- January 30, 2026
దేవగుడి సినిమా రివ్యూ.. కుల వ్యవస్థను ప్రశ్నించే చిత్రం

పుష్యమి ఫిలిం మేకర్స్ బ్యానర్ పై బెల్లం సుధారెడ్డి సమర్పణలో బెల్లం రామకృష్ణా రెడ్డి రచనా దర్శకత్వంలో స్వీయ నిర్మాతగా రూపొందిన చిత్రం “దేవగుడి”. ఈ సినిమాలో ఈ అభినవ శౌర్య, నరసింహ, అనుశ్రీ, రఘు కుంచె ప్రధాన పాత్రల్లో నటించారు. “దేవగుడి” సినిమా 30న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ అయింది. సినిమా ఎలా ఉంది? ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంది? అనేది ఇప్పుడు రివ్యూలో చూద్దాం.
దేవగుడికి చెందిన దేవగుడి వీరారెడ్డి (రఘు కుంచె) ఒక ఫ్యాక్షన్ లీడర్. ప్రజలందరినీ బాగా చూసుకుంటూ ఉంటాడు. కానీ తన కులం కాని వారితో తన కొడుకు స్నేహంగా ఉండటాన్ని కూడా సహించలేడు. అలా తన అనుచరులలో ఒకరి కొడుకు అయిన ధర్మ (అభినవ్ శౌర్య)తో తన కుమారుడితో (నరసింహ) స్నేహంగా ఉండడాన్ని అంతగా ఇష్టపడడు. అలాంటి వీరా రెడ్డికి తన కుమార్తె శ్వేత (అనుశ్రీ) ధర్మతో ప్రేమలో ఉందనే విషయం తెలిసి రగిలిపోతాడు. దీంతో ధర్మను ఊరు నుంచి గెంటిస్తాడు వీరా రెడ్డి. ఆ తరువాత వీరారెడ్డి అనారోగ్యం పాలవుతాడు. ఆ సమయంలోనే ఇద్దరు అనుచరులను ప్రత్యర్థులు మట్టుపెడతారు. మరోపక్క శ్వేత కనిపించకుండాపోతుంది. అసలు శ్వేతకి ఏమైంది? ధర్మ తన స్నేహితుడి చెల్లెలితో నిజంగానే ప్రేమలో పడ్డాడా? అసలు వీరిద్దరి ప్రేమ ఎక్కడ మొదలైంది? వీరిద్దరూ ఒకటయ్యారా లేదా? వీరారెడ్డి చివరికి ఏం చేశాడు? అనే విషయాలు తెలియాలంటే సినిమాని బిగ్ స్క్రీన్ మీద చూడాల్సిందే.
మన సమాజంలో ప్రధాన సమస్యలలో ఒకటైన కుల వ్యవస్థను ప్రశ్నిస్తూ ఈ సినిమా ప్రారంభమవుతుంది. చిన్నప్పుడే అన్నాచెల్లెళ్లు, తండ్రి అనుచరుడిగా పనిచేసే వ్యక్తి కుమారుడితో కలిసి ఆడుతూ, పాడుతూ మంచి బంధాన్ని ఏర్పరచుకుంటారు. వయసుతో పాటు వారి బంధం పెరుగుతూ వస్తుంది. అబ్బాయిలు ఇద్దరూ స్నేహితులుగా సరదాగా తిరుగుతుంటే, అమ్మాయి మాత్రం ఆ కుర్రాడి మీద మనసు పడుతుంది. తక్కువ కులానికి చెందిన అతన్ని ప్రేమించడం నచ్చని హీరోయిన్ తండ్రి, అతన్ని బయటకు గెంటిస్తాడు అలా ఫస్ట్ హాఫ్ అంతా ఓ ఎమోషన్‌తో సాగుతుంది.
ఈ కథ వింటుంటే మీకు కచ్చితంగా కొన్ని పాత సినిమాలు గుర్తొస్తాయి. కాకపోతే రాయలసీమ టచ్‌తో సినిమా ఆసక్తికరంగా సాగుతుంది. మనం ఎంత అభివృది చెందుతున్న కూడా పెళ్లి విషయంలో, చావు విషయంలో మాత్రం కులాల ప్రస్తావన కచ్చితంగా తీసుకొస్తారు. ఇక సినిమాను కూడా ఎక్కడా బోర్ లేకుండా తెరకెక్కించడంలో డైరెక్టర్ రామకృష్ణారెడ్డి సక్సెస్ అయ్యారు.
సాంకేతికంగా చూసుకుంటే మదిన్ అందించిన సంగీతం బాగుంది. కొన్ని పాటలు వినడానికి బాగున్నాయి, అలాగే తెరమీద కూడా అంతే చక్కగా తీసుకురావడంలో టీమ్ సక్సెస్ అయింది. నేపథ్య సంగీతం సినిమాకి తగ్గట్టుగా సరిపోయింది. నిడివి కూడా ఎక్కువ లేకుండా జాగ్రత్తలు తీసుకుంది చిత్ర బృందం. నిర్మాణ విలువలు అయితే అత్యద్భుతంగా ఉన్నాయి అనిపించింది.
నటీనటుల విషయానికి వస్తే, ఈ సినిమాలో హీరోగా నటించిన అభినవ్ శౌర్యతో పాటు హీరోయిన్‌గా నటించిన అనుశ్రీ, అలాగే ఆమె సోదరుడి పాత్రలో నటించిన నరసింహ కూడా ఆకట్టుకున్నారు. వీరందరూ కొత్త ముఖాలైనప్పటికీ చాలా ఈజ్‌తో నటించారు. ఇక రఘు కుంచె దేవగుడి వీరారెడ్డి అనే పాత్రలో జీవించారు. అలానే ఈ సినిమాలో నటించిన మీసాల లక్ష్మణ్, రఘుబాబు, రాకెట్ రాఘవ వంటి వాళ్లు ఉన్నంతలో నవ్వించే ప్రయత్నం చేశారు.
సినిమా ఆద్యంతం ప్రేక్షకులను ఆకట్టుకునేలానే సాగుతుంది. అయితే కథ ప్రేక్షకులు ఈజీగా ప్రిడిక్ట్ చేస్తారు. కాసేపట్లో ఏం జరగబోతోంది అనే విషయాన్ని ప్రేక్షకులు అంచనా వేయగలిగేలా ఉంటుంది. కానీ ఉన్న బడ్జెట్‌లో సినిమాని ఎక్కడా చుట్టేసినట్లు కాకుండా, చాలా రిచ్ విజువల్స్‌తో, మంచి పాటలు, ఫైట్స్ కంపోజ్ చేసి ఒక మంచి కమర్షియల్ సినిమా ఫీల్ తీసుకురావడంలో టీం సక్సెస్ అయిందని చెప్పొచ్చు.
రేటింగ్ 3/5