటూనే ఉంటాం. సమాజంలో ఇప్పుడు జరుగుతున్నది కూడా అదే.

    తల్లిదండ్రులను నడి రోడ్డు మీద వదిలేస్తోన్న బిడ్డలెంతో మంది ఉన్నారు. కొడుకు, కూతుళ్లు తమ తమ అమ్మనాన్నాలను ఎలా చూసుకుంటున్నారన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కోడలు వచ్చాక, అల్లుడు వచ్చాక ఇంట్లోని పరిస్థితులు ఎలా మారుతుంటాయి..ఆ తల్లిదండ్రులకు ఎలాంటి స్థితి పడుతోందో ఎన్నెన్నో చదువుతూనే ఉన్నాం.

    అయితే తెరపై ఈ కథను చూడటం, అందులో బ్రహ్మానందం, ప్రకాష్‌ రాజ్, రమ్యకృష్ణ వంటి వారు నటించడం కాదు కాదు ఆ పాత్రల్లో జీవించడంతో ఈ సినిమా స్థాయి పెరిగింది. ఈ సినిమాకు త్రిమూర్తుల్లా నిలిచారు ఆ ముగ్గురు. ఏ ఒక్కరూ కూడా తమ తమ పాత్రల పరిధి దాటి నటించలేదు.

    రంగమార్తాండ రంగారావుగా గంభీరతను ప్రదర్శించాడు ప్రకాష్‌ రాజ్. అయినా ప్రకాష్‌ రాజ్‌ నటన గురించి మనం కొత్తగా చెప్పుకోవాల్సిన పని లేదు. చక్రధర్‌గా బ్రహ్మానందం తన నటనాచాతుర్యాన్ని ప్రదర్శించాడు. ఇన్నాళ్లు నవ్వించిన బ్రహ్మానందం ఈ సినిమాతో కంటతడి పెట్టించాడు. రంగస్థల నటుల జీవితాలకు తార్కాణంగా ఈ రెండు పాత్రలను చూపించాడు దర్శకుడు క్రిష్ణవంశీ.

    చిన్న టాబ్లెట్ల మీద ఉన్న నమ్మకం.. చిన్నతనం నుంచి పెంచిన కొడుకుల మీద లేదా? అంటూ రాసిన కొన్ని డైలాగ్స్ సినిమాలోని గాఢతను చూపిస్తాయి. బిడ్డలు లేకపోవడం ఎంత అదృష్ణం అంటూ ఓ చోట బ్రహ్మానందంతో చెప్పించే డైలాగ్‌ కంటతడి పెట్టిస్తుంది. మనసును కదిలిస్తుంది. ప్రీక్లైమాక్స్‌లో బ్రహ్మానందం, ప్రకాష్‌ రాజ్‌ల మధ్య వచ్చే సీన్లు, అందులో బ్రహ్మానందం నటించిన తీరు, చెప్పించిన సంభాషణలు అందరి గుండెల్ని మెలిపెట్టేస్తుంది.

    కొడుకు, కూతురికి ఉన్న ఆస్తి అంతా రాసిచ్చిన తరువాత ఎదురయ్యే పరిస్థితులు చక్కగా చూపించారు. ఇందులో చెడ్డ కొడుకు, కూతురు అనే కాన్సెప్ట్ ఉండదు. డబ్బు ఎలా మారుస్తుంది.. పరిస్థితి ఎలా మారుతాయి.. దాని వల్ల కన్నబిడ్డలు ఎలా ప్రవర్తిస్తారు అనేది చక్కగా చూపించారు.

    అమ్మానాన్నల విలువ లేనప్పుడు తెలుసుకుని బాధపడే కన్నా.. ఉన్నప్పుడే వారిని చక్కగా చూసుకోండని సందేశం ఇస్తాడు. ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం, రమ్యకృష్ణలు నటించడం గొప్పనా, ఆ నటను రాబట్టుకున్న కృష్ణ వంశీ గొప్పనా? అన్నది చెప్పలేం. ఈ సినిమాను చూసిన తరువాత కంటతడి పెట్టని వ్యక్తికి మనసు ఉండదేమో? అనే అనుమానం కలుగుతుంది. ఒంటరి జననం, ఏకాకి మరణం.. నడుమ ఈ జీవితం నాటకం అంటూ గొప్ప సందేశాన్ని ఇస్తుంది రంగమార్తాండ. ఇలా ఈ సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఈ సినిమాను చూస్తే ఆలోచనలు కలుగుతాయి. అమ్మనాన్నల విలువ తెలుస్తుంది. కన్నబిడ్డలు ఎలా ఉండకూడదో తెలుస్తుంది. జీవిత సారాన్ని చెబుతుంది.

    బాటమ్ లైన్ : రంగమార్తాండ.. ఉండలేరు కళ్లు చెమ్మగిల్లకుండా!