• May 22, 2026

‘పురుష:’ మూవీ రివ్యూ.. మెప్పించిన మూడు జంటలు

‘పురుష:’ మూవీ రివ్యూ.. మెప్పించిన మూడు జంటలు

కళ్యాణ్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద బత్తుల సరస్వతి సమర్పణలో పవన్ కళ్యాణ్ హీరోగా బత్తుల కోటేశ్వరరావు నిర్మించిన చిత్రం ‘పురుష:’. ఈ సినిమాకి వీరు వులవల దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్, సప్తగిరి, కసిరెడ్డి రాజకుమార్, రాయంచ కొక్కుర, విషిక, హాసిని సుధీర్‌ ముఖ్య పాత్రలను పోషించారు. ఈ మూవీని మే 22న రిలీజ్ చేశారు. మరి ఈ సినిమా సంగతి ఏంటి? కథ ఎలా ఉంది? సినిమా ఆడియెన్స్‌ని మెప్పిస్తుందా? లేదా? అన్నది చూడాలి.

కథ
భార్యాభర్తలు విడిపోకుండా కౌన్సిలింగ్ ఇచ్చే గోవింద్ (పవన్ కళ్యాణ్)‌కే విడాకుల సమస్య ఎదురవుతుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య కమల (రాయంచ) అసలు ఎందుకు విడాకులు అడుగుతుంది? గోవింద్‌కి ఉన్న గతం ఏంటి? గోవింద్‌ బాల్య స్నేహితులైన శ్రీను (కసిరెడ్డి), సత్తి బాబు (సప్తగిరి) కూడా భార్య పోరు తప్పదు. ఆ ఇద్దరికీ విడాకుల సమస్య ఎదురవుతుంది. వారి వారి భార్యలు విడాకులు కావాలంటూ కోర్టులో పిటీషన్ వేస్తారు. దీంతో ఈ గోవింద్, శ్రీను, సత్తిబాబు కోర్టుల చుట్టూ తిరుగుతూనే ఉంటారు. కానీ వారి భార్యలు మాత్రం కోర్టుకి హాజరు కారు. దీంతో జడ్జ్ రాజా రాం (వీటీవీ గణేష్) అసలు వీరి బాధ ఏంటి? అని తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. ఈ క్రమంలో రాజా రాంకి తెలిసిన నిజాలు ఏంటి? వీరి ముగ్గురు సంసార జీవితంలో వచ్చిన సమస్యలు ఏంటి? వీరి మధ్య గొడవలకు కారణమైన క్రియేటివ్ కిస్సు (వెన్నెల కిషోర్) పాత్ర ఏంటి? మరి చివరకు ఈ మూడు జంటలు ఒక్కటయ్యాయా? లేదా? అన్నది తెలియాలంటే పూర్తి సినిమా చూడాల్సిందే.

నటీనటులు
తొలి సినిమానే అయినా, కొత్త హీరోనే అయినా కూడా గోవింద్ పాత్రలో పవన్ కళ్యాణ్ చక్కగా నటించాడు.  చాలా చోట్ల చాలా ఈజ్‌తో నటించాడు. అయితే స్టార్ హీరోగా రాణించాలంటే మాత్రం ఇంకాస్త మెరుగు పడాల్సి ఉంటుంది. ఇక సీనియర్లు అయిన సప్తగిరి, వెన్నెల కిషోర్, వీటీవీ గణేష్, కసిరెడ్డి ఇలా అందరూ తమ తమ పాత్రల్లో అదరగొట్టేస్తారు. రాజీవ్ కనకాల ఉన్నంతలో ఆకట్టుకుంటారు. హౌస్ హజ్బెండ్‌గా పమ్మి సాయి పాత్ర అందరినీ మెప్పిస్తుంది. అలా మిగిలిన వారంతా కూడా తమ పరిధి మేరకు నటించి మెప్పిస్తారు.

