• August 11, 2023

Bholaa Shankar Review : భోళా.. ఏందయ్యా ఈ గోల.. మరో ‘శక్తి’ వంతమైన షాడోను మించేలా తీశావ్ కదయ్యా

Bholaa Shankar Review : భోళా.. ఏందయ్యా ఈ గోల.. మరో ‘శక్తి’ వంతమైన షాడోను మించేలా తీశావ్ కదయ్యా

  Bholaa Shankar Movie Review మెహర్ రమేష్ దర్శకత్వంలో చిరంజీవి సినిమా అంటేనే అందరూ తిట్టారు. ఇక వేదాళం సినిమా అనడంతో మరింతగా తిట్టిపోశారు. అదే అవుట్ డెటెడ్ కథ అని, మళ్లీ ఆ సినిమాను రీమేక్ చేయడం ఏంటి? అని అందరూ అనుకున్నారు. వేదాళం సినిమానే ఊసరవెళ్లి సినిమాకు కాస్త అటూ ఇటూగా ఉంటుందని, మళ్లీ ఆ సినిమాను ఎందుకు రీమేక్ చేయడం అని తలలు పట్టేసుకున్నారు మెగా ఫ్యాన్స్.

  మొత్తానికి భోళా శంకర్ సినిమా నేడు థియేటర్లోకి వచ్చింది. అసలే విపరీతమైన నెగెటివిటీతో వచ్చిన ఈ చిత్రం ఇప్పుడు థియేటర్లో జనాలను మెప్పిస్తుందా? లేదా? అసలు మెహర్ రమేష్ సినిమాను ఏం చేశకడు? చిరంజీవి ఈ మూవీని కాపాడుతాడా? మెహర్ రమేష్‌ భవిష్యత్తు ఏంటి అన్నది ఓ సారి చూద్దాం.

  కోల్‌కతా సిటీలో అమ్మాయిల అక్రమ రవాణా, డ్రగ్స్ దందాను అలెగ్జాండర్ (తరుణ్ అరోరా) నడుపుతుంటాడు. ఆ ఇంటర్నేషనల్ మాఫియాను పోలీసులు ఏం చేయలేకపోతారు. అలాంటి టైంలోనే ఆ సిటీలోకి శంకర్ (చిరంజీవి) తన చెల్లి మహా లక్మీ (కీర్తి సురేష్)తో ఎంట్రీ ఇస్తాడు. ట్యాక్సీ డ్రైవర్‌గా సిటీలో జీవనాన్ని కొనసాగిస్తాడు. ఈ క్రమంలోనే ఆ మాఫియాకు సంబంధించిన ఓ సమాచారాన్ని పోలీసులకు ఇస్తారు. దీంతో వారు శంకర్ కోసం గాలిస్తారు? తరువాత శంకర్ జీవితంలోకి వచ్చిన మార్పులు ఏంటి? అసలు శంకర్‌ను మాఫియా గాలిస్తుందా? మాఫియా కోసం శంకర్ గాలిస్తుంటాడా? మహా లక్ష్మీ, శంకర్‌కు ఉన్న రిలేషన్ ఏంటి? అన్నది తెరపై చూడాల్సిందే.

  భోళా శంకర్ సినిమాలో నటీనటుల గురించి ఎంత తక్కువగా చెప్పుకుంటే అంత మంచిది. ఏ ఒక్కరూ కూడా సహజంగా నటించలేదు. అతికి అంబాసిడర్లా నటించేశారు. ఇక చిరంజీవి నటన చూస్తే కొన్ని చోట్ల ఏహ్యాభావం కలుగుతుంది. చీదరించుకునేలా కొన్ని సీన్లలో కనిపిస్తాడు. మిగిలిన బ్యాచ్ అంతా కూడా స్క్రాప్. అందులో కామెడీ పండిందని మెహర్ రమేష్, చిరంజీవి భావించి ఉండొచ్చు కానీ చూసే వాళ్లకి మాత్రం అది కామెడీ అని ఏ మాత్రం కూడా అనిపించదు.

  చిరంజీవి కామెడీ టైమింగ్ అంటే అందరూ ఇష్టపడతారు. కానీ ఈ సినిమాను చూస్తే మాత్రం అసహ్యించుకునేలా ఉంటుంది. చిరు డ్యాన్సులు, గ్రేసు, యాక్షన్ సీక్వెన్సుల గురించి చెప్పుకోవాల్సిన పని లేదు. ఎప్పుడూ అందులో ఎవర్ గ్రీన్. అయితే ఈ భోళా శంకర్ సినిమాలో చిరు చేత మెహర్ చేయించిన నటన, కామెడీ మాత్రం చాలా దారుణంగా అనిపిస్తుంది. శ్రీముఖి, రష్మీ, జబర్దస్త్ గ్యాంగుతో చిరు చేత చేయించింది కామెడీ అని మెహర్ రమేష్ ఎలా అనుకున్నాడో ఏమో గానీ తెరపై చూసే ప్రేక్షకుడికి మాత్రం కాలిపోతుంటుంది. మెగా అభిమానులు సైతం ఆ కామెడీని జీర్ణించుకోలేరు. ఏ ఒక్క చోట కూడా కామెడీ అని ఫీల్ అయి నవ్వుకునేలా ఉండదు.

