- October 9, 2023
ఆ వార్తల తాలూకు ప్రభావం నేటికీ వెంటాడుతూనే ఉండటం బాధాకరం.. చిరంజీవి
భారతీయ తొలి సినిమా పత్రిక విశేషాలు మొదలుకుని ఆ తర్వాత పరిణామ క్రమంలో పనిచేసిన అలనాటి సినీ జర్నలిస్టుల నుంచి నేటి సినీ జర్నలిస్టుల వరకు సమాచారాన్ని శోధించి, సేకరించి సీనియర్ సినీ జర్నలిస్ట్ వినాయకరావు రచించిన “తెలుగు సినీ పాత్రికేయ చరిత్ర” పుస్తకాన్ని మెగాస్టార్ చిరంజీవి ఆవిష్కరించారు.
హైదరాబాద్ లోని తన నివాసంలో జరిగిన కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి ఈ పుస్తకాన్ని విడుదల చేశారు.
ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ, “నా కెరీర్ మొదట్నుంచి సినీ రచయితలు, జర్నలిస్టులతో నాకు విడదీయలేని అనుబంధం ఉంది. జర్నలిస్టుల పెన్నుకు ఉన్న పవర్ అంతాఇంతా కాదు. దాని ద్వారా ఎంత మంచి అయినా చెప్పొచ్చు. అయితే ఒక్కోసారి వాస్తవానికి దూరంగా కొందరు జర్నలిస్టులు రాసిన వార్తలు దుమారం సృష్టిస్తుంటాయి. నా మటుకు నేను కూడా కొన్ని వార్తల కారణంగా కలత చెందిన సందర్భాలు లేకపోలేదు. ఎప్పుడో వచ్చిన ఆ వార్తల తాలూకు ప్రభావం నేటికీ వెంటాడుతూనే ఉండటం బాధాకరం. మరోవైపు నా తప్పులను ఎత్తిచూపి, వాటిని నేను సరిదిద్దుకునేందుకు ప్రేరణ కలిగించిన గుడిపూడి శ్రీహరి వంటి జర్నలిస్టులు ఎంతోమంది లేకపోలేదు. అందుకే పెన్ను పవర్ కలిగిన జర్నలిస్టులు వాస్తవాలను ప్రతిబింబిస్తూ బాధ్యతగా ముందుకు సాగినపుడు ఎందరికో స్ఫూర్తిదాయకమవుతుంది” అంటూ తన జీవితంలో తాను ఎదుర్కొన్న రెండు ఘటనలను ఈ కార్యక్రమంలో ఉదహరించారు.
అలాగే తన మాటలలో రచయితల గురించి కూడా చిరంజీవి ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ…”నేను దర్శక, నిర్మాతలతో కూర్చుని మాట్లాడినప్పటికీ, అంతకన్నా ఎక్కువగా రచయితలతో కూర్చుని సంభాషిస్తుంటాను. గతంలో గొల్లపూడి, జంధ్యాల, సత్యమూర్తి, సత్యానంద్ వంటి వారితో తరచూ సంభాషించేవాడిని. అదే అలవాటు నేటికీ ఉంది. రచయితలకు, జర్నలిస్టులకు నా హృదయంలో ప్రత్యేక స్థానం ఉంది. సందర్భానుసారం వారి గౌరవాన్ని మరింత ఇనుమడింప చేయాలన్న సంకల్పంతో వారి ఇళ్ల వద్దకే వెళ్లిన సందర్భాలు అనేకం ఉన్నాయి” అని అన్నారు.
ఇంకా చిరంజీవి మాట్లాడుతూ, “జర్నలిస్ట్ వినాయకరావు ఏ పుస్తకం రాసినా కూలంకషంగా చర్చిస్తూ, లోతుల్లోకి వెళ్లి రాయడం ఆయనకు అలవాటు..అలాగే అరుదైన ఫోటోలు సేకరిస్తుంటాడు. ముందు తరాలను దృష్టి లో పెట్టుకుని అతను చేసే ప్రయత్నం అభినందనీయం..ఎన్టీఆర్ గారి గురించి, దాసరి గారి గురించి, కృష్ణ గారి గురించి , నా గురించి ఎన్నో అరుదైన పుస్తకాలు రాశాడు. ఇలాంటి వాళ్ళు పుస్తకాలను రాసే ప్రయత్నాన్ని మానుకోకూడడు. నేను కూడా ఈ పుస్తకాన్ని కొంటున్నాను” అని అన్నారు.