సట్టముమ్ నీతియుమ్ రివ్యూ.. ఆకట్టుకోని కోర్డ్ డ్రామా

సట్టముమ్ నీతియుమ్ రివ్యూ.. ఆకట్టుకోని కోర్డ్ డ్రామా

    సట్టముమ్ నీతియుమ్ అని తమిళ డబ్బింగ్ టైటిల్ చూస్తేనే మన వారిలో కొందరికి నచ్చకపోవచ్చు. చట్టము, నీతి అనే సింపుల్‌గా తెలుగులో టైటిల్ పెట్టుకున్నా ఎవ్వరూ అభ్యంతరం చెప్పి ఉండేవారు కాకపోవచ్చు. ఇక ఈ సిరీస్ ప్రారంభం బాగానే అనిపించినా.. ముగింపు మాత్రం అంత ఆసక్తిని, ఉత్కంఠను కలిగించకపోవచ్చు. అసలు ఈ సిరీస్‌లోని కథ ఏంటో ఓ సారి చూద్దాం.

    కథ
    సుందరమూర్తి అనే ఓ లాయర్ ప్రాక్టీస్ మానేసి కోర్టు బయట నోటరీలు కొడుతూ ఉంటారు. అలాంటి ఆయన వద్ద అర్చన (నమ్రత) అసిస్టెంట్‌గా జాయిన్ అవుతుంది. సుందరమూర్తిని ఇంటా, బయట ఎవ్వరూ గౌరవించరు. ఒక్క కేసు కూడా వాదించడు అంటూ గేలి చేస్తుంటారు. అలాంటి టైంలో సుందరమూర్తి కోర్టు బయట ఆత్మహత్య చేసుకున్న కుప్పు స్వామి కేసుని తీసుకుంటారు. కుప్పు స్వామి కూతురు వెన్నెల చుట్టూ తిరిగే ఈ కేసులో చివరకు సుందరమూర్తి గెలుస్తాడా? లేదా? అసలు ఈ కుప్పు స్వామి ఎవరు? ఒక్క ఆధారం, ఫోటో కూడా లేకుండా ఈ కేసుని ఎలా పరిష్కరిస్తారు? కోర్టులో ఎలా వాదిస్తారు? అన్నదే కథ.

    చట్టము, నీతి, న్యాయం అనేది అందరికీ ఒకేలా ఉండదు. చేసే వృత్తిని పట్టి, ఆర్థిక స్థోమతను బట్టి చట్టాలు, న్యాయాలు మారకూడదు అనేది ఈ సిరీస్ కాన్సెప్ట్. అందుకు తగ్గట్టుగానే పాత్రల్ని ఎంచుకున్నారు. పాత్రల్ని కూడా సరిగ్గానే తీసుకున్నాడు దర్శకుడు. మొదటి మూడు, నాలుగు ఎపిసోడ్స్ కాస్త ఇంట్రెస్టింగ్‌గా ఎంగేజింగ్‌గా సాగుతాయి. ప్రతీ చోటా ఎండ్ పడుతుంది.. ఏ దారిలో వెతికినా కూడా సుందరమూర్తికి ఆధారాలు దొరకవు.. ఎక్కడికక్కడ ఆగిపోతూనే ఉంటారు.

    అసలు ఈ కుప్పుస్వామి ఎవరు? అతనికి నిజంగానే కూతురు ఉందా? ఉంటే ఎలా ఉండేది? ఎక్కడ ఉండేది? నిజంగానే ఆమెను ఎత్తుకెళ్లారా? ఇలాంటి ప్రశ్నలన్నీ మనకు కలుగుతుంటాయి. అప్పటి వరకు మనం చూసిన ఎపిసోడ్స్‌తో చివరకు ఏదో ఉంటుంది.. చాలా పెద్ద సర్ ప్రైజ్ ఉంటుంది.. ట్విస్టులు, టర్న్స్ ఉంటాయని అనుకుని ఉంటాం. కానీ చివరకు తుస్సుమనిపిస్తారు. ఆరో ఎపిసోడ్‌తోనే ఈ సిరీస్ ముగిసినట్టుగా అనిపిస్తుంది. ఇక ఏడో ఎపిసోడ్ చూసినా, చూడకపోయినా ఒకటే అన్నట్టుగా నిరాసక్తి కలుగుతుంది.

    అసలు లీగల్ కోర్ట్ డ్రామా అంటే ఎంత ఆసక్తిగా ఉంటుందో.. ఎంత ఎంగేజింగ్‌గా ఉంటుందో అని అంతా అనుకుని ఉంటారు. కానీ ఈ సిరీస్ అంతగా మెప్పించదు. ఆర్టిస్టుల పర్ఫామెన్స్ కూడా అంతగా ఆకట్టుకోదు. లాజిక్స్ అయితే ఎక్కడా కనిపించవు. ఏదో జరుగుతోంది అంటే.. జరుగుతోందన్నట్టుగా ఉంటుంది. ఈ సిరీస్ మాత్రం ఆడియెన్స్‌ను అంతగా ఆకట్టుకోకపోవచ్చు. చివరకు టైం వేస్ట్ అయిందే అన్న భావన కలిగించేలా సిరీస్ ఉంది.

    చట్టాలు మారినా, న్యాయం మాత్రం ఒక్కటే.. న్యాయాన్ని చేరుకునేలా చట్టాలు ఉండాలి.. ఎవ్వరికైనా చట్టం, న్యాయం ఒకేలా వర్తించాలంటూ చెప్పిన డైలాగ్స్ మాత్రం బాగానే ఉంటాయి. మ్యూజిక్ ఓకే అనిపిస్తుంది. కెమెరా వర్క్ పర్వాలేదనిపిస్తుంది. ఎడిటింగ్ కూడా ఓకే అనిపిస్తుంది. మూడు, నాలుగు ఎపిసోడ్స్ వరకు సిరీస్‌ను ఎంజాయ్ చేయొచ్చు.

    రేటింగ్ 2.5