• August 3, 2023

Mistake Movie Review మిస్టేక్ మూవీ రివ్యూ.. సీక్వెల్‌కి ప్లాన్ అదుర్స్

Mistake Movie Review మిస్టేక్ మూవీ రివ్యూ.. సీక్వెల్‌కి ప్లాన్ అదుర్స్

  Mistake Review ప్రస్తుతం చిన్న సినిమాలకు ఆదరణ లభిస్తోంది. కంటెంట్, కాన్పెప్ట్ ఉంటే చిన్న సినిమానా? పెద్ద సినిమానా? అని ఆడియెన్స్ పట్టించుకోవడం లేదు. ఇప్పుడు చిన్న చిత్రాల హవా నడుస్తోంది. ఇలాంటి టైంలో ‘రామ్ అసుర్‌’ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న అభిన‌వ్ స‌ర్దార్ నిర్మాతగా మారి మిస్టేక్ అనే సినిమాను తీశాడు. ప్రముఖ డ్యాన్స్ మాస్టర్ భరత్ కొమ్మాలపాటి ఈ సినిమాను తెరక్కించాడు. ఈ చిత్రంలో బిగ్ బాస్ అజయ్ మెయిన్ పాత్రలో కనిపించనున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ థియేటర్లోకి వచ్చింది. మిస్టేక్ కథాకమామీషు ఏంటో ఓ సారి చూద్దాం.

  కథ
  మిస్టేక్ సినిమా ముఖ్యంగా మూడు జంటల మధ్య జరుగుతుంది. అగస్త్య (బిగ్ బాస్ అజయ్)-మిత్ర (ప్రియ), కార్తీక్ (తేజ ఐనంపూడి)-స్వీటీ (తానియ కల్ల్రా), దేవ్ (సుజిత్ కుమార్)-పారు (నయన్ సారిక) జంటలకు వచ్చిన సమస్యలు ఏంటి? ఈ మూడు జంటలు ఎందుకు పారిపోవాలని అనుకున్నాయి? పారిపోతోన్న ఈ జంటల మీద అటాక్ చేసిన వ్యక్తి (అభినవ్ సర్దార్) నేపథ్యం ఏంటి? అతను వారిపై ఎందుకు దాడి చేస్తూ ఉంటాడు? ఈ కథలో ప్యాంట్‌కి ఉన్న ప్రాధాన్యత ఏంటి? అన్నది కథ.

  నటీనటులు
  అగస్త్యగా బిగ్ బాస్ అజయ్ నవ్విస్తాడు. యాక్షన్ సీక్వెన్సులో మెప్పిస్తాడు. కార్తీక్‌గా తేజ ఐనంపూడి కనిపించినంత సేపు మెప్పిస్తాడు. దేవ్ కారెక్టర్లో పూజారిలా సుజిత్ కుమార్ చక్కగా నటించాడు.ఈ ముగ్గరి కాంబినేషన్ సీన్లు బాగానే నవ్విస్తాయి. ప్రియ, తానియ, నయన్ ముగ్గురూ చక్కగా నటించారు. గ్లామర్‌తో ఆకట్టుకుంటారు. మూడు జంటలు తెరపై ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తాయి. ఇక విలన్‌గా అభినవ్ సర్దార్ అందరినీ ఆకట్టుకుంటాడు. ఆహార్యం, నటనలోనూ మెప్పిస్తాడు. యాక్షన్ సీక్వెన్స్‌లో సూపర్బ్ అనిపిస్తాడు. రాజా రవీంద్ర, సమీర్‌లతో పాటుగా మిగిలిన పాత్రలు పరిధి మేరకు మెప్పిస్తాయి.

  విశ్లేషణ
  ఓ స్లమ్ ఏరియా, ఓ రిచ్ ఏరియా, ఓ ఫారెస్ట్ సీక్వెన్స్ ఇలా కథను సరిగ్గా రాసుకున్నాడు దర్శకుడు. నవ్వించేందుకు స్లమ్ ఏరియాను వాడుకున్నాడు. అక్కడ బ్యాచ్ లర్ లైఫులు, బతుకులు ఎలా ఉంటాయో చూపించాడు. అడవిలో అందమైన విజువల్స్‌తో పాటుగా అదిరిపోయే యాక్షన్ సీక్వెన్సులను ప్లాన్ చేసుకున్నాడు. ఇలా ప్రేక్షకుడికి ఏం కావాలో అది ఇవ్వడానికి డైరెక్టర్ చేసిన ప్రయత్నం మెప్పిస్తుంది. ఈ ప్రాసెస్‌లో దర్శకుడు సక్సెస్ అయ్యాడని కూడా చెప్పొచ్చు.

  ఫస్ట్ హాఫ్ అంతా కూడా సరద సరదాగా సాగినట్టు అనిపిస్తుంది. లవ్ స్టోరీ, కామెడీలు, పాటలతో జాలీగా వెళ్తుంది. ఇక అటాక్ జరుగుతున్నప్పటి నుంచి కథనంలో వేగం పుంజుకుంటుంది. ఇంటర్వెల్ టైం వరకు అదిరిపోయే ట్విస్ట్ వస్తుంది. ఆ తరువాత ద్వితీయార్థం పరుగులు పెట్టినట్టుగా అనిపిస్తుంది. అడవిలో వింత మనుషులతో చేసే యాక్షన్ సీక్వెన్స్, ఆ ఘటం కూడా బాగుంటుంది. ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ వరకు వచ్చే ట్విస్టులు అందరినీ ఆకట్టుకుంటాయి. చివరకు సీక్వెల్ గురించి హింట్ ఇచ్చి వదిలేస్తారు.

  టెక్నికల్‌గా ఈ సినిమా అందరినీ ఆకట్టుకుంటుంది. పాటలు, మాటలు ఓకే అనిపిస్తాయి. ఆర్ఆర్ బాగుంది. కెమెరావర్క్ అద్భుతంగా అనిపిస్తుంది. ఫారెస్ట్ విజువల్స్ మెప్పిస్తాయి. ఎడిటర్ బాగానే కట్ చేశాడు. నిర్మాణ విలువలు బాగున్నాయి. నిర్మాత అభినవ్ తెరపైనా, తెర వెనుక చాలానే కష్టపడ్డట్టు కనిపిస్తుంది.

  రేటింగ్ : 3