• August 3, 2025

సనాతన ధర్మం గురించి పవన్ కళ్యాణ్‌కు తెలిసినంతగా ఇంకెవ్వరికీ తెలియదు – అల్లు అరవింద్

సనాతన ధర్మం గురించి పవన్ కళ్యాణ్‌కు తెలిసినంతగా ఇంకెవ్వరికీ తెలియదు – అల్లు అరవింద్

    మహావతార్ నరసింహా మూవీ తెలుగు రాష్ట్రాల్లో బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. హోంబలే బ్యానర్ మీద అశ్విన్ కుమార్ తీసిన ఈ చిత్రాన్ని తెలుగులో గీతా ఆర్ట్స్ బ్యానర్ మీద అల్లు అరవింద్ రిలీజ్ చేశారు. ఇక ఈ మూవీ విజయవంతంగా దూసుకుపోతోన్న సందర్భంగా ఆదివారం నాడు సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో..

    అల్లు అరవింద్ మాట్లాడుతూ.. ‘ఈ మూవీని మాకు ఇచ్చేలా చేసినా, మమ్మల్ని నడిపించేలా చేసిన నరసింహా స్వామికి ధన్యవాదాలు. విజయ్ గారు నాకు ఫోన్ చేశారు. ఈ మూవీని రిలీజ్ చేయాలని అన్నారు. నాకు ఈ అవకాశం ఇచ్చిన ఆయనకు థాంక్స్. నరసింహా స్వామి వల్లే ఇదంతా జరిగిందని అశ్విన్ కుమార్, ఆయన భార్య అంటూనే ఉంటారు. అశ్వినీ ఎంతో హంబుల్‌గా ఉంటారు. 2021 కోసం ఈ మూవీకి వారు కష్టపడుతూ వచ్చారు. మూడేళ్లు కష్టపడి ఈ చిత్రాన్ని తీశారు. వారు పడిన కష్టానికి తగ్గ ప్రతిఫలాన్ని ఆ నరసింహా స్వామి ఇచ్చారు. రోజురోజుకీ షోల సంఖ్య పెరుగుతూనే ఉంది. స్వాములు కూడా ఈ చిత్రాన్ని చూస్తున్నారు. ఈ మూవీకి ప్రమోషన్స్ అవసరం లేదు. జొన్నవిత్తుల గారు, తణికెళ్ల భరణి గార్లను పిలవాలని ముందే అనుకున్నాం. కుటుంబంతో సహా సినిమాను చూడమని వారికి ఏర్పాట్లు చేశాను. సినిమా చూశారు కాబట్టే అంత ఉద్వేగ్నంగా మాట్లాడారు. మా కుటుంబంలో సనాతన ధర్మం గురించి పవన్ కళ్యాణ్‌కు తెలిసినంతగా మరెవ్వరికీ తెలియదు. ఆయన కూడా ఈ మూవీని చూసి మాట్లాడాలని కోరుకుంటున్నాను. ఈ చిత్రాన్ని మరింత ముందుకు తీసుకు వెళ్లాలని మీడియాని, ఆడియెన్స్‌ను కోరుకుంటున్నాను’ అని అన్నారు.

    అశ్విన్ కుమార్ మాట్లాడుతూ.. ‘ఇది కేవలం సినిమా కాదని ముందే చెప్పాం. ఇదొక దర్శనం.. ఆ నరసింహస్వామి దర్శనం. అందరిలో దాగి ఉన్న భక్తిని మరోసారి తట్టి లేపేందుకు ఈ మూవీని తీశాం. సినిమాని అందరూ పొగడటం లేదు.. వారిలో ఉన్న భక్తిని బయటకు తీసుకు వస్తున్నారు. సనాతన ధర్మం, మన సంస్కృతిలో ఇదొక విప్లవం అవుతుంది’ అని అన్నారు.

