• August 5, 2025

థ్రిల్ల్‌ ఫీలయ్యే సినిమా ‘బకాసుర రెస్టారెంట్‌: దర్శకుడు ఎస్‌జే శివ

థ్రిల్ల్‌ ఫీలయ్యే సినిమా ‘బకాసుర రెస్టారెంట్‌: దర్శకుడు ఎస్‌జే శివ

    ‘బకాసుర రెస్టారెంట్‌’ అనేది ఇదొక కొత్తజానర్‌తో పాటు కమర్షియల్‌ ఎక్స్‌పర్‌మెంట్‌. ఇంతకు ముందు వచ్చిన యమలీల, ఘటోత్కచుడులా ఆడియన్స్‌ థ్రిల్లింగ్‌గా ఫీలయ్యే కథ ఇది. ఇలాంటి కొత్త కథలనే జనాలు ఆదరిస్తారనే నమ్మకం వుంది. మన జీవితంలోకి ఓ తిండిబోతు దెయ్యం వస్తే ఆ తిప్పలు ఎలా ఉంటాయి అనేది కథ. సినిమా మొత్తం కంప్లీట్‌ ప్యాకేజీలా ఉంటుంది. హారర్‌ థ్రిల్లర్‌, కామెడీ, ఎమోషన్‌ అన్నీ ఉంటాయి’ అంటున్నారు దర్శకుడు ఎస్‌జే శివ. ఆయన దర్శకత్వంలో కమెడియన్‌ ప్రవీణ్‌ ప్రధాన పాత్రలో రూపొందుతున్న చిత్రం ‘బకాసుర రెస్టారెంట్‌’, ఈ చిత్రంలో వైవా హర్ష టైటిల్‌ రోల్‌లో నటిస్తున్నారు. కృష్ణభగవాన్‌ ,షైనింగ్‌ ఫణి, కేజీఎఫ్‌ గరుడరామ్‌,ఇతర ముఖ్య పాత్రలో యాక్ట్‌ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని ఎస్‌జే మూవీస్‌ పతాకంపై లక్ష్మయ్య ఆచారి, జనార్థన్‌ ఆచారి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. హంగర్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకున్న ఈ చిత్రం ఆగస్టు 8న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్ధమౌతుంది. ఈ సందర్బంగా దర్శకుడు ఎస్‌జే శివతో జరిపిన ఇంటర్వ్యూ ఇది.

    బకాసుర రెస్టారెంట్‌ ఎలాంటి కథాంశం ?
    బకాసుర ఎంటర్‌టైన్‌మెంట్‌ అనేది ఒక హంగర్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌. ఇప్పటి వరకు తెలుగులో చాలా జోనర్‌లు వచ్చాయి. ఇదొక కొత్త జోనర్‌. మా సినిమాతోనే ఇంట్రడ్యూస్‌ చేస్తున్నాం. ఇదొక తిండిబోతు కథ. దానిని నుంచి వచ్చే కామెడీ కాబట్టి హంగర్‌ కామెడీ అంటున్నాం. ఫైనల్‌గా ప్రేక్షకులను ఎంటర్‌టైన్‌ చేయడమే మా లక్ష్యం.

    ఈ సినిమాలో హీరోగా కమెడియన్‌ ప్రవీణ్‌ను తీసుకోవడానికి కారణం ఏమిటి?
    మొదట వేరే హీరోలతో డిస్కస్‌ చేశాం. కానీ అందరూ సోలో హీరో కథలైతే చేస్తాం అన్నారు. కానీ ఈ కథ అలాంటిది కాదు. ఆ సమయంలోనే ప్రవీణ్‌ కూడా హీరోగా ఇంట్రడ్యూస్‌ అయ్యే ప్లానింగ్‌లో వున్నాడని తెలిసి ఆయన్నీ కలిశాం.ఐదుగురు బ్యాచిలర్స్‌ మధ్య జరిగే కామెడీ కథ ఇది. ఇక ఈ కథ వినగానే ప్రవీణ్‌ ఈ సినిమాకు కథే హీరో.. తప్పకుండా మనం చేద్దా అన్నాడు.

    మీ నేపథ్యం ఏమిటి?
    నేను లండన్‌లో ఇంటర్నేషన్‌ బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌ పూర్తిచేశాను. విరూపాక్ష చిత్రానికి అసిస్టెంట్‌ దర్శకుడిగా పనిచేశాను. ఇక గతంలో మా నాన్న గారు కొన్ని సినిమాలు నిర్మించారు. ఆయన కోరిక, ఆయన కల తీర్చడం కోసమే నేను దర్శకుడిగా, మా అన్నయ్య నిర్మాతగా మారాడు.

    ఇది బకాసుర రెస్టారెంట్‌లో జరిగే కథనా?
    రెస్టారెంట్‌ పెట్టడమే కథ. రెస్టారెంట్‌ పెట్టాలని కలలు కనే ఓ యువకుడి కథ ఇది. ఈ అంశానికి హారర్‌, థ్రిల్లింగ్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌, ఎమోషన్‌ అంశాలు జోడించాం. ఇదొక క్లీన్‌ కామెడీ.. అందరూ ఫ్యామిలీతో కలిసి చూడదగ్గ చిత్రమిది.

    ఇదొక కొత్త జానర్‌.. ఎక్స్‌పెరిమెంట్‌ అనుకోవచ్చా?
    నిజమే ఇదొక కొత్తజానర్‌తో పాటు కమర్షియల్‌ ఎక్స్‌పర్‌మెంట్‌ అనుకోవచ్చు. ఇంతకు ముందు వచ్చిన యమలీల, ఘటోత్కచుడులా ఆడియన్స్‌ థ్రిల్లింగ్‌గా ఫీలయ్యే కథ ఇది. ఇలాంటి కొత్త కథలనే జనాలు ఆదరిస్తారనే నమ్మకం వుంది. మన జీవితంలోకి ఓ తిండిబోతు దెయ్యం వస్తే ఆ తిప్పలు ఎలా ఉంటాయి అనేది కథ. సినిమా మొత్తం కంప్లీట్‌ ప్యాకేజీలా ఉంటుంది. హారర్‌ థ్రిల్లర్‌, కామెడీ, ఎమోషన్‌ అన్నీ ఉంటాయి.

    ఈ సినిమాను దిల్‌రాజు గారు పంపిణీ చేస్తున్నారని తెలసింది?
    అవును. శిరీష్‌ గారు సినిమా చూసి మెచ్చుకున్నారు. ఈ సినిమా కథ గురించి ఆయన మాతో గంటసేపు డిస్కషన్‌ చేశాడు. ఎస్వీసీ లాంటి గొప్ప సంస్థ ఈ సినిమాను విడుదల చేయడం ఆనందంగా ఉంది

    కొత్తకథతో, స్టార్స్‌ లేకుండా ఇంత బడ్జెట్‌ అవసరమా? అనే వారికి మీ సమాధానం?
    కథను నమ్మి ఈ సినిమాను చేశాం. పెద్ద హీరోలను పెట్టిన రిటర్న్స్‌ వస్తాయని గ్యారంటిగా చెప్పలేని రోజులివి. పెద్ద హీరోకు ఇవ్వాల్సిన పారితోషికం మేము మేకింగ్‌లో పెట్టాం. క్వాలిటీగా సినిమా తీశాం. కంటెంట్‌ బాగుంటే సినిమాలు సూపర్‌హిట్‌ అవుతాయని ఎన్నో సినిమాలు ప్రూవ్‌ చేశాయి.

    ఈ సినిమా కథకు ఎవరూ కనెక్ట్‌ అవుతారు?
    ముఖ్యంగా అందరికి తమ బ్యాచ్‌లర్‌ లైఫ్‌ గుర్తొస్తుంది. ఈ చిత్రంలో వైవా హర్ష టైటిల్‌ పాత్రలో బకాసురగా కనిపిస్తాడు.

    మీ తొలి సినిమా అనుభవం ఎలా ఉంది?
    సినిమా తీయడం చాలా టఫ్‌.. ఇక్కడ సినిమా బిజినెస్‌లో ఎవరైనా కథ ఏమిటి? ఎలా ఉండబోతుంది? అని అడగటం లేదు. ప్యాడింగ్‌ ఎవరు? ఎంత పెట్టారు? ఎంత ఎక్స్‌పెక్ట్‌ చేస్తున్నారు అని అడుగుతున్నారు. సినిమా అనేది ఎంటర్‌టైన్‌మెంట్‌ కానీ దాని గురించి తప్ప అన్నీ అడుగుతున్నారు.

    భవిష్యత్‌లో ఎలాంటి సినిమాలను తీస్తారు?
    నాకు విఠలాచార్య లాంటి సినిమాలు అంటే ఇష్టం. ఆ తరహా కథలతో సినిమాలు తీయాలని వుంది. ప్రస్తుతం నా దగ్గర ఓ ఫ్యాక్షన్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ కథ ఉంది. ఇలాంటి బ్యాక్‌డ్రాప్‌లో తెలుగు ఆడియన్స్‌ సినిమా చూసి చాలా గ్యాప్‌ వచ్చింది.

    మీ తదుపరి చిత్రం కూడా మీ బ్యానర్‌లోనే చేస్తారం?
    మా ఎస్‌జే బ్యానర్‌లో కొత్త దర్శకులకు మాత్రమే అవకాశం. సో.. నా తదుపరి చిత్రం ఇందులో ఉండదు. ఈ బ్యానర్‌లో వరుసగా సినిమాలు చేస్తాం.

    బకాసుర రెస్టారెంట్‌ పార్ట్‌-2 ఉంటుందా?
    లేదు. ఎందుకంటే బకాసుర పాత్ర, ఆ ఎమోషన్‌ ఈ పార్ట్‌లోనే ఎండ్‌ అవుతుంది.

    దర్శకుడిగా మీ లక్ష్యం ఏమిటి?
    చాలా తక్కువ వర్కింగ్‌డేస్‌లో సినిమాలు చేయడం అంటే ఇష్టం. ఈ విషయంలో పూరీ గారు నాకు ఆదర్శం. ఈ రోజుల్లో నిర్మాత డబ్బు విరాళంగా మారిపోతుందనేది నా ఫీలింగ్‌. అలా కాకుండా ఆ డబ్బును ప్రాపర్‌గా ఖర్చు పెట్టాలి. అప్పుడూ అందరూ బాగుంటారు. మా బకాసుర రెస్లారెంట్‌ ఐదు కోట్ల రూపాయాలతో తీసిన 12 కోట్ల రూపాయాల అవుట్‌పుట్‌ కనిపిస్తుంది.