ఏందిరా ఈ పంచాయితీ రివ్యూ.. విలేజ్ లవ్ స్టోరీలో ట్విస్టులు

ఏందిరా ఈ పంచాయితీ రివ్యూ.. విలేజ్ లవ్ స్టోరీలో ట్విస్టులు

  విలేజ్ డ్రామాలు, స్వచ్చమైన గ్రామీణ వాతావరణంలో ప్రేమ కథను చూపించి చాలా రోజులైంది. ఈ క్రమంలోనే భరత్, విషికా లక్ష్మణ్‌ జంటగా ప్రభాత్ క్రియేషన్స్ బ్యానర్ పై ప్రదీప్ కుమార్.ఎం నిర్మించిన చిత్రం ‘ఏందిరా ఈ పంచాయితీ’తో ఆ అనుభూతిని ఇచ్చేందుకు రెడీ అయ్యారు. ఈ మూవీతో గంగాధర.టి దర్శకుడిగా పరిచయం అయ్యాడు.మరి ఈ కొత్త టీం చేసిన ప్రయత్నం ఏ మేరకు మెప్పిస్తుందో చూడాలి.

  కథ
  రామాపురం ఊర్లో అభి (భరత్) అండ్ గ్యాంగ్ అల్లరి చిల్లర వేషాలు వేస్తూ.. చిన్న చిన్న దొంగతనాలు చేసుకుంటూ గడిపేస్తుంటారు. అభికి పోలీస్ అవ్వాలని కోరిక ఉంటుంది. ఇక ఊర్లో అలా చిల్లర దొంగతనాలు చేసుకుంటూ ఉంటాడు. అలాంటి టైంలోనే ఆ ఊరికి కాపలాదారుడి మారుతాడు అభి అతని స్నేహితులు. ఆ టైంలోనే ఊరి పెద్ద (కాశీ విశ్వనాథ్) కూతురు యమున (విషిక)తో ప్రేమలో పడిపోతాడు. ఆ తరువాత ఓ కేసులో అభిని పోలీసులు అరెస్ట్ చేస్తారు? ఆ ఊర్లో జరిగిన హత్యలకు అభికి ఉన్న సంబంధం ఏంటి? యమున తండ్రినే అభి ఎందుకు చంపాలని అనుకున్నాడు? చివరకు అభి ప్రేమ కథ ఎలా ముగిసింది? అనేది థియేటర్లో చూడాలి.

  నటీనటులు
  అభి కారెక్టర్‌లో భరత్ చక్కగా నటించాడు. తొలి సినిమానే అయినా కూడా.. డ్యాన్సులు, ఫైట్లు, ఎమోషనల్ సీన్లు, కామెడీ సీన్లు అంటూ అన్నింట్లోనూ పాస్ అయ్యాడు. ఇక విషికా అయితే యమున పాత్రలో జీవించేసింది. పల్లెటూరు అమ్మాయిలా ఎంతో అందంగా కనిపించింది. కాశీ విశ్వనాథ్ పాత్ర ఎమోషనల్‌గా సాగుతుంది. ఊర్లోని పెద్దగా సుధాకర్‌గా రవి వర్మ ఆకట్టుకుంటాడు. హీరో స్నేహితుల కారెక్టర్లు సినిమా ఆసాంతం నవ్విస్తాయి. మిగిలిన పాత్రలు పరిధి మేరకు మెప్పిస్తాయి.

  విశ్లేషణ
  ప్రేమ కథ అనేది ఎప్పుడూ సక్సెస్ ఫుల్ ఫార్మూలానే. ఆ సూత్రాన్నే కొత్త దర్శకుడు పట్టుకున్నాడు. లవ్ స్టోరీకి ఇతర హంగులు అద్దాడు. చిన్నగా క్రైమ్ డ్రామా, సస్పెన్ మెయింటైన్ చేయించాడు. ఇలా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా కథ, కథనాన్ని అల్లుకున్నాడు డైరెక్టర్. ప్రయోగాల జోలికి పోకుండా.. మన పక్కనే జరుగుతున్నట్టుగా ఎంతో సింపుల్‌గా సినిమాతో మనం ప్రయాణం అయ్యేలా తీయడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు.

  ప్రథమార్దం అంతా సాఫీగా సాగుతుంది. హీరో హీరోయిన్ల మధ్య సీన్లు.. హీరోయిన్ దొంగతనం చేయడం.. దాన్ని రికవరి చేసినట్టుగా హీరో పోజులుకొట్టే సీన్లు బాగుంటాయి. అలా ఫస్ట్ హాఫ్ అంతా సరదా సన్నివేశాలతో హాయిగా ముందుకు వెళ్తుంది. సెకండాఫ్ ప్రారంభం కాస్త నిదానంగా అనిపిస్తుంది. ప్రీ క్లైమాక్స్,క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్టులు, చివర్లో హీరోయిజం, ఆర్ఆర్ బాగుంటాయి. చివరకు హీరో పంచాయితీ క్లియర్ అవుతుంది. ప్రేక్షకులను రెండుగంటల సేపు ఎంగేజ్ చేసే విషయంలో దర్శకుడు సక్సెస్ అయినట్టుగా కనిపిస్తోంది.

  ఏందిరా ఈ పంచాయితీ మూవీలోని పాటలు వినసొంపుగా ఉంటాయి. మాటలు ఆలోచనలు రేకెత్తించేలా ఉంటాయి. మరీ ముఖ్యంగా కెమెరాపనితనం ఆకట్టుకుంటుంది. విజువల్స్ సహజంగా కనిపిస్తాయి. ఎడిటర్ జేపీ పనితనం ఆకట్టుకుంటుంది. సినిమాను బోర్ కొట్టించకుండా కట్ చేశాడు. కొత్త నిర్మాత ప్రదీప్ కుమార్ ఖర్చుకి ఏ మాత్రం తగ్గకుండా కొత్త టీంతో మంచి ప్రయత్నం చేసి సక్సెస్ అయ్యాడు. నిర్మాణ విలువలు అద్భుతంగా అనిపిస్తాయి.

  రేటింగ్ 2.75