విశ్లేషణ
పురుష: కోసం దర్శకుడు వీరు పాత పాయింట్‌ను తీసుకున్నాడు. క్షేమంగా వెళ్లి లాభంగా రండి, తిరుమల తిరుపతి వెంకటేష వంటి ఫ్యామిలీ ఎంటర్టైనర్‌ల నుంచి స్పూర్తి తీసుకుని ఈ కథను అల్లుకున్నట్టుగా కనిపిస్తుంది. కాకపోతే మనకు తెలిసిన కథకే వీరు ఇచ్చిన ట్రీట్మెంట్, మేకింగ్ ఇవన్నీ కూడా ఈ ట్రెండ్‌కి తగ్గట్టుగా ఉంటాయి. సగటు భార్యాభర్తల మధ్య వచ్చే గొడవలు, అపార్థాలు, బాధకసాధకాల్నే తెరపై చూపించారు. కామెడీ, లవ్, ఫ్యామిలీ ఎమోషన్స్, మాస్‌కి నచ్చే పంచ్ డైలాగ్స్, ఐటం సాంగ్ ఇలా అన్నింటినీ జోడించి కంప్లీట్ ప్యాకేజ్ ఇచ్చే ప్రయత్నం చేశాడు. ఆ విషయంలో దాదాపుగా వీరు సక్సెస్ అయ్యాడనే చెప్పుకోవచ్చు.

ఫస్ట్ హాఫ్ అంతా కూడా మూడు జంటల మధ్య ఉన్న దూరం.. జరిగిన గొడవల చుట్టూ సాగుతుంది. కోర్టుకి వెళ్లడం, వాయిదాలు తీసుకోవడం చుట్టూనే తిరుగుతంది. ప్రీ ఇంటర్వెల్ నుంచి వెన్నెల కిషోర్ ఎపిసోడ్ అదిరిపోతుంది. ఇంటర్వెల్ బ్లాక్ మొత్తాన్ని వెన్నెల కిషోర్ అల్లాడించాడని చెప్పుకోవచ్చు. సెకండాఫ్‌లో హీరో తొలి ప్రేమ, రోజీ లవ్ ట్రాక్ ఇదంతా బాగానే నడుస్తుంటుంది. హౌస్ హజ్బెండ్ అంటూ పమ్మి సాయి పాత్రతో చేయించిన ఆ ఎపిసోడ్ బాగుంటుంది. ప్రీ క్లైమాక్స్‌లో వచ్చే ఓ ట్విస్ట్ బాగుంటుంది. అలా చివరకు ఓ ఫీల్ గుడ్ మూవీని చూశామనే ఫీలింగ్‌ను ఇస్తుంది.

టెక్నికల్‌గా సినిమా ఓకే అనిపిస్తుంది. విజువల్స్, పాటలు, ఆర్ఆర్ ఇలా అన్నీ బాగుంటాయి. మాటల విషయానికి వస్తే కసిరెడ్డికి రాసిన పంచ్ డైలాగ్స్ థియేటర్లో పేలుతాయి. ఎడిటింగ్ కూడా షార్ప్‌గా ఉంది. ఆర్ట్ వర్క్ బాగుంది. నేచురల్ లొకేషన్స్ మెప్పిస్తాయి. నిర్మాతకు మొదటి సినిమానే అయినా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా క్వాలిటీ ప్రొడక్ట్‌ను ఆడియెన్స్‌కు అందించడంలో సక్సెస్ అయ్యారని చెప్పుకోవచ్చు. ఓవరాల్‌గా ఓ వినోదాత్మక చిత్రాన్ని కుటుంబం అంతా కలిసి చూసేలా ఈ చిత్రం ఉంటుంది. ఎలాంటి భారీ అంచనాలు పెట్టుకోకుండా థియేటర్‌కి వెళ్తే.. ఓ రెండున్నర గంటలు హాయిగా నవ్వుకునేలా అయితే ఈ మూవీ ఉంటుంది.

రేటింగ్ : 3