• May 19, 2023

హసీనా రివ్యూ.. ట్విస్టులు దేఖోనా

హసీనా రివ్యూ.. ట్విస్టులు దేఖోనా

    హసీనా మూవీతో ప్రియాంక డెయ్, థన్వీర్, సాయి తేజ గంజి, శివ గంగా, ఆకాష్ లాల్ ఇలా అందరూ తెరకు పరిచయం అయ్యారు. హసీనా మూవీని తన్వీర్ ఎండీ నిర్మించగా.. ఎస్ రాజశేఖర్ రెడ్డి సహ నిర్మాతగా వ్యవహరించాడు. ఈ సినిమాకు నవీన్ ఇరగాని దర్శకత్వం వహించాడు. ఇక ఇప్పుడు హసీనా మూవీ థియేటర్లోకి వచ్చింది. మరి ఈ సినిమా కథ, కథనాలు ఏంటి? అన్నది ఓ సారి చూద్దాం.

    కథ
    హసీనా (ప్రియాంక డెయ్) ఓ అనాథ. చిన్నతనం నుంచి ఓ నలుగురు థన్వీర్ (థన్వీర్ ఎండీ), సాయి (సాయి తేజ గంజి), శివ (శివ గంగా), ఆకాష్ (ఆకాష్ లాల్) ఫ్రెండ్స్‌తో కలిసి పెరుగుతుంది. తిరుగుతుంది. బతుకుతుంది. ఇక హసీనాను ఈ నలుగురూ ప్రేమిస్తారు. హసీనా బర్త్ డే సందర్భంగా ఆ విషయాన్ని ఆమెకు చెప్పాలని అనుకుంటారు. కానీ అంతలోనే ఓ ఘటన జరుగుతుంది. దాని తరువాత అందరి జీవితాలు తలకిందులవుతాయి. హసీనా జీవితంలోకి అభి (అభినవ్) ఎలా వచ్చాడు? అభి వల్ల ఆ నలుగురికి ఎలాంటి పరిస్థితులు వచ్చాయి? ఈ కథలో సీఐ, ఏసీపీ పాత్రలు ఏంటి? చివరకు కథ ఎలా ముగుస్తుంది? అనేది ఆసక్తికరంగా ఉంటుంది.

    నటీనటులు
    సినిమా పేరు హసీనా అయినా.. హసీనా పాత్రలో ప్రియాంక డెయ్ బాగానే నటించినా.. నలుగురు స్నేహితులు (థన్వీర్, సాయి, శివ, ఆకాష్‌), అభి పాత్రలు ఇలా బాగానే ఇంపాక్ట్ చూపిస్తాయి. కొత్తగా ఎంట్రీ ఇచ్చిన వారే అయినా కూడా చక్కగా నటించారు. అన్ని రకాల ఎమోషన్స్‌ను చూపించారు. విలన్‌గా కొన్ని చోట్ల, హీరోగా కొన్ని చోట్ల అభి మెప్పిస్తాడు. పోలీస్ పాత్రలు బాగానే సెట్ అయ్యాయి. గీతాసింగ్, రెండు మూడు చోట్ల కనిపించే చిన్న పాప పాత్రలు కూడా ఓకే అనిపిస్తాయి.

    విశ్లేషణ

    డబ్బు ఎలాంటివారినైనా మార్చేస్తుందని, డబ్బు ఏమైనా చేయగలదని, డబ్బే అన్నింటికీ పరిష్కారం అంటూ ఇందులో అంతర్లీనంగా ఎన్నో విషయాలను చర్చించాడు డైరెక్టర్ నవీన్. ఇందులో ప్రేమ, స్నేహం గురించి కూడా చర్చించాడు దర్శకుడు. డబ్బు ఎలాంటి మనిషినైనా మార్చేస్తుందని, చివరకు తమ వాళ్లని కూడా చంపుకునేలా చేస్తుందని చెప్పకనే చెప్పేశాడు దర్శకుడు. హసినా మూవీ ప్రథమార్థం ఏమంతగా ఆకట్టుకోకపోయినా.. ద్వితీయార్థం మాత్రం ట్విస్టులతో మెప్పిస్తుంది.

    సెకండాఫ్‌లోనే అసలు కథ మొదలవుతుంది. వెంట వెంటనే ట్విస్టులు వస్తుంటాయి. కొన్ని ట్విస్టులు నిజంగానే మైండ్ బ్లాంక్ చేస్తుంది. కొన్ని ట్విస్టులను జనాలు ముందే పసిగట్టేస్తుంటారు. అలా సెకండాఫ్‌ అంతా కూడా ట్విస్టులతోనే నిండుతుంది. అయితే ట్విస్టుల మీద పెట్టిన ఫోకస్.. ఎమోషన్స్‌ పండించడంలో పెట్టలేదనిపిస్తుంది. చివరకు ముగింపును గాలికొదిలేసినట్టుగా కనిపిస్తుంది. ఎండింగ్‌ను ఎవ్వరూ అలా ఊహించకపోయి ఉండొచ్చు.

    టెక్నికల్‌గా ఈ సినిమా ఓకే అనిపిస్తుంది. మాటలు, పాటలు పర్వాలేదనిపిస్తాయి. కొన్ని చోట్ల డైలాగ్స్ విజిల్ వేసేలా ఉంటాయి. కెమెరాపనితనం, ఆర్ట్ డిపార్ట్మెంట్, ఎడిటింగ్ విభాగం తమ పరిధిలో వంద శాతం న్యాయం చేసినట్టుగా అనిపిస్తుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.

    రేటింగ్ 2.75