  తెరపై నిండుగా ఎంతో మంది ఆర్టిస్టులు కనిపిస్తారు. కానీ ఏ ఒక్క కారెక్టర్‌కు గానీ ఏ ఒక్క ఎమోషన్‌కి గానీ ప్రేక్షకుడు కనెక్ట్ కాడు. పైగా చిరాకు పుట్టించేలా కామెడీ ట్రాకులు, మాటలు పెట్టాడు. వెన్నెల కిషోర్, యానీ మాస్టర్ ట్రాక్‌ను మానిటర్‌లో చూసుకుని అయినా ఎడిట్ చేయాల్సింది. ఆ ట్రాక్ పరమ చెత్తగా అనిపిస్తుంది. శ్రీముఖి, చిరంజీవి మధ్య ఉండే సీన్లు అయితే నిజంగానే క్రింజ్‌లానే అనిపిస్తుంది. చిరంజీవికి పెట్టిన ఆ తెలంగాణ యాస మరీ కృతకంగా ఉంది. ఇలా ఇంకెన్ని సార్లు చిరంజీవి తెలంగాణ భాషను కూనీ చేస్తాడో తెలియడం లేదు.

  తమన్నా, సుశాంత్, ఆది, హర్ష, గెటప్ శ్రీను, బిత్తిరి సత్తి, జబర్దస్త్ నరేష్, లోబో, తాగుబోతు రమేష్, జబర్దస్త్ రాజమౌళి, బ్రహ్మానందం, సురేఖా వాణి, రఘుబాబు ఇలా ఎంతో మంది తెరపై కనిపిస్తారు. కానీ ఉపయోగం ఏమీ లేకుండాపోయింది. ఇక ఈ సినిమా కథ, కథనాలు ఎంత రొటీన్ అన్నది మాటల్లో చెప్పడం కష్టం. అసలే వేదాళం సినిమా మన తెలుగులో వచ్చిన ఊసరవెల్లికి దగ్గరగా ఉంటుంది. ఇక ఇది ఎప్పుడో అరిగిపోయిన కథ. ఇలాంటి కథను ఇప్పుడు తీస్తున్నామంటే ఎంతో జాగ్రత్త పడాలి. కానీ మెహర్ మాత్రం కొంచెం కూడా ఫోకస్ పెట్టినట్టు అనిపించదు.

  లొకేషన్ ట్రేస్ చేయడానికి మూడు నిమిషాలు కాల్ మాట్లాడాలట. ఇదెక్కడి పాయింట్ అన్నది అర్థం కాదు. ఇప్పుడున్న టెక్నాలజీని చూస్తే ఫోన్ మాట్లాడకపోయినా, కాల్ రాకపోయినా ట్రేస్ చేస్తున్నారు.. మూడు నిమిషాలు కాల్ మాట్లాడితే గానీ లొకేషన్ లాక్ చేయలేమని అదెలా చూపించాడో మెహర్ రమేష్‌కే తెలియాలి.. అసలు ఇలా చెప్పుకుంటూ పోతే ఈ సినిమాలో లాజిక్ లేని సన్నివేశాలు బోలెడు కనిపిస్తాయి. ఇక మరీ నవ్వొచ్చే అంశం ఏంటంటే.. కీర్తి సురేష్ తలకి గాయం తగిలి గతం మర్చిపోతే.. మళ్లీ చివర్లో తలకి గాయం తగలగానే గతం గుర్తుకు వస్తుంది..ఈ పాయింట్ వింటే.. మనం 70, 80, 90ల్లో వచ్చిన ఎన్నో సినిమాలో చూసినట్టు అనిపిస్తుంది. అదే సీన్ ఇప్పుడు తెరపై చూస్తే నవ్వొస్తుంది. ఇలా మెహర్ ఈ సినిమాను మరో శక్తి, షాడోలుగానే చేశాడు. ఎంతో కష్టపడి, తన శక్తి వంచన లేకుండా కష్టపడి శక్తి, షాడోలను తీయడం మెచ్చుకోదగ్గ అంశమే.

  ఈ సినిమాకు మహతి కొట్టిన పాటలు మరీ నాసిరకం అయితే.. నేపథ్య సంగీతం అయితే తలనొప్పి పుట్టించేలా ఉంది. డడ్లీ కెమెరా వర్క్ బాగుంటుంది. అనిల్ సుంకర చేత మెహర్ అనవసరంగా కోట్లకుకోట్లు ఖర్చు పెట్టించిన తీరు కనిపిస్తుంది.

  రేటింగ్ 2

  బాటమ్ లైన్.. శక్తి, షాడో మరో భోళా.. మెహర్‌ కెరీర్ అధోగతయ్యేలా