మ్యాడ్ మూవీ రివ్యూ.. కుర్రాళ్లకు పిచ్చి పట్టినట్టు చూస్తారు

మ్యాడ్ మూవీ రివ్యూ.. కుర్రాళ్లకు పిచ్చి పట్టినట్టు చూస్తారు

    కాలేజ్ స్టూడెంట్ల మీద సినిమా తీస్తే హిట్టయ్యేందుకు ఎక్కువ అవకాశాలుంటాయి. ఇక కాలేజ్ స్టూడెంట్స్‌తో సినిమా అంటే దానికంటూ ఓ కథ, కథనాలు ఉండాల్సిన అవసరం లేదు. ఎలా తీసినా, ఏం చేసినా కూడా నచ్చేస్తుంది. కానీ ఆ కామెడీకి జనాలు కనెక్ట్ కావాల్సి ఉంటుంది. బస్ స్టాప్, ఈరోజుల్లో వంటి సినిమాలు యూత్‌ను టార్గెట్ తీశారు. జాతి రత్నాలు సినిమాలో ఏం కథ ఉందని, ఏం లాజిక్ ఉందని అంత పెద్ద హిట్ అయింది. ఇప్పుడు ఇలాంటి కోవలోకే మ్యాడ్ అనే సినిమా వచ్చింది. మరి ఈ మ్యాడ్ కథ జనాలకు పిచ్చెక్కించిందా? లేదా? అన్నది చూద్దాం.

    కాలేజ్ కుర్రాళ్లు.. అప్పుడే ఇంజనీరింగ్‌లోకి అడుగుపెడతారు. ర్యాగింగ్ అంటూ భయపెట్టేస్తారు. ఇక వారికి సీనియర్ లడ్డు గీతోపదేశం చేస్తాడు. మొదట్లో వచ్చినప్పుడు తాను కూడా ఇలానే భయపడ్డానని తమ అనుభవాలు చెబుతుంటాడు. ఈ క్రమంలోనే లడ్డు తమ మిత్రత్రయం మ్యాడ్ (MAD మనోజ్, అశోక్, దామోదర్)ల గురించి ఇంట్రడక్షన్ ఇస్తాడు. వారు కాలేజ్‌లో చేసిన పనులేంటి? అమ్మాయిలతో ప్రేమ కహానీలు ఏంటి? చివరకు మ్యాడ్ గ్యాంగ్ చేసిన రాచకార్యాలు ఏంటన్నది పూసగుచ్చినట్టు వివరిస్తాడు. అవేంటో తెలియాలంటే థియేటర్‌కు వెళ్లాల్సిందే.

    ఫుల్ ఫన్, కామెడీ ఓరియెంటెడ్ సినిమా తీయాలంటే.. కాలేజ్, స్టూడెంట్స్ చుట్టూ కథ రాసుకుంటే సరిపోద్ది. కాలేజ్, స్టూడెంట్లు అనే వాతావరణంలో పెద్దగా లాజిక్స్ కూడా అవసరం లేదు. అలా కామెడీ సీన్లు అల్లుకుంటూ పోతే.. అవి జనాలకు కనెక్ట్ అయితే బ్లాక్ బస్టర్ అవుతుంది. ఈ మ్యాడ్ సినిమాలో ఓ కథ అంటూ ఉండదు. స్టార్టింగ్ ఇది.. ఎండింగ్ ఇది అన్నట్టుగా కూడా ఉండదు. ఓ కాలేజ్ లైఫ్‌ను అలా రెండు గంటల పాటు ఎంజాయ్ చేసి వచ్చేలా సినిమా ఉంటుంది.

    ఇక సినిమా అయితే రియాల్టీకి దూరంగా ఉంటుంది.. ప్రిన్సిపాల్ అంటే అంత కామెడీగా ఉంటాడా? చదువులంటే లెక్కలేదా? హాస్టల్స్‌లో మరీ అంత దారుణంగా ఉంటుందా? పిల్లలు చదువులు పక్కన పెట్టేసి ఇలా నాశనం అవుతారా? అని అనుకుంటే పొరబాటే. సినిమాలో చూపించినంత దారుణంగా అయితే ఏమీ ఉండదు బయట. సినిమాలో కాబట్టి అలా కాస్త లిబర్టీ తీసుకుని చూపిస్తారు. కానీ ఇంచు మించు అలానే ఉంటుంది వాతావరణం. అది కాలేజ్, కాలేజ్ హాస్టల్ లైఫ్‌ను అనుభవించిన వాడికి ఎక్కువ అర్థం అవుతుంది.

    ఈ మ్యాడ్ సినిమా సైతం కుర్రాళ్లకి బాగా ఎక్కేస్తోంది. స్టూడెంట్స్, యూత్ టార్గెట్‌గా వచ్చిన ఈ చిత్రం వారిని పగలబడినవ్వేలాచేస్తుంది. లడ్డు పాత్ర అయితే నవ్వించడంలో పీహెచ్‌డీ చేసినట్టుగా అనిపిస్తుంది. సంగీత్ శోభన్ కామెడీ టైమింగ్‌కు ఫిదా అవ్వాల్సిందే. నిజంగానే పులిహోర రాజాలా రామ్ నితిన్ ఆకట్టుకున్నాడు. ఇక నార్నే నితిన్ పాత్రలోనే కాస్త హీరోయిజం, ఎలివేషన్లు, ఫైట్లు చూపించారు. ముగ్గురు హీరోయిన్లు కూడా బాగుంటారు. కానీ వారి వారి ట్రాకులు కాస్త రియాల్టీకి దూరంగా ఉన్నా కూడా తెరపై బాగుంటాయి.

    లడ్డు, లడ్డుగాని తండ్రి, తల్లితో ఉండే కామెడీ అయితే సీటులో ప్రేక్షకుడిని కూర్చోనివ్వదు. అలా ఈ సినిమాలో ప్రతీ నిమిషానికి ఏదో ఒక పంచ్ పడుతూనే ఉంటుంది. తెర నిండా కుర్రాళ్లే కనిపిస్తారు. అన్నీ కొత్త మొహాలే కనిపిస్తాయి. మ్యాడ్ గొప్ప సినిమా అని చెప్పలేం. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంతగా నవ్వించే చిత్రం రావడం మాత్రం అరుదే. జాతి రత్నాలు, సామజవరగమన తరువాత మళ్లీ ఆ రేంజ్‌లో నవ్వించింది మ్యాడ్ మాత్రమే. ఈ విషయంలో దర్శకుడికి వందకు వంద మార్కులు వేయొచ్చు.

    సాంకేతికంగానూ మ్యాడ్ బాగుంది. కెమెరామెన్ పడ్డ కష్టం తెరపై కనిపిస్తుంది. ఎడిటింగ్ షార్ప్‌గా ఉంది. ఫ్లో దెబ్బ తినకుండా కట్ చేశాడు. పాటలకు ప్రేక్షకుల్లో ఊపు మాత్రం కచ్చితంగా వస్తుంది. లేచి డ్యాన్స్ చేయాలనేలా ఉంటాయి పాటలు. మాటలు నవ్విస్తాయి. నిర్మాణ విలువలు బాగున్నాయి.

    చివరగా.. మ్యాడ్.. కుర్రాళ్లకు పిచ్చి పట్టినట్టు చూస్తారు

    రేటింగ్ 3