• November 23, 2023

సౌండ్ పార్టీ రివ్యూ.. నవ్వులే నవ్వులు

సౌండ్ పార్టీ రివ్యూ.. నవ్వులే నవ్వులు

    బిగ్ బాస్ విన్నర్ వీజే సన్నీ హీరోగా.. హృతిక శ్రీనివాస్ హీరోయిన్‌గా ఫుల్ మూన్ మీడియా ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకంపై ప్రొడ‌క్ష‌న్ నెం-1గా రూపొందిన చిత్రం `సౌండ్ పార్టీ`. జయ శంకర్ సమర్పణలో సంజ‌య్ శేరి దర్శకత్వం వహించారు. రవి పొలిశెట్టి, మహేంద్ర గజేంద్ర, శ్రీ శ్యామ్ గజేంద్ర నిర్మాత‌లు. ఈ చిత్రం నేడు థియేటర్లోకి వచ్చింది. ఈ చిత్రం ఎలా ఉందంటే..

    కథ
    కష్టపడకుండా కోటీశ్వరులు అవుదామనుకునే తండ్రీ కొడుకుల కథే ఈ సౌండ్ పార్టీ. తండ్రి కుబేర్ కుమార్ (శివన్నారాయణ), కొడుకు డాలర్ కుమార్ (వీజే సన్నీ)లు సౌండ్ పార్టీలు అయ్యేందుకు చేసిన ప్రయత్నాలే ఈ సినిమా కథ. ఈజీగా డబ్బు సంపాదించాలని అన్ని రకాల వ్యాపారాలు చేస్తారు. ఇంటి నిండా అప్పులే మిగులుతాయి. అలాంటి టైంలో కుబేర్ కుమార్, డాలర్ కుమార్‌లకు ఓ ఆఫర్ వస్తుంది. ఎమ్మెల్యే వర ప్రసాద్ (కమెడియన్ పృథ్వీ) కొడుకు చేసిన తప్పుని మీద వేసుకుని జైలుకు వెళ్లేందుకు సిద్దపడారు. బదులుగా వారికి రెండు కోట్లు వస్తాయి. ఆ రెండు కోట్ల కోసం కనీసం ఆ తప్పు ఏంటో కూడా తెలుసుకోకుండా జైలుకి వెళ్తారు? ఆ తరువాత ఏం జరిగింది? చివరకు ఆ రెండు కోట్లు ఏం అవుతాయి? చివరకు నిజంగానే సౌండ్ పార్టీలుగా ఎదుగుతారా? లేదా? అన్నది కథ.

    వీజే సన్నీ, శివన్నారాయణలు ఈ సినిమాను తమ భుజాల మీద మోశారు. సినిమా ఫస్ట్ ఫ్రేమ్ నుంచి లాస్ట్ ఫ్రేమ్ వరకు ఆకట్టుకున్నారు. ఇద్దరూ తమ తమ కామెడీ టైమింగ్‌తో ఆకట్టుకున్నారు. హృతిక అందంగా కనిపించింది. పాత్రకు తగ్గట్టుగా నటించింది. ప్రియ, పృథ్వీరాజ్, కొత్త నటీనటులు అందరూ కూడా చక్కగా నటించారు.

    సౌండ్ పార్టీ సినిమాకు లాజిక్స్ వెతక్కూడదు. తెరపై నవ్వులు పూయించుకుంటూ వెళ్తాడు దర్శకుడు. ప్రతీ చోటా ఏదో ఒక పంచ్ రాసుకుంటూ పోయాడు. కథ, కథనం ఎలా వెళ్తోంది? అనే థాట్ ఆడియెన్స్‌‌కు వచ్చే లోపు ఏదో ఒక ఫన్నీ సీన్ రాసుకున్నాడు దర్శకుడు. కామెడీ సీన్లు బాగా పండాయి. ప్రథమార్దంలో కామెడీ సీన్లు నవ్విస్తాయి. రెస్టారెంట్ బిజినెస్ అంటూ చేసే కామెడీ సీన్లు బాగుంటాయి. ఇంటర్వెల్‌ ఎపిసోడ్ బాగానే ఉంటుంది. కోర్ట్ సీన్ నవ్విస్తుంది.

    రెండో భాగంలో ఎక్కువ జైలు సన్నివేశాలు కనిపిస్తాయి. జైలు అంటే ఇలా కూడా ఉంటుందా? అని ఆలోచన వస్తే అది ప్రేక్షకుడి తప్పు కాదు. ఇక జైలు, జైలర్ నేపథ్యంలో రాసుకున్న సీన్లు నవ్విస్తాయి. జైల్లో తండ్రీ కొడుకులు చేసే విన్యాసాలు నవ్విస్తాయి. ప్రీ క్లైమాక్స్‌లో బిట్ కాయిన్ ట్రాక్ బాగానే వర్కౌట్ అయింది. ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ వరకు బాగానే నవ్వించాడు దర్శకుడు.

    సాంకేతికంగా చూసుకుంటే పాటలు వినసొంపుగా ఉన్నాయి. ఆర్ఆర్ మెప్పిస్తుంది. కెమెరా పనితనం బాగుంది. నిడివి కూడా తక్కువే. మాటలు నవ్విస్తాయి. పంచ్‌‌లు చాలా చోట్ల పేలాయి. నిర్మాతలు పెట్టిన ప్రతీ పైసా తెరపై కనిపిస్తుంది. నిర్మాణ విలువలు గొప్పగా ఉన్నాయి.

    రేటింగ్ 3