Virata Parvam Review: విరాటపర్వం రివ్యూ.. సున్నితమైన కథాంశం

Virata Parvam Review: విరాటపర్వం రివ్యూ.. సున్నితమైన కథాంశం

    Virata Parvam Review విరాటపర్వం సినిమా మీద అందరి దృష్టి పడటానికి ఎన్నో కారణాలున్నాయి. సాయి పల్లవి నటించడం.. రానా సైతం సాయి పల్లవే హీరో అని చెప్పడం.. నీదీ నాదీ ఒకే కథ వంటి వినూత్న సినిమాను తెరకెక్కించిన వేణు ఊడుగుల దర్శకుడు కావడం. పోస్టర్ల దగ్గరి నుంచి ట్రైలర్ల వరకు అందరిలోనూ ఎంతో ఆసక్తిని రేకెత్తించింది విరాటపర్వం. మొత్తానికి ఈచిత్రం ఈ శుక్రవారం థియేటర్లోకి వచ్చింది. మరి ఈ చిత్రం ఏ మేరకు ప్రేక్షకులను మెప్పించిందో ఓ సారి చూద్దాం.

    కథ:
    తుపాకుల కాల్పుల మోతల్లో వెన్నల (సాయి పల్లవి) జన్మిస్తుంది. ఆ తుపాకుల మోతకే బలవుతుంది. ఇదే స్థూలంగా విరాటపర్వం కథ. ఈ చిత్రం యథార్థ ఘటనల ఆధారంగా తెరకెక్కించిన విషయాన్ని దర్శకుడు చెప్పేశాడు. తమూ సరళ పాత్రను వెన్నెలగా మలిచేశారు. నక్సలైట్ల చేతిలో హతమైన సరళ కథను విరాటపర్వంగా తెరకెక్కించారు. అరణ్య అలియాస్ రవన్న (రానా) రచనలకు లోనై ప్రేమలో పడటం, అతని కోసం అడవుల బాట పట్టడం అనే వంటి అంశాలతో అందమైన ప్రేమ కథను చూపించాడు. చివరకు వెన్నెల కథ ఎలా ముగిసింది.. అలా ఎందుకు జరిగింది.. దానికి కారణం ఎవరు? అన్నదే విరాటపర్వం కథ.

    వెన్నెల పాత్రలో సాయి పల్లవి తప్పా ఇంకొకరిని ఊహించుకోలేరు. అచ్చమైన తెలంగాణ అమ్మాయిగా అద్భుతంగా నటించింది. ఆ యాస, కట్టూబొట్టూ ఇలా అన్నీ కూడా తెలంగాణ సమాజానికి అద్దం పట్టేలా ఉన్నాయి. వెన్నెల పాత్ర ద్వారా సాయి పల్లవి మనల్ని ఏడిపిస్తుంది.. కంటతడి పెట్టిస్తుంటుంది. క్లైమాక్స్‌లో సాయి పల్లవి నటనకు అవార్డు దక్కాల్సిందే అనిపిస్తుంది. కంటి చూపుతోనే సాయి పల్లవి తన బాధను వ్యక్తపరుస్తుంది. ఇక వెన్నెల పాత్ర తరువాత రవన్న రానా అద్భుతంగా మెప్పించాడు. ఓ నక్సలైట్, దళ నాయకుడు ఎలా ఉంటాడో రానా యాప్ట్‌గా నటించేశాడు. ఆయన కనిపించే తీరు, మాట తీరు అంతా కూడా ఎంతో గొప్పగా అనిపిస్తుంది. ఇక మిగిలిన పాత్రలో ప్రియమణి, నవీన్ చంద్ర, నందితా దాస్, బెనర్జీ, సాయి చంద్, ఈశ్వరీ రావు, రాహుల్ రామకృష్ణ ఇలా ఎంతో మంది తమ పరిధి మేరకు నటించేశారు.

    విప్లవం, ప్రేమ అనే వాటిని ముడి వేసి చెప్పాలన్న కొత్త పాయింట్‌తో దర్శకుడు వేణు ఊడుగుల చేసిన ప్రయత్నం అందరిలోనూ ఆసక్తి రేకెత్తించింది. ఇంత వరకు నక్సల్ నేపథ్యంలో ఎన్నో చిత్రాలు వచ్చాయి. తెలంగాణ సమాజంలో నక్సల్ ప్రభావిత ప్రాంతాలు ఎన్నో ఉన్నాయో అందరికీ తెలిసిందే. నక్సలైట్లు, పోలీసుల పోరాటంలో ఎంతో మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. అయితే ఈ నేపథ్యంలో తీసుకున్న కథకు అందమైన ప్రేమ ప్రయాణాన్నిజోడించాడు. ఆ ప్రేమతో ప్రేక్షకుడు కూడా ప్రయాణిస్తాడు. అయితే సినిమాను కమర