‘మా’ను చక్కబెట్టేదెవరు.. అది మంచు విష్ణుకు సాధ్యమేనా?

‘మా’ను చక్కబెట్టేదెవరు.. అది మంచు విష్ణుకు సాధ్యమేనా?

    మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అంటే ఒకప్పుడు జనాలకు తెలిసేది కాదు. కానీ గత రెండు ఎలక్షన్ల నుంచి ‘మా’రోడ్డు మీదకు వచ్చింది. మా సభ్యులు ఎన్నికల సమయంలో మీడియా ముందుకు రావడం, ప్రత్యర్థుల మీద ఆరోపణలు చేస్తూ పరువు అంతా తీసుకున్నారు. నరేష్ వర్సెస్ శివాజీ రాజా ఎన్నికల సమయంలో మీడియాలో రెండు ప్యానెల్ సభ్యులు తెగ హడావిడి చేశారు. అయితే ఈ సారి మాత్రం నరేష్ వెనకుండి కథను నడిపాడు. పైకి మాత్రం ప్రకాష్ రాజ్ వర్సెస్ మంచు విష్ణు అని కనిపించినా లోలోపల జరిగింది వేరు.

    ముందుగా మా ఎన్నికల గురించి ప్రకాష్ రాజ్ సమాయత్తమయ్యాడు. పెద్దలను కలిసి తన ఆలోచనను చెప్పే పనిలో చిరంజీవిని కలిశాడు. తన విజన్ వివరించాడు. తన టీం గురించి చెప్పాడు. అలా ప్రకాష్ రాజ్ గ్రౌండ్ లెవెల్ నుంచి ప్రయత్నించాడు. ఇక ప్రకాష్ రాజ్ ఇలా దూకుడుగా ఉన్న సమయంలోనే మంచు ఫ్యామిలీ రంగంలోకి దిగింది. మోహన్ బాబు తన తనయుడు మంచు విష్ణును రంగంలోకి దించాడు. చిరంజీవి ఫోన్ చేసి.. ప్రకాష్ రాజ్ నిల్చుంటున్నాడు.. మంచు విష్ణును ఈ సారి పక్కకి తప్పుకోమని.. వచ్చే ఏడాది ఏకగ్రీవం చేసేద్దామని అన్నాడు.

    కానీ మంచు ఫ్యామిలీ మాత్రం వెనుకడుగు వేయలేదు. ఏదైతే అదే అవుతుంది.. ఎన్నికలకు వెళ్దామని చిరంజీవి సూచనను తోసిపుచ్చారు. అలా ఒకవేళ చిరంజీవి మాట విని ఏకగ్రీవం చేసి ఉంటే.. ఈ రోజు ఈ ఇండస్ట్రీలో ఇలాంటి చీలికలు వచ్చేవి కాదు. అలా మొత్తానికి ఈ సారి మా ఎన్నికలు మాత్రం దారుణంగా జరిగాయి. మాటల వరకు వెళ్లి.. అవి కాస్త బూతులుగా మారాయి. ఇక పోలింగ్ రోజు శారీరక దాడులు కూడా జరిగాయని అంటున్నారు.

    అలా మొత్తానికి మంచు విష్ణు అధ్యక్షుడిగా గెలవడం, ప్రకాష్ రాజ్ ప్యానెల్ మూకుమ్మడిగా రాజీనామా చేయడంతో కథ అడ్డం తిరిగింది. ఇప్పుడు మాలో ఉన్న వివాదాలను ఓ కొలిక్కి తెచ్చేవారే కరువయ్యారు. అసలే ప్రకాష్ రాజ్ ఓటమితో మెగా క్యాంపుకు తీరని అవమానం జరిగింది. అయితే చిరంజీవి ప్రత్యక్షంగా ప్రకాష్ రాజ్ కోసం రంగంలోకి దిగలేదు. ఎక్కడా కూడా మద్దతు ఇస్తున్నట్టు చెప్పలేదు. నాగబాబు మాత్రమే ఆ మాటలు అన్నాడు. నాగబాబు కూడా మా సభ్యత్వానికి రాజీనామా చేసేశాడు.

    అయితే ఇప్పుడు మా అధ్యక్షుడి హోదాలో వివాదాలకు ముగింపు పలుకుతాడా? లేదా ఇండస్ట్రీని రెండుగా చీల్చి విష్ణు పాలిస్తాడా? అన్నది చూడాలి. ఇక మెగాస్టార్ చిరంజీవి మా విషయంలో జోక్యం చేసుకోకపోవచ్చనే సంకేతాలు వినిపిస్తున్నాయి. ఇండస్ట్రీ పెద్ద ఎవరు? అనే ప్రశ్న కూడా తలెత్తింది. నరేష్ పెట్టిన మంటలు ఇంకా ఆరడం లేదు. అసలు ఈ వివాదాలు ఇంతగా చెలరేగడానికి కారణం కూడా నరేష్ అని టాక్ వినిపిస్తోంది. అసలే మంచు ప్యానెల్ వారికి మెగా అవకాశాలు ఇవ్వకూడదని, ప్రకాష్ రాజ్ ప్యానెల్ వారికి తమ సినిమాల్లో అవకాశాలు ఇవ్వకూడదని మంచు ప్యానెల్ టీం అనుకుంటుందంట. మున్ముందు మాలో ఇంకెన్ని ఘోరాలు జరుగుతాయో చూడాలి.

    Leave a Reply