• September 25, 2025

ఓజీ రివ్యూ.. ఓన్లీ ఎలివేషన్స్.. నో ఎమోషన్స్

ఓజీ రివ్యూ.. ఓన్లీ ఎలివేషన్స్.. నో ఎమోషన్స్

    Pawan Kalyan OG Review పవన్ కళ్యాణ్ హీరోగా సుజిత్ తీసిన చిత్రం ఓజీ. డీవీవీ దానయ్య నిర్మించిన ఈ మూవీకి తమన్ సంగీతం అందించారు. ఈ మూవీ మీదున్న హైప్, బజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. వర్కింగ్ స్టిల్స్‌తోనే చిత్రంపై అంచనాల్ని పెంచేశారు. ఇక తమన్ అయితే తన ఆర్ఆర్‌తో మూవీని ఆకాశమంత ఎత్తులో పెట్టేశాడు. వారి అంచనాల్ని అందుకునేలా ఓజీ చిత్రం ఉందా? లేదా? అన్నది చూద్దాం.

    కథ
    ఓజీ (ఒజాస్ గంభీరా) జపాన్ నుంచి ఇండియాకు వస్తాడు. ఆ ప్రయాణంలో సత్య దాదా (ప్రకాష్ రాజ్)కి రక్షకుడిగా మారిపోతాడు. ముంబై వచ్చిన సత్య దాదా ఓ పోర్టుని నిర్మిస్తాడు. దాదాకి, పోర్టుకి రక్షకుడిగా ఉండే ఓజీ ఓ పదేళ్ల పాటు దూరంగా ఉండాల్సి వస్తుంది. ఈ క్రమంలో సత్య దాదా పోర్టులో ఓమీ (ఇమ్రాన్ హష్మీ)కి చెందిన కంటైనర్ చిక్కు కుంటుంది. ఈ కంటైనర్ కోసం ఇక పోరు జరుగుతుంది. ఈ క్రమంలో సత్య దాదా, పోర్టుకి ప్రమాదం ఏర్పడుతుంది? పదేళ్ల పాటు దూరంగా ఉన్న ఓజీని మళ్లీ ముంబైకి రప్పించాలని దాదా అనుకుంటాడు. అసలు ఓజీ అలా ఎందుకు దూరంగా ఉండాల్సి వస్తుంది? ఓజీ మళ్లీ తిరిగి వస్తాడా? ఓమీకి, ఓజీకి మధ్య పోరు ఎలా ఉంటుంది? ఈ కథలో కన్మణి (ప్రియాంక మోహన్) పాత్ర ఏంటి? చివరకు ఏం జరుగుతుంది? అన్నదే కథ.

    సుజిత్ ఈ కథను ఎలా రాసుకున్నాడు.. ఎక్కడి నుంచి మొదలు పెట్టాడు.. ఎలా అల్లుకున్నాడు? అన్నది మాత్రం అర్థం కాదు. పవన్ కళ్యాణ్ హీరో కాబట్టి.. కత్తులు, నాన్ చాక్‌‌లు, గన్నులు పెట్టి ఐదారు ఫైట్స్, ఓ పది ఎలివేషన్ సీన్లు అని లెక్కేసుకుని ఓ ఫ్యాన్ బాయ్‌లా కథను అల్లుకుంటూ పోయినట్టుగా అనిపిస్తుంది. అసలు ఇందులోని కథ, మెయిన్ ప్లాట్ ఏదీ కూడా కొత్తగా అనిపించదు. జపాన్‌లోని తెగలు, అందులోంచి పారిపోయిన ఓ కుర్రాడు.. అతడికి ఇచ్చిన ఎలివేషన్ చూస్తే.. సలార్‌లోని శౌర్యంగపర్వకు ఇచ్చిన ఎలివేషన్‌లా అనిపిస్తుంది.

    సత్య దాదా, ఓజీ ట్రాక్ చూస్తుంటే.. పవన్ కళ్యాణ్ నటించిన బాలు, పంజా గుర్తుకు వస్తుంటుంది. ఈ గ్యాంగ్ స్టర్ డ్రామాకు కథంటూ కొత్తది ఉండకపోవచ్చు. రెండు గ్యాంగ్‌లు.. హీరో ఓ గ్యాంగ్ పెద్దకు అండగా ఉంటాడు.. మధ్యలో ఏవో గొడవలు.. చివరకు మళ్లీ గ్యాంగ్‌లోకి రావడం.. అవతలి గ్యాంగ్‌ను మట్టు పెట్టడం.. దాదాపు ఇలాంటి కథలే ఉంటాయి.. ఇక ఈ ఓజీ విషయానికి వస్తే కొత్తగా ఏమీ అనిపించదు. ఎక్కడా కూడా ఎమోషనల్‌గా వర్కౌట్ కాదు.. ఏ ఒక్క ట్రాక్‌కి కూడా కనెక్ట్ అవ్వడం కష్టంగానే అనిపిస్తుంది.. హీరో హీరోయిన్ ట్రాక్.. ఫాదర్ డాటర్.. ఫాదర్ సన్ ఇలా ఏ ఒక్క పాత్ర కూడా ఆడియెన్స్ హార్ట్‌కి టచ్ అవ్వదు.

    ఫస్ట్ హాఫ్ మొత్తానికి రెండు సీన్లు ప్రతీ ఒక్కరికీ వావ్ అనిపించేలా ఉంటాయి. ఇంట్రో సీన్, ఇంట్రవెల్ సీన్‌కు మాత్రం గూస్ బంప్స్ గ్యారెంటీ. ఇక సెకండాఫ్‌లో పోలీస్ స్టేషన్ సీన్, చివరి 20 నిమిషాలు అదిరిపోతాయి. మిగతా అంతా కూడా కాస్త హై, కాస్త లో అన్నట్టుగా సాగుతుంది. ఎలివేషన్స్ ఎక్కువ.. ఎమోషన్స్ తక్కువ అన్నట్టుగా సాగింది. నరకడం, చంపడం, కాల్చడం తప్పా ఓ స్టోరీ అయితే కనిపించదు.

    ఇలా ఓజీ స్టోరీలోని తప్పుల్ని వెతుక్కుంటూ పోతే వాటికి అంతే ఉండదు. కాబట్టి లాజిక్స్, స్టోరీని వదిలేసి.. ఎంజాయ్ చేసే ఫ్యాన్స్‌కి మాత్రం ఓజీ ఐ ఫీస్ట్‌లా ఉంటుంది. సుజిత్ ఇచ్చిన హై మూమెంట్స్‌కి ఫ్యాన్స్ గుడి కట్టేస్తారేమో. టెక్నికల్‌గా ఈ మూవీ టాప్ నాచ్‌లో ఉంటుంది. తమన్ బిగ్గెస్ట్ అస్సెట్. తమన్ ఆర్ఆర్ లేకపోతే ఓజీ ఓ నాసిరకమైన సరుకులా మిగిలిపోయేది. సినిమాటోగ్రఫీ అయితే నెక్ట్స్ లెవెల్. దానయ్య పెట్టిన దానికి తెరపై క్వాలిటీ ప్రొడక్ట్ అయితే వచ్చింది. ఈ మాత్రం చాలు.. రికార్డులు క్రియేట్ చేసేందుకు. ఇప్పటికే ప్రీమియర్లు, అడ్వాన్స్ బుకింగ్స్‌తో చాలా చోట్ల సేఫ్ అయినట్టుగా తెలుస్తోంది. దసరా సెలవులున్నాయి కాబట్టి.. ఎలాగూ ఓజీ లాభాల్ని తెచ్చి పెట్టేలానే ఉంది.

    ఆర్టిస్టుల గురించి చెప్పుకోవాల్సి వస్తే.. పవన్ కళ్యాణ్ వన్ మెన్ షో. పవన్ కళ్యాణ్ కనిపించినా, కనిపించకపోయినా.. ఆ సీన్లో ఉన్నా లేకపోయినా.. ఆ ప్రజెన్స్ మాత్రం కనిపిస్తుంది. ఎలివేషన్స్‌తో ఫ్యాన్స్‌కి పిచ్చెక్కిపోద్ది. ఇక పవన్ కళ్యాణ్ తరువాత ఇందులో ఇమ్రాన్ హష్మీ షైన్ అయినట్టుగా అనిపిస్తుంది. శ్రేయా రెడ్డికి మరీ అంత గొప్ప పాత్ర అయితే దక్కలేదు. ప్రకాష్ రాజ్ రొటీన్ అనిపిస్తుంది. ప్రియాంక మోహన్ కారెక్టర్‌ ఏ మాత్రం కొత్తగా ఉండదు.. ఆకట్టుకోదు కూడా. మిగిలిన పాత్రలు అంత ఎఫెక్టివ్‌గా అనిపించవు.

    చివరగా.. ఓజీ.. ఫ్యాన్స్‌ని కమ్మేసే పవర్ ఫైర్ స్ట్రామ్..

    రేటింగ్ : 2.75