- April 14, 2022
KGF Chapter 2 Movie Review.. హిస్టరీలో నయా ‘చాప్టర్’

KGF Chapter 2 సినిమా మీదున్న అంచనాల గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. సీక్వెల్ మీదుండే అంచనాలే అలా ఉంటాయి. అయితే వాటిని అందుకోవడం అందరికీ అంత సులభం కాదు.కానీ ప్రశాంత్ నీల్ మాత్రం దాన్ని సులభంగా చేధించేశాడు. కేజీయఫ్ చాప్టర్ 1 సినిమాతో అందరినీ మెప్పించిన ప్రశాంత్ నీల్.. చాప్టర్ 2తో మరోసారి అందరినీ మెస్మరైజ్ చేసేందుకు వచ్చాడు. మరి ఈ చిత్రం ఏ మేరకు ఆకట్టుకుందో చూద్దాం.
కథ
చాప్టర్ 2 కథ అందరికీ తెలిసిందు. గరుడని ఏసేసిన రాకీ భాయ్.. ఆ తరువాత నారాచిని, కేజీయఫ్‌ను ఎలా పరిపాలించాడు. కేజీయఫ్‌ను సొంతం చేసుకునేందుకు ఎదురుచూస్తున్న ఎంతో మంది ఆటను రాకీ భాయ్ ఎలా ఆటకట్టించాడు. అధీరా(సంజయ్ దత్)ను ఎలా ఎదుర్కొన్నాడు. ఇక భారత ప్రధానిగా రమికా సేన్ (రవీనా టాండన్)కు రాకీ భాయ్ ఎలా ఎదురు నిలబడ్డాడు. ఇండియాను శాసించే స్థాయికి ఎదిగిన రాకీ భాయ్ చివరకు ఏమయ్యాడు. చనిపోతే రాజులా చనిపోవాలని అమ్మ చెప్పిన మాటలను, అమ్మకిచ్చిన మాటలను రాకీ భాయ్ నెరవేర్చాడా? లేదా? అన్నదే కథ.
చాప్టర్ 1లో ఉన్నట్టుగానే ప్రతీ షాట్, ప్రతీ సీన్ ఎలివేషన్‌లానే ఉంటుంది. రాకీ భాయ్‌గా యష్‌ని తప్పా ఎవ్వరినీ ఊహించుకోలేం. అంతలా యష్ తన లుక్స్, మ్యానరిజంతో ఆకట్టుకున్నాడు. ఇక యష్ ఇండియన్ మాస్ హీరోగా నిలిచిపోయేట్టున్నాడు. సంజయ్ దత్ పాత్ర ధీటుగా ఉంది. చివర్లో ఈ ఇద్దరూ తలపడే సీన్లు అదిరిపోతాయి. హోరాహోరీగా ఇద్దరూ పోరాడుతుంటారు. ఇక రవీనా టాండన్ పాత్రలో గాంభీర్యం కనిపిస్తుంది. ఆమె ఆహార్యం, మాట తీరు, కనిపించిన విధానం అన్నీ కూడా బాగున్నాయి. ఈశ్వరీ రావు, శ్రీనిధి శెట్టి, ప్రకాష్ రాజ్ ఇలా అందరూ కూడా కథను ముందుకు తీసుకెళ్లేందుకు ఉపయోగపడ్డారు.
చాప్టర్ 2 సినిమాకు ప్రశాంత్ నీల్ కర్త కర్మ క్రియ. ఇలాంటి ఓ సినిమాను అనుకోవడమే ఓ పెద్ద సాహసం. తాను అనుకున్నట్టుగా చిత్రాన్ని తెరకెక్కించడం మరో సాహసం. తాను విజువలైజ్ చేసుకున్న తీరు, దాన్ని తెరపై ఆవిష్కరించిన తీరు అందరినీ అబ్బురపరుస్తుంది. ప్రశాంత్ నీల్‌కు ది బెస్ట్ కెమెరామెన్, ది బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ దొరికారు. ప్రశాంత్ నీల్ ఆలోచనలను తన కెమెరా కంటితో చూపించేశాడు కెమెరామెన్. ఇక తాను ఏ ఎమోషన్ అయితే ప్రేక్షకుడిలోకి జొప్పించాలని ప్రశాంత్ నీల్ అనుకున్నాడో.. దాన్ని మ్యూజిక్ డైరెక్టర్ వంద శాతం చేసేశాడు. తన నేపథ్య సంగీతంతో రోమాలు నిక్కబొడుచుకునేలా చేశాడు.
ఇక ఈ చిత్రంలో అన్నింటి కంటే ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మాటలు. అమ్మ సెంటిమెంట్‌తో నడిచే ఈ కథలో ఉన్న డైలాగ్స్ అందరినీ మెప్పిస్తాయి. అమ్మకిచ్చిన మాట కోసం ఇదంతా చేసే రాకీని చూసి అందరూ ఆశ్చర్యపోతారు. మొదలెట్టమని చెప్పేందుకు అమ్మ ఉంది.. కానీ ఆపమని చెప్పేందుకు ఎవ్వరూ లేరు అనే ఓ డైలాగ్‌తో రాకీ భాయ్ చేయబోయే విధ్వంసాన్ని ముందే హింట్‌తో చెప్పేశాడు ప్రశాంత్ నీల్.
తన కొడుకు ఒక్క రోజు బతికినా కూడా సుల్తాన్‌లా బతకాలని అమ్మ కోరుకుంటుంది. చనిపయే సమయంలోనూ సుల్తాన్‌లా ఉంటాడు అని అమ్మ మాటలను రాకీ భాయ్ నిజం చేస్తాడు. పోయే ముందు ఏమీ తీసుకుపోమని అంటారు.. కానీ అంతా పట్టుకెళ్లిపోయాడు అనే డైలాగ్.. ఎలా చావాలో తాను నిర్ణయించుకున్నాడు.. ఎలా బతికాడో నేను రాస్తాను అనే మరో డైలాగ్ అద్భుతంగా ఉంది. ఇలా ఈ చిత్రంలోని డైలాగ్స్ అందిరినీ హంట్ చేస్తూనే ఉంటాయి.
తన ప్రేయసిని పట్టుకెళ్లారని తెలిసి రాకీ భాయ్ వచ్చే తీరు, ఒంటరిగా వేటాడుతూ వచ్చే విధానం మాస్ ప్రేక్షకులకు పిచ్చెక్కిస్తుంది. ఇక రాకీ భాయ్ పోలీస్ స్టేషన్‌ను కాల్చే సీన్, అధీరా సైన్యం మీద కాల్పులు జరిపే సీన్‌కు థియేటర్లో బాక్సులు బద్దలవ్వాల్సిందే. మొత్తానికి మాస్‌కు నిర్వచనం చెబుతూ తీసిన ఈ చాప్టర్ 2 ఇండియన్ హిస్టరీలోని కమర్షియల్ చిత్రాలకు ఓ దిక్సూచిలా ఉంది.
చివరగా : చాప్టర్ 2.. రాకీ భాయ్ దునియా