    తణికెళ్ల భరణి మాట్లాడుతూ.. ‘ఈ మూవీ గురించి మాట్లాడాలంటే ఎంతో ఉద్వేగ్నంగా ఉంది. గీతా సారాంశం అందరికీ తెలిసిందే. మంచి కర్మకు మంచి ఫలితం దక్కుతుంది. అందుకే గీతా ఆర్ట్స్‌కు ఆ పేరు పెట్టినట్టున్నారు. ఇలాంటి గొప్ప చిత్రాలు అందిస్తున్న అల్లు అరవింద్ గారికి ధన్యవాదాలు. ఈ మూవీ గురించి ఆయన ఫోన్ చేశారు. ఈ సినిమాను చూడమని ఆయన అడిగారు. చిత్రాన్ని చూశాం. కానీ అది థియేటర్ కాదు.. ఓ దేవాలయంలా అనిపించింది. సినిమా కాదు సాక్షాత్కారం జరిగింది. ఆ ప్రపంచంలోకి వెళ్లాం. ఈ మూవీని చూసి ఓ ముప్పై సార్లు కంటతడి పెట్టుకుని ఉంటాను. యావత్ ప్రపంచానికి నరసింహా స్వామిని సాక్షాత్కారం చేయించిన దర్శకుడికి ధన్యవాదాలు. ప్రతీ క్షణం ఎంజాయ్ చేశాను. గ్రాఫిక్స్ మాయాజాలం చేసింది. మూవీని చూస్తుంటే ఒళ్లు గగుర్పొడిచింది. ఈ మూవీని తీసిన వాళ్లు, రాసిన వాళ్లు, చూసిన వాళ్లంతా ధన్యులే. ఈ మూవీని చూడకపోయి ఉంటే చాలా కోల్పోయేవాడ్ని. సనాతన ధర్మాన్ని అద్భుతంగా చూపించారు. ఈ మూవీని చూడటంతో నా జన్మ ధన్యమైందనిపిస్తోంది. ప్రతీ రెండేళ్లకు ఓ సినిమాను తీస్తామని దర్శకులు చెప్పారు. ఆ రెండేళ్లు కూడా ఈ మూవీ రన్ అవుతూనే ఉంటుంది’ అని అన్నారు.

    జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు మాట్లాడుతూ.. ‘సినిమా ప్రేక్షకులు ఈ మూవీని చూడకపోతే ఇక సినిమాలు చూడటం మానేయండి. పిల్లలకు మొట్టమొదటిగా ఇదే చిత్రాన్ని చూపించండి. సినిమాలు చూడటం మానేసిన పెద్ద వాళ్లందరూ కదిలి వచ్చి ఈ మూవీని చూడండి. సెక్స్, వయలెన్స్ మీదే సినిమాలు నడుస్తున్నాయి. సెక్స్ ఎప్పుడు చేస్తే ఎలాంటి రిజల్ట్ వస్తుందో మీకు తెలుసా? అదే పాయింట్‌ను దర్శకుడు తీసుకున్నాడు. నరసింహ స్వామి కథ అక్కడే స్టార్ట్ అవుతుంది. సెక్స్ అనేది సృష్టికి మూలం. అందరూ ఆరాటపడతారు. కానీ అలా ఆరాట పడితే.. తొందరపడితే.. కాని టైంలో సెక్స్ చేస్తే ఎలాంటి వాడు పుడతాడు.. ఎలాంటి విధ్వంసం జరుగుతుంది అని దర్శకుడు చూపించాడు. టెర్మినేటర్‌లో కథ ఏం ఉంది? కానీ ఈ కథలో సొంత కుమారుడ్ని చంపేందుకు ప్రయత్నిస్తుంటాడు.. త్రిలోకాల్ని జయించే రాక్షసుడు.. ఓ పసి పిల్లాడిని చంపలేకపోతాడు.. అలాంటి ఓ గొప్ప సబ్జెక్ట్‌ను ఈ దర్శకుడు గొప్పగా చూపించారు. గ్రాఫిక్స్‌లో భూదేవిని చాలా అద్భుతంగా చూపించారు. ఫైట్స్, విజువల్స్, ఆర్ఆర్ అద్భుతం.. పరమాద్భుతం.. దివ్యాద్భుతం.. వెయ్యి కోట్లు ఇచ్చినా ఓ దర్శకుడు ఇలాంటి సినిమాను తీయలేరు.. కళ కోసం తపించి.. పురాణేతిహాసాల్ని అర్థం చేసుకుని తీసినటువంటి చిత్రమిది. దైవం పట్ల భక్తిని, భయాన్ని కలిగించే చిత్రం. ఉంటే ప్రహ్లాదుడిలా ఉండే.. లేదంటే నరసింహ స్వామిలా ఉండు. నేటి తరానికి తగ్గట్టుగా కథను అద్భుతంగా తెరకెక్కించారు. అందరూ కుటుంబ సమేతంగా వచ్చి ఈ మూవీని చూడండి. నవ నారసింహా క్షేత్రాల్ని చూసిన పుణ్యం ఈ ఒక్క చిత్రం చూస్తే వస్తుంది. ఇలాంటి గొప్ప మూవీని అల్లు అరవింద్ గారు తెలుగులోకి తీసుకు రావడం ఆనందంగా ఉంది. ఎంతో తపస్సు చేస్తే గానీ ఇలాంటి చిత్రాల్ని తీయలేరు. ఈ మూవీ డివైన్ వండర్.. దివ్యాద్భుతం’ అని అన్నారు.