Bangarraju Movie Review : బంగార్రాజు రివ్యూ.. మ్యాజిక్ చేసిన చై, నాగ్!

Bangarraju Movie Review : బంగార్రాజు రివ్యూ.. మ్యాజిక్ చేసిన చై, నాగ్!

    Bangarraju Movie Review బంగార్రాజు మూవీతో తెలుగు ప్రేక్షకులను అలరిచేందుకు నాగార్జున తన కొడుకు నాగ చైతన్యతో కలిసి వచ్చాడు. అయితే ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులందరినీ ఆకట్టుకున్నాడా? లేదంటే.. అక్కినేని అభిమానులను మాత్రమే సంతృప్తి పరిచాడా? అన్నది చూద్దాం. బంగార్రాజు సినిమా కథాకమామీషు ఏంటో ఓ సారి చూద్దాం.

    సోగ్గాడే చిన్ని నాయనకు సీక్వెల్‌గా బంగార్రాజుని తీశారు. అందులోని సమస్యలనే ఇందులోనూ కాస్త అటూ ఇటూ తిప్పి పెట్టేశారు. అందులో గుడి, స్వామి వారి నగలు, కిరీటం వాటి మీద సాగుతుంది. ఇక ఇందులో వజ్రాల కోసం నడిపించారు. సునామీ వల్ల చెదిరిన శివలింగం, గుడి పరిస్థితులు, వజ్రాలను కాపాడే బాధ్యత మళ్లీ బంగార్రాజు మీద పడుతుంది. అయితే ఈ సారి చిన్న బంగార్రాజు (నాగ చైతన్య) సాయంతో, అతడి ఆత్మలోకి బంగార్రాజు (నాగార్జున) దూరతాడు. వజ్రాలను కొట్టేయాలని చూసే వారిని ఆటను ఎలా కట్టించాడు? సర్పంచ్ నాగలక్ష్మీకి, చిన్న బంగార్రాజుకు మధ్యలో ప్రేమను పుట్టించేందుకు పెద్ద బంగార్రాజు చేసిన ప్రయత్నాలు ఏంటి? పెద్ద బంగార్రాజు పై నుంచి దిగి వచ్చిన కార్యం సఫలమైందా? లేదా? అన్నదే కథ

    నాగ చైతన్య నటన అందరినీ ఆకట్టుకుంటుంది. సినిమా ప్రమోషన్స్‌లో అందరూ చెప్పినట్టుగానే కొత్త నాగ చైతన్య కనిపిస్తాడు. చైతూలోని మాస్ యాంగిల్ అందరినీ ఆకట్టుకుంటుంది. నిజంగానే పూర్తిగా ఓపెన్ అయి నటించాడా? అన్నట్టుంది. ఈ సినిమాతో చై ఆడియెన్స్‌కు మరింత దగ్గరవుతాడు. ఇక నాగార్జునకు ఇలా సరస పాత్రలు అలవాటే. నాగ్ ఇరగ్గొట్టేశాడు. ఇక నాగ్ రమ్యకృష్ణ స్వర్గం నుంచే కథను నడిపిస్తారు. ఈ ఇద్దరి మధ్యలో మాటలు, అందులోని సరసాలు అందరినీ ఆకట్టుకుంటాయి. ఇక కృతి శెట్టి ఎంత అందంగా కనిపిస్తుందో.. అంతే అందంగా నటించింది. డ్యాన్సులు, కామెడీ, ఎమోషన్ ఇలా అన్నింట్లో తన మార్క్ చూపించింది. ఇక చిన్న చిన్న పాత్రలు, వచ్చీ పోయే పాత్రలు ఇందులో చాలానే ఉన్నాయి. అందరూ చక్కగా నటించారు.

    కళ్యాణ్ కృష్ణ మాత్రం సరైన ఎమోషన్‌ను స్క్రిప్ట్‌లో ఇరికించలేదనిపిస్తోంది. సోగ్గాడే చిన్ని నాయన సినిమాలో ఉన్న ఎమోషనల్ ఇందులో లేదనిపిస్తోంది. సోగ్గాడే అంత పెద్ద హిట్ అయిందంటే అందులోని ఎమోషన్‌కు అందరూ కనెక్ట్ అవ్వడమే కారణం. కానీ బంగార్రాజు సినిమాలో అది మిస్ అయింది. దీంతో బంగార్రాజు సోగ్గాడుని దాటలేకపోవచ్చు.

    అవే కామెడీ సీన్లు. అవే తిప్పి తిప్పి చూపించినట్టు అవుతుంది. ఇక కొన్నిచోట్ల అవి కామెడీ సీన్లు అనిపించినా కూడా నవ్వురాదు. సినిమా కథ, కథనంలోనే కళ్యాణ్ కృష్ణ ఇంకాస్త దృష్టి పెట్టాల్సింది. మాటలు, పాటలు, విజువల్స్ అన్నీ కూడా సినిమాకు బలంగా మారాయి. కథ, కథనాలు పక్కన పెట్టేస్తే నాగ్, చైలతో స్క్రీన్ అంతా కూడా పండుగ వాతావరణం కనిపిస్తుంది.

    మొత్తానికి బంగార్రాజు అయితే అక్కినేని అభిమానులను మాత్రం నిరాశపర్చడు. నాగ్, చై కనిపించే సీన్లు, చైతూ నటించిన విధానం వారిని తెగ మెప్పిస్తుంది. అలా మొత్తానికి బంగార్రాజు పండుగకు నిజంగానే పండుగలాంటి సినిమా అయ్యే అవకాశం ఉంది. బరిలో ఇంకే సినిమాలు కూడా బంగార్రాజును టచ్ చేసేలా లేవు.

    చివరగా : వాసివాడి తస్సాదియ్యా.. అక్కినేని అభిమానులను మెప్పిస్తుందయ్యా

    రేటింగ్ : 2.75

    Leave a Reply