• December 23, 2022

18 Pages Movie Review : 18 Pages రివ్యూ.. 18 పేజీల ప్రేమ కావ్యం

18 Pages Movie Review : 18 Pages రివ్యూ.. 18 పేజీల ప్రేమ కావ్యం

    18 Pages Movie Review:  నిఖిల్ చేసే సినిమాలు, ఎంచుకునే కథలు కొత్తగా అనిపిస్తాయి. ఆయన చేసే ప్రేమ కథలు కూడా కాస్త కొత్తగానే అనిపిస్తాయి. ఎక్కడికి పోతావు చిన్నివాడ అలాంటి కేటగిరీకే వస్తుంది. ఇక సుకుమార్ రాసే ప్రేమ కథలు ఎంతో గొప్పగా అనిపిస్తాయి. అలాంటి నిఖిల్ హీరోగా, సుకుమార్ రాసిన కథను సూర్య ప్రతాప్ తెరకెక్కించిన 18 pages నేడు థియేటర్లోకి వచ్చింది. మరి ఈ సినిమా కథ, కథనాలు ఎలా ఉన్నాయో ఓ సారి చూద్దాం.

    కథ
    సిద్దు (నిఖిల్) యాప్స్ డెవలప్ చేసే సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తుంటాడు. ప్రీతి అనే అమ్మాయితో ప్రేమలో మోసపోతాడు సిద్దు. ఆ బ్రేకప్ నుంచి బయటపడే క్రమంలో అతనికి నందిని (అనుపమ) రాసిన డైరీ కనిపిస్తుంది. ఆ డైరీతో సిద్దు జీవితం మారిపోతుంది. నందినిలా బతికేందుకు సిద్దు ప్రయత్నిస్తాడు. రెండేళ్ల క్రితం నందిని రాసిన డైరిని చదువుతూ సిద్దు ప్రస్తుతం కాలంలో రియాక్ట్ అవుతుంటాడు. నందిని ఆపదలో ఉందని చదువుతూ ఉంటే.. సిద్దు కంగారు పడతాడు. అంత పిచ్చిగా ప్రేమించేస్తాడు సిద్దు. అయితే నందిని హైద్రాబాద్‌కు వచ్చిన పని ఏంటి? కవర్ పట్టుకుని వచ్చిన నందినికి ఎలాంటి ఇబ్బందులు ఏర్పడ్డాయి? సనాతన ట్రస్ట్, రంగనాథ్‌లతో నందికి ఉన్న పని ఏంటి? అసలు నందినిని సిద్దు ఎలా కలుస్తాడు? చివరకు ఈ ఇద్దరి కథ ఎలా ముగుస్తుంది? అనేది తెరపై చూడాల్సిందే.

    సిద్దుగా నిఖిల్ చక్కగా నటించాడు. కమర్షియల్ హీరోలా హంగూఆర్భాటాలేవీ చేయలేదు. తన పాత్రకు తగ్గట్టుగా నటించేశాడు. ఎమోషనల్ సీన్స్‌లో మెప్పించేశాడు. ఇక అనుపమ అయితే ఎంత అందంగా కనిపించిందో.. నందిని పాత్రలో అంత అద్భుతంగా నటించింది. పాత్రలోని అమాయకత్వం, మంచిదనం ఆమెలో కనిపిస్తుంది. సరయు బిగ్ బాస్ తరువాత మంచి పాత్ర దక్కినట్టు అనిపిస్తుంది. సిద్దు ఫ్రెండ్‌గా సరయు చక్కగా నటించింది. అక్కడక్కడా నవ్వించేసింది. అజయ్, శత్రు, పోసాని, రఘుబాబు ఇలా అందరూ తమ పరిధి మేరకు నటించారు.

    18 Pages సినిమా కథ, కథనాలు కాస్త కొత్తగా అనిపిస్తాయి. ముందుకు వెనక్కి వెళ్తూ కథనం అంతా కూడా ఆసక్తికరంగా సాగుతుంది. కాసేపు డైరీలో జరిగే విషయాలను చూపిస్తారు.. ఆ తరువాత ప్రజెంట్‌లోకి వస్తారు. అలా సినిమా కథనం చివరి వరకు ఆసక్తికరంగానే సాగుతుంది. ఇక ప్రేమ కథను చూపించడంలో ఇది ఓ కొత్త ప్రయత్నం అవుతుంది. ఎక్కడా కూడా అసభ్యత, అశ్లీలతకు తావివ్వకుండా, ప్రతీ ఒక్క ఫ్రేమ్‌ను అందంగా తెరకెక్కించారు.

    సీతారామం తరువాత మళ్లీ అంత క్లీన్ అండ్ నీట్ లవ్ స్టోరీని చూసినట్టుగా అనిపిస్తుంది. అయితే ఈ సినిమాలో ప్రేమ కథ కాకుండా కాస్త థ్రిల్లర్‌ను కూడా యాడ్ చేశారు. దాంతో పూర్తి ప్రేమ కథ చూసినట్టుగా అనిపించదు. కానీ క్లైమాక్స్ మాత్రం వేరే లెవెల్లో ఉంటుంది. అసలు ఇలాంటి క్లైమాక్స్‌ను ఎవ్వరూ ఊహించి ఉండరు. ఒక్క ఫైట్ లేకుండా, ఒక్క డైలాగ్ లేకుండా సినిమాను ముగించడం అంటే సాహసమే. ఆ సాహసాన్ని సుకుమార్ అండ్ టీం చేసింది.

    18 Pages సినిమాలో సుకుమార్ కథ, సూర్య ప్రతాప్ డైరెక్షన్, గోపీ సుందర్ ఆర్ఆర్, పాటలు అన్నీ కూడా హైలెట్ అయ్యాయి. ఇక ఇందులో కొన్ని సీన్లు లాజిక్ రహితంగా ఉంటాయి. అవి కాస్త పక్కన పెట్టేస్తే సినిమాను ఆస్వాధించొచ్చు. నిర్మాణ విలువలు గీతా ఆర్ట్స్‌ బ్రాండ్‌కు తగ్గట్టుగా ఉన్నాయి.

    రేటింగ్ 3.5

    చివరగా.. 18 పేజీల ప్రేమ కావ్యం