• October 29, 2023

విశ్వక్‌సేనుడా.. ఎవరి మీద ఆ కోపం.. నీకు ఇది తగునా?

విశ్వక్‌సేనుడా.. ఎవరి మీద ఆ కోపం.. నీకు ఇది తగునా?

    విశ్వక్ సేన్ తెరపైనా ఊగిపోతోంటాడు.. తెర వెనుకా అంతే ఆగ్రహంతో ఆవేశపడుతుంటాడు. ఇష్టమొచ్చినట్టుగా మాటలు జారేస్తుంటాడు. ఫలక్ నుమా దాస్ టైంలో విశ్వక్ సేన్ చేసిన రచ్చ, విజయ్ దేవరకొండను అన్న మాటలు అందరికీ తెలిసిందే. విశ్వక్ సేన్ ఎప్పుడూ కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రస్‌గానే ఉంటాడు. తన సినిమాలను తాను ప్రమోట్ చేసుకుంటాడు. అక్కడి వరకు బాగానే ఉంది. కానీ తాజాగా విశ్వక్ సేన్ చేసిన విమర్శలు, వెంటనే పోస్టులు డిలీట్ చేయడం వెనుక పెద్ద తతంగమే నడిచినట్టు అనిపిస్తోంది.

    విశ్వక్ సేన్ తాను నటించిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా డిసెంబర్ 8న వస్తుందని అందరికీ చెప్పేశాడు. నిర్మాతలు కూడా అధికారికంగా ప్రకటించారు. కానీ ఇప్పుడు నితిన్, నాని, వరుణ్ తేజ్ వంటి వారు పోటికి దిగారు. వారు కాస్త పెద్ద హీరోలే. విశ్వక్ సేన్‌‌తో పోల్చుకుంటే వారంతా టాప్ హీరోలే. ఇప్పుడు వారి సినిమాల కోసం విశ్వక్ సేన్‌ని పక్కకు తప్పించాలని అనుకుంటున్నారట. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా సితార వాళ్లది. సితారతో నాని, నితిన్, వరుణ్‌లకు మంచి సంబంధాలున్నాయి.

    వారంతా అడిగితే సితార నాగవంశీ కాదనలేడు. వాళ్లా? విశ్వక్ సేనా? అని తేల్చుకోవాల్సి వస్తే.. నాగవంశీ కచ్చితంగా ఆ హీరోల వైపే మొగ్గు చూపుతాడు. అయితే ఇప్పుడు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా గనుక డిసెంబర్‌లో రాకపోతే ఇకపై ప్రమోషన్స్‌లో కనిపించను అని వార్నింగ్ ఇచ్చాడు విశ్వక్ సేన్. ఆ వార్నింగ్ మరెవ్వరికో కాదు. నిర్మాత నాగవంశీకే ఆ వార్నింగ్ ఇచ్చినట్టు కనిపిస్తోంది. బ్యాక్ గ్రౌండ్ లేకపోతే ప్రతీ నా కొడుకు అంటూ విశ్వక్ సేన్ చాలా పరుషంగా పోస్ట్ వేశాడు.

    తగ్గినా కొద్దీ మింగుతారని అర్థమైందంటూ విశ్వక్ సేన్ అన్న మాటలు వింటుంటే.. సినిమా వాయిదా వేయాలనే ఒత్తిడి చాలా పెద్ద స్థాయిలో ఉందని అర్థమైపోతోంది. ఒక వేళ విశ్వక్ సేన్‌కి నాగవంశీ సపోర్ట్ ఉంటే.. ఆ ట్వీట్, పోస్ట్ డిలీట్ చేసేవాడు కాదు. కానీ విశ్వక్ మాత్రం వాటిని డిలీట్ చేశాడు. అంత ఊగిపోయి పోస్ట్ వేయడం ఎందుకు? ఇప్పుడు ఇలా డిలీట్ చేయడం ఎందుకు? ఆ మాటలన్నీ అనేశాక.. ఏదైతే అది అవుద్దని మొండిగా నిలబడాల్సింది. కానీ విశ్వక్ అలా చేయలేకపోయాడు. చూస్తుంటే నాగవంశీ ఈ విషయంలోకి ఎంట్రీ ఇచ్చి విశ్వక్‌ని కూల్ చేసినట్టుగా అనిపిస్తోంది.

    విశ్వక్ అంత ఫైర్ అయ్యాడు.. ఆ కోపం ఏ హీరో మీద, ఏ ప్రొడక్షన్ హౌస్ మీద.. ఎవరు ఒత్తిడి పెంచుతున్నారన్నది కూడా చెబితే బాగుండు. లేదంటే సొంత సంస్థ నుంచి విశ్వక్ సేన్‌కు మొండిచేయి వచ్చిందా? అన్నది తెలియడం లేదు. అయినా సినిమాను ఎప్పుడు రిలీజ్ చేయాలన్నది నిర్మాత, నిర్మాణ సంస్థ చేతుల్లో ఉంటుందా? హీరో చేతుల్లో ఉంటుందా? చెప్పడం కాస్త కష్టమేనేమో.