- March 29, 2024
కలియుగం పట్టణంలో రివ్యూ.. ఆశ్చర్యపరిచే క్లైమాక్స్
కొత్త కాన్సెప్టులతో సినిమాలు వస్తుంటే జనాలు మాత్రం కచ్చితంగా ఆధరిస్తుంటారు. మదర్ సెంటిమెంట్, సస్పెన్స్, క్రైమ్, థ్రిల్లర్ ఇలా అన్ని అంశాలను మేళవించి కలియుగం పట్టణంలో అనే సినిమాను తీశారు. నాని మూవీ వర్క్స్, రామా క్రియేషన్స్ బ్యానర్ మీద విశ్వ కార్తికేయ, ఆయుషి పటేల్ నటించిన చిత్రం ‘కలియుగం పట్టణంలో’. ఈ మూవీకి కథ, డైలాగ్స్ ,స్క్రీన్ ప్లే, దర్శకత్వం రమాకాంత్ రెడ్డి వహించారు. డాక్టర్ కందుల చంద్ర ఓబుల్ రెడ్డి, జి.మహేశ్వరరెడ్డి, కాటం రమేష్‌లు నిర్మించిన ఈ చిత్రం మార్చి 29 విడుదలైంది. మరి ఈ మూవీ ఎలా ఉందో ఓ సారి చూద్దాం.
కథ
ఈ కథ అంతా కూడా నంద్యాలలో జరుగుతుంది. మోహన్ (దేవీ ప్రసాద్), కల్పన (రూప లక్ష్మి) అనే దంపతులకు కవల పిల్లలు విజయ్ ( విశ్వ కార్తికేయ), సాగర్ ( విశ్వ కార్తికేయ)లు జన్మిస్తారు. అందులో విజయ్‌కి రక్తం చూస్తే భయం. కానీ సాగర్ మాత్రం రక్తం చూస్తే అదోలా మారి సైకోలా ప్రవర్తిస్తుంటాడు. సాగర్ బయట తిరిగితే తన పరువుపోతుందని చిన్నప్పుడే మెంటల్ హాస్పిటల్‌లో వేస్తాడు తండ్రి. ఇక విజయ్ ఇంటి వద్దే పెరుగుతుంటాడు. విజయ్ పెరిగిపెద్దై మంచిగా చదువుకుంటూ కాలేజీలో జాయిన్ అవుతాడు. అక్కడ విజయ్ మంచితనం చూసి శ్రావణి (ఆయుషి పటేల్) ఇష్టపడుతుంది. ఇక శ్రావణిలోని మరో కోణం ఏంటంటే.. అత్యాచారాలు చేసే క్రూర మృగాలను వేటాడి చంపుతూ ఉంటుంది. నంద్యాలలో జరిగే ఘోరాలను అడ్డుకునేందుకు పోలీస్ అధికారి (చిత్రా శుక్లా) వస్తుంది. ఆమె కనిపెట్టిన విషయాలు ఏంటి? అసలు విజయ.. సాగర్ లలో ఎవరు మంచి వారు.. ఎవరు చెడ్డ వారు.. అక్కడ జరిగే ఘోరాలతో వీరికి ఉన్న సంబంధం ఏంటి? చివరకు పోలీస్ ఆఫీసర్ అక్కడి క్రైం కి చెక్ పెట్టిందా లేదా అన్నదే కథ.
నటీనటులు
విజయ్, సాగర్ అంటూ రెండు పాత్రల్లో హీరోగా, విలన్‌గా విశ్వ కార్తికేయ అద్భుతంగా నటించాడు. మంచి వాడిగా, సైకో వాడిలా నటించి ఆకట్టుకున్నాడు. కొన్ని చోట్ల భయపెట్టాడు. యాక్షన్ ఏమోషన్స్ డాన్స్ ఇలా అన్నింటిలోనూ మెప్పించాడు. ఆయుషి పటేల్ ఫస్ట్ హాఫ్‌లో, చిత్రా శుక్లా సెకండ్ హాఫ్‌లో ఆకట్టుకుంటారు. ఇక నరేన్ తన పాత్ర నిడివి తక్కువే అయినా అద్భుతంగా నటించేశాడు. దేవీ ప్రసాద్, రూప లక్ష్మి, అనీష్ కురువిల్లా ఇలా అన్ని పాత్రలు ఓకే అనిపిస్తాయి.
విశ్లేషణ
కలియుగం పట్టణంలో సినిమా కాన్సెప్ట్ చాలా కొత్తగా ఉంటుంది. తెరకెక్కించిన విధానం కూడా అంతే కొత్తగా ఉంటుంది. ప్రతీ ఎమోషన్, సీన్ కట్ చేసిన విధానంతో ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంటుంది. ఇక్కడేదో సంథింగ్ ఫిషీ అనే అనుమానం కలిగేలా సీన్లను కట్ చేశాడు. అలా ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఎన్నో అనుమానాలు, ఎన్నో ప్రశ్నలతో నిండి ఉంటుంది. ఇంటర్వెల్‌తో ఆ ఆసక్తి మరింతగా పెరుగుతుంది.
ఇక ద్వితీయార్దంలోనే అసలు కథను రివీల్ చేస్తుంటాడు. అసలు ఆ పట్టణంలో ఏం జరుగుతోంది? అక్కడ జరిగే ఘోరాలకు కారణం ఏంటి? అమ్మాయిల మీద అత్యాచారాల వెనుకున్న కారణం ఏంటి? అన్నది అక్కడే రివీల్ అవుతుంటుంది. అలా సినిమా ముందుకు సాగుతున్న కొద్దీ ఎంతో ఆసక్తికరంగా మారుతుంది. ట్విస్టులు ఒక్కోటి రీవీల్ అవుతుంటే ప్రేక్షకుల మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. క్లైమాక్స్ ట్విస్టులు, రెండో పార్ట్ కోసం పెట్టుకున్న కథ బాగుంది. పిల్లల్ని తల్లిదండ్రులు ఎలా పెంచాలి.. ఎలా పెంచకూడదు.. తల్లిదండ్రుల పెంపకం సమాజం మీద ఎలాంటి ప్రభావాన్ని చూపుతుందనే విషయాన్ని చక్కగా చూపించాడు దర్శకుడు.
టెక్నికల్ గా కలియుగం పట్టణంలో మెప్పిస్తుంది. అజయ్ పాటలు, అర్ అర్ సినిమాకి ప్లస్. చరణ్ సినిమాటోగ్రఫీ బాగుంది. లైవ్ లొకేషన్స్ వల్ల ఫ్రేమ్స్ అన్నీ కూడా ఎంతో సహజంగా అనిపిస్తాయి. మాటలు కొన్ని చోట్ల మెప్పిస్తాయి. ఆలోచింపజేస్తాయి. నిర్మాతలు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమాను నిర్మించారని అర్థం అవుతోంది. నిర్మాణ పరంగా సినిమా బాగుంటుంది.
రేటింగ్ 3