- March 29, 2024
టిల్లు స్క్వేర్ రివ్యూ.. మ్యాజిక్ రిపీట్
సిద్దు జొన్నలగడ్డ డిజే టిల్లుతో బాగానే పాపులర్ అయ్యాడు. అంతలా ఆ కారెక్టర్, ఆ సినిమా జనాల్లోకి వెళ్లడంతో ఇప్పుడు ఆ పాత్రతోనే ఓ మూవీని చేశాడు. టిల్లు స్క్వేర్ అంటూ ఈసారి అనుపమతో రొమాన్స్ చేశాడు. మరి ఈ మూవీ నేడు థియేటర్లోకి వచ్చింది. ఈ మూవీతో అనుపమ, సిద్దులు మ్యాజిక్ చేశారా? టిల్లు స్క్వేర్లో టిల్లు గాడి కథ ఏంటి? అన్నది ఓ సారి చూద్దాం.
కథ
టిల్లు గాడి లైఫులో రాధిక చాప్టర్ గురించి అందరికీ తెలిసిందే. ఆ రాధిక నుంచి బయట పడ్డ టిల్లు.. పెళ్లి ఈవెంట్లు చేసుకుంటూ డీజే కొట్టుకుంటూ జీవితాన్ని గడిపేస్తుంటాడు. ఇక అలాంటి టిల్లు గాడి లైఫ్‌లోకి లిల్లీ (అనుపమ) మెరుపు తీగలా వచ్చి మాయం అవుతుంది. నెల రోజులకు మళ్లీ కనిపించి ప్రెగ్నెంట్ అని చెబుతుంది. దీంతో కన్ఫ్యూజన్‌లో ఉన్న టిల్లు భర్తను కాకముందే తండ్రిని అయ్యానంటూ అంగీకరిస్తాడు. అసలు సిద్దు జీవితంలోకి లిల్లీ ఎందుకు వచ్చింది? లిల్లీ అసలు రూపం ఏంటి? లిల్లీ టార్గెట్ ఏంటి? ఈ కథలో మాఫియా డాన్ షేక్ మెహబూబ్ (మురళీ శర్మ) పాత్ర ఏంటి? అన్నది కథ.
నటీనటులు
డీజే టిల్లు పాత్రలో సిద్దు ఎంతో అవలీలగా నటించేశాడు. అందరినీ నవ్వించేశాడు. అసలే టిల్లు గాడి మ్యానరిజం అంటే అందరికీ ఇష్టమే. మళ్లీ అదే స్టైల్లో సిద్దు ఆకట్టుకున్నాడు.అనుపమ చాలా కొత్తగా కనిపిస్తుంది. ఈ సినిమాలో గ్లామర్ డోస్ పెంచేసింది. ఎన్ని లిప్ లాక్‌లు పెట్టిందో లెక్క పెట్టడం కష్టమే. నటన పరంగానూ ఆకట్టుకుంది. కారెక్టర్ చాలా కొత్తగా ఉంది. మురళీధర్ ఎప్పటిలానే తన పంచులతో, ఎక్స్‌ప్రెషన్స్‌తో నవ్వించాడు. మురళీ శర్మ, అనీష్ కురివిల్లా, ప్రిన్స్ ఇలా వచ్చి అలా పోతుంటారు.
విశ్లేషణ
టిల్లు స్క్వేర్ సినిమా ఏదో పెద్ద సస్పెన్స్, థ్రిల్లర్, అడ్వెంచర్ మూవీ అని అంచనాలేమీ పెట్టుకోరు. అలా వెళ్లి థియేటర్లో కూర్చొని హాయిగా నవ్వుకుని వద్దామనే అనుకుంటారు. అలాంటి వారికి టిల్లు స్క్వేర్ పర్ఫెక్ట్ ఛాయిస్. ఎక్కడా కూడా బోర్ కొట్టించకుండా తీసుకెళ్లాడు మల్లిక్ రామ్. సిద్దు, రవి ఆంటోని రాసుకున్న కథ, స్క్రీన్ ప్లే అన్నీ బాగున్నాయి. ఇక మాటలు అయితే అప్పటికప్పుడు రాసుకున్నట్టుగా, లైవ్లీగా వచ్చినట్టు అనిపించింది.
ఫాదర్ అండ్ సన్ మధ్య వచ్చే సీన్లు, వారిద్దరి పంచ్ డైలాగ్స్ అద్భుతంగా అనిపిస్థాయి. ఫస్ట్ హాఫ్ అంతా కూడా నేషనల్ హైవేలో వెళ్లినట్టుగా అలా సరదాగా వెళ్తుంది. ఇక సెకండాఫ్‌కు వచ్చే సరికి ఊర్లోని రోడ్లు, ఘాటు రోడ్ల మాదిరి ట్విస్టులు, టర్న్స్ ఉంటాయి. ఓవరాల్‌గా టిల్లు స్క్వేర్ మాత్రం అందరినీ నవ్విస్తాడు. నేహా శెట్టి గెస్ట్ అప్పియరెన్స్, ఆమె గ్లామర్ బాగుంది.
టెక్నికల్‌గా అంటే డీజే టిల్లు పాటలు, ఆర్ఆర్ గురించి ముందు మాట్లాడుకోవాలి. డీజే టిల్లు టైటిల్ సాంగ్‌ను మరోసారి అద్భుతంగా వాడుకున్నారు. పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగున్నాయి. మాటలు నవ్వు తెప్పిస్తాయి. ఎడిటింగ్, కెమెరా వర్క్, నిర్మాణ విలువలు అన్నీ బాగున్నాయి.
రేటింగ్ 3