- September 2, 2022
First Day First Show Review : ఫస్ట్ డే ఫస్ట్ షో రివ్యూ.. పని చేయని ‘జాతి రత్నాలు’ ప్లాన్

First Day First Show Movie Review ఫస్ట్ డే ఫస్ట్ షో అనేది అందరికీ ఓ ఫీలింగ్. మరీ ముఖ్యంగా హార్డ్ కోర్ అభిమానులకు అది ఎంతో ప్రెస్టీజియస్‌గా ఉంటుంది. ఈ కాన్సెప్ట్‌తోనే జాతి రత్నాలు ఫేమ్ అనుదీప్ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. జాతి రత్నాలు బ్రాండ్‌తోనే ఈచిత్రాన్ని కూడా ప్రమోట్ చేసుకుందామని అనుకున్నాడు. మరి ఈ సినిమా ఆడియెన్స్‌ను ఆకట్టుకుందా? లేదా? అన్నది చూద్దాం.
స్టోరీ
ఫస్ట్ డే ఫస్ట్ షో సినిమా అంతా కూడా పవన్ కళ్యాణ్ ఖుషీ చిత్రం చుట్టూ తిరుగుతుంది. అంటే 2001 ప్రాంతాన్ని చూపిస్తారన్న మాట. ఈ కథ అంతా కూడా నారాయణ్ ఖేడ్‌లో జరుగుతుంది. హెడ్ మాస్టర్ ధర్మ రాజు (తనికెళ్ల భరణి) కొడుకు శ్రీనివాస్ (శ్రీకాంత్ రెడ్డి)కి సినిమాలంటే పిచ్చి. అందులోనూ పవన్ కళ్యాణ్‌కు హార్డ్ కోర్ ఫ్యాన్. ఖుషీ సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాలని టికెట్ల కోసం తెగ ప్రయత్నిస్తుంటాడు. ఇంతలో లయ (సంచిత) కూడా శ్రీనివాస్‌ను ఖుషి టికెట్లు అడుగుతుంది. దీంతో టికెట్లు సంపాదించేందుకు శ్రీనివాస్ పడ్డ పాట్లు ఏంటి? చివరకు టికెట్లు దొరికాయా? ఇందులో రవన్న (వెన్నెల కిషోర్) కారెక్టర్ ఏంటి? చివరకు ఖుషి సినిమాను శ్రీను లయ ఇద్దరూ కలిసి చూశారా? అసలేమైంది? అనేది కథ.
నటీనటులు
ఇందులో చాలా మంది నటీనటులు కనిపిస్తుంటారు. అలా వస్తుంటారు పోతుంటారు. హీరో, హీరో ఫ్రెండ్ ఎక్కువగా కనిపిస్తుంటారు. ఈ ఇద్దరూ తెలంగాణ యాసలో డైలాగ్స్ అద్భుతంగా చెప్పారు. డైరెక్టర్ కూడా ఓ కారెక్టర్ పోషించాడు. అది చాలా బాగా పండింది. హీరోయిన్‌కు అంత స్కోప్ దక్కినట్టు అనిపించదు. తనికెళ్ల భరణి తన అనుభవాన్ని చూపించాడు. ప్రభాస్ శ్రీను చేసిన ఒక్క సీన్ బాగుంది. వెన్నెల కిషోర్ నవ్వించేశాడు. ఇలా అన్ని పాత్రలు చక్కగా కుదిరాయి.
విశ్లేషణ
జాతి రత్నాలు సినిమాలో కథ ఏమీ లేదు. కానీ అందరినీ నవ్వించేశారు. కథ ఏమీ లేకుండా.. కామెడీ సీన్లన్నీ ఒక చోట క్రమంగా చేర్చడంతో జాతి రత్నాలు సినిమాకు అందరూ కనెక్ట్ అయ్యారు. హిట్ చేశారు. కానీ ఫస్ట్ డే ఫస్ట్ షోకు మాత్రం అది జరగలేదు. కామెడీ పండలేదు. పైగా ఇది కేవలం పవన్ కళ్యాణ్ చుట్టూనే తిరుగుతుంది. దీంతో అన్ని వర్గాల ఆడియెన్స్ కూడా సినిమా మీద దృష్టి పెట్టరు. అదొక మైనస్.
ఇక ఇందులో అంత పెద్ద ఎమోషన్ ఏమీ ఉండదు. ఫస్ట్ డే ఫస్ట్ షో చూడకపోతే ఏమైనా అవుతుందా? భూమి మారుతుంది.. ఆకాశం విరుగుతుందా? అంటూ ఇలా ఏదో ఒక డైలాగ్ ఉంది. నిజానికి ఈ డైలాగ్ ఈ సినిమాకే పని కొస్తుంది. ఈ సినిమా చూడకపోతే మనం చచ్చిపోతామా? ఏమైనా అవుతుందా? అనే అనుమానం వస్తుంది. థియేటర్‌లోనూ, ఓటీటీలోనూ ఈ చిత్రాన్ని భరించలేం.
అసలు ఎన్నో లాజిక్ లేని సన్ని వేశాలున్నాయి. కాకపోతే 2001 ప్రాంతంలో ఎలా ఉండేది.. అప్పుడు టికెట్ల కోసం అభిమానులు ఎంతగా కష్టపడేవారు అన్నది బాగా చూపించారు. ఆ ఒక్క పాయింట్ చుట్టూనే కథను అటూ ఇటూ తిప్పడంతో మొదటికే మోసం వచ్చింది. ఈ చిత్రం అందరినీ ఆకట్టుకోవడంలో విఫలమైంది. ఆ కామెడీ కూడా సరిగ్గా పండలేదు. సంగీతం కూడా అంతగా సెట్ అవ్వలేదు. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ పర్వాలేదు. ఈ సినిమాకు అంతగా ఖర్చు పెట్టలేదనిపిస్తోంది.
బాటమ్ లైన్ : థియేటర్లో ‘ఫస్ట్ డే ఫస్ట్ షో’ చూడకపోయినా పర్లేదు
రేటింగ్ 2