- October 20, 2021
సొంత గూటికి చేరిన ఎయిర్ ఇండియా.. సమస్యలకు ఇక ‘టాటా’

భూమి గుండ్రంగా ఉంటుందనేది అందరికీ తెలిసిందే. ఎక్కడ మొదలైందో అక్కడికే వచ్చి చేరుతుందని అంటారు. అలా జాతీయం పేరుతో టాటా వారి చేతుల్లోంచి విమానయాన సంస్థ భారత ప్రభుత్వం ఆధీనంలోకి వెళ్లింది. ఇప్పుడు తిరిగి మళ్లీ ప్రభుత్వం చేతుల్లోంచి టాటా వారి ఆధీనంలోకి వెళ్లింది. అప్పుల బారాన్ని మోయలేక ఎయిర్ ఇండియాను టాటా వారికి ప్రభుత్వం అమ్మేసిన సంగతి తెలిసిందే. ఇకపై టాటా వారు మళ్లీ ఎయిర్ ఇండియాకు పూర్వ వైభవాన్ని తీసుకొచ్చేందుకు భారీ ప్రణాళికలు రచిస్తున్నారు.
మహారాజా అంటూ ఒకప్పుడు దేశీయ సేవలు అందిస్తూ విమానయాన సంస్థను అగ్రగామిగా ఎదిగేలా చేశారు. ఆ తరువాత జాతీయం వల్ల అది కాస్తా ప్రభుత్వంగుప్పిట్లోకి వెళ్లింది. అయితే ఎయిర్ ఇండియాను మాత్రం ప్రభుత్వం నడపలేకపోయింది. చివరకు అప్పుల ఊబిలో పడేసింది. దాదాపు 60 వేల కోట్ల అప్పులను వదిలించుకునేందుకు భారత ప్రభుత్వం గత కొన్నేళ్లుగా ఎయిర్ ఇండియాను బేరానికి పెట్టేసింది. అది ఇప్పుడు పూర్తయింది. ఇక టాటా వారికి సవాళ్లు ఎదురుకానున్నాయి. వారు ఎయిర్ ఇండియాను మళ్లీ ఎలా గాడిలో పెడతారన్నది చూడాలి.