• June 4, 2026

పెద్ది రివ్యూ.. రామ్ చరణ్ నటనకు అవార్డులు రావాల్సిందే

పెద్ది రివ్యూ.. రామ్ చరణ్ నటనకు అవార్డులు రావాల్సిందే

Peddi Movie Review And Rating రామ్ చరణ్ స్టామినా ఏంటో రంగస్థలం నిరూపించింది. మళ్లీ చిట్టిబాబు లాంటి పాత్ర, అలాంటి యాక్టింగ్‌ని చూడలేం అని అంతా అనుకుని ఉంటారు. బుచ్చిబాబు ఆ చిట్టిబాబుని మరిపించేలా పెద్ది గాడి పాత్రను డిజైన్ చేశానంటూ చెప్పుకొచ్చారు. మరి పెద్ది సినిమాతో రామ్ చరణ్ ఏ రేంజ్‌లో మెప్పించాడు? బుచ్చిబాబు ద్వితీయ విఘ్నం దాటాడా? లేదా? అన్నది చూద్దాం.

కథ
ఈ కథ అంతా కూడా 90వ దశకంలో జరుగుతుంది. విజయనగరం, బొబ్బిలి చుట్టు పక్కల ఉండే ఓ కొండ కింది ప్రాంతానికి చెందిన వాడు పెద్ది (రామ్ చరణ్). కొండ కింది గ్రామస్తులు అంతా కూలీ కోసం విజయనగరం, బొబ్బిలి అంటూ తిరుగుతూ ఉంటారు. కొండ ఎక్కి దిగాలంటే ఓ జాము సమయం పడుతుంది. కొండ మీదుగా వెళ్లే రైలు ఒక్క క్షణం ఆగితే ఊరి భవిష్యత్తు మారుతుందని ముప్పై ఏళ్లుగా అప్పల సూరి (జగపతి బాబు) ప్రభుత్వానికి అర్జీలు పెడుతూనే ఉంటాడు. ఇక ఆటకూలీగా పెద్దికి క్రికెట్‌లో ఫుల్ క్రేజ్ ఉంటుంది. రాంబుజ్జి (దివ్యేందు) అనేవాడు ప్రతీ సారి పెద్దిని వేలం పాటలో కొనేస్తుంటాడు. విజయనగరంలో పంచాయితీ ఎన్నికల సమయంలో అచ్చియమ్మ (జాన్వీ కపూర్)ని రాంబుజ్జి దారుణంగా అవమానిస్తాడు. దీంతో వారిని పెద్ది చితక్కొట్టేస్తాడు. ఆ తరువాత పెద్ది తన క్రికెట్‌ను ఎందుకు వదిలేయాల్సి వస్తుంది?.. అప్పల సూరి మరణంతో పెద్దిలో వచ్చిన మార్పు ఏంటి?.. కుస్తీలోకి రంగ ప్రవేశం తరువాత పెద్ది ఎలా పరిణామం చెందుతాడు? చివరకు తన గ్రామం కోసం పెద్ది ఏం చేశాడు? తనకు, తన ఊరికి లేని గుర్తింపుని పెద్ది సాధించాడా? అన్నదే కథ.

బుచ్చిబాబు రాసుకున్న కథ, తీసిన విధానం అన్నీ కూడా రొటీన్‌గానే ఉంటాయి. పక్కా కమర్షియల్ ఫార్మాట్‌లో కథను అల్లాడు. ఎక్కడ ఏ సీన్ ఎప్పుడు రావాలి అనే లెక్కలు వేసుకున్నాడు. అయితే ఆ లెక్కల్లో కొన్ని తప్పులు కూడా దొర్లినట్టు అనిపిస్తుంది. అలా తప్పులు ఎన్ని ఉన్నా కూడా రామ్ చరణ్ తన పర్ఫామెన్స్, రత్నవేలు తన కెమెరాతో, రెహమాన్ తన బీజీఎంతో కాపాడేస్తుంటాడు. రెండో సినిమాతోనే బుచ్చిబాబు ఎంతో పెద్ద బాధ్యతను భుజానికి ఎత్తుకున్నాడు. ఇంత పెద్ద హీరోని హ్యాండిల్ చేయడం అంటే మామూలు విషయం కాదు. చాలా వరకు లాజిక్స్ మిస్ అయ్యాయి. అవి వదిలేస్తే బుచ్చిబాబు మాత్రం ఈ ద్వితీయ విఘ్నం దాటేసినట్టే.

హీరో ఎంట్రీ సీన్.. క్రికెట్ ఆటలోని జోష్.. పెద్ది గాడు కొట్టే షాట్స్‌తో థియేటర్ అంతా దద్దరిల్లిపోతుంది. ఇక రైరై రారా అనే పాట థియేటర్లో చూస్తే ప్రతీ ఒక్కడూ స్టెప్పులు వేయాల్సిందే. ఆ తరువాత జాన్వీ ఎంట్రీ సీన్, ఆమె అందాల ఆరబోత, ఆమె యాస, డైలాగ్స్ అన్నీ బాగానే  ఉంటాయి. ఎన్నికల హడావిడి, చికిరి సాంగ్, పెద్ది గాడి మోటు పనులు ఇవన్నీ బాగానే ఉంటాయి. కానీ కథను డీవీయేట్ చేసినట్టుగా ఉంటాయి. ఫైట్ అయ్యాక, గ్రౌండ్‌లో పెద్దిని అవమానించిన తరువాత రాంబుజ్జి, అచ్చియమ్మ సినిమాల్లోంచి మాయం అవుతారు. అప్పలసూరి మరణం, రైల్వే పోలీసులతో ఫైట్, కుస్తీలోకి ఎంట్రీ.. అలా ఇంటర్వెల్ బ్లాక్ అదిరిపోతుంది.

మస్సా మస్సా అని సెకండాఫ్‌ను ఎంతో వేగంగా, ఊపుతో ప్రారంభిస్తాడు. క్రాస్ ఓవర్ అథ్లెట్ అని అక్కడ పెట్టిన కుస్తీ ఫైట్ బాగుంటుంది. ఢిల్లీ ఎపిసోడ్ పూర్తిగా ఎమోషనల్ బ్లాక్ అని చెప్పుకోవచ్చు. ఇక హీరో తన ఊరి కోసం, గుర్తింపు కోసం చేసే త్యాగం అయితే నెక్ట్స్ లెవెల్. చివర్లో ఇచ్చే విన్నింగ్ స్పీచ్ గుండెల్ని తాకుతుంది. ప్రతీ ఒక్కరి కంటిని చెమ్మగిల్లేలా చేస్తుంది. క్లైమాక్స్ చాలా భారంగా, హృదయాన్ని హత్తుకునేలా ఉంటుంది.

సాంకేతికంగా చూసుకుంటే మాత్రం రత్నవేలు, రెహమాన్ ఇద్దరూ మ్యాజిక్ చేసేశారు. రెహమాన్ ప్రతీ సీన్‌కి రకరకాల బీజీఎంలు కొట్టేశాడు. క్యాస్టూమ్స్ కూడా నేచురల్‌గా ఉన్నాయి. కొన్ని గ్రాఫిక్స్, వీఎఫ్ఎక్స్ షాట్స్ అంత ఎఫెక్టివ్‌గా అనిపించవు. పాటలు తెరపై అద్భుతంగా అనిపిస్తాయి. మాటలు అయితే చాలా వరకు గుండెల్ని తాకుతాయి. జాతీయ పక్షి, బ్రిటీషోడి ఉచ్చ అంటూ  బుచ్చి రాసిన డైలాగ్స్ మనసుల్ని మెలి పెడతాయి.

రామ్ చరణ్ నటనకు అవార్డులు ఎప్పుడో రావాల్సింది. రంగస్థలంతోనే జాతీయ స్థాయిలో అవార్డు వస్తుందని అంతా అనుకున్నారు. అప్పుడు మిస్ అయింది. మరి ఇప్పుడు అయినా రావాలి. పెద్ది గాడి పర్ఫామెన్స్ చూసిన తరువాత అన్ని అవార్డులు పరిగెత్తుకుంటూ రావాల్సిందే. జాన్వీ కపూర్, దివ్యేందు పాత్రలు ప్రభావం చూపించవు. జగపతి బాబు ఈ సినిమాకి సోల్. శివన్న పాత్ర హుందాగా కనిపిస్తుంది. తారక్ పొన్నప్ప కారెక్టర్‌తో మెప్పిస్తాడు. చమ్మక్ చంద్ర, సత్య, రావు రమేష్ ఇలా మిగిలిన పాత్రలన్నీ కూడా ఓకే ఓకే అనిపిస్తాయి.

ఓవరాల్‌గా లాజిక్స్ పక్కన పెట్టి ఎమోషన్‌కి కనెక్ట్ అయితే మాత్రం పెద్ది పెద్ద విజయం సాధిస్తుంది.

రేటింగ్ 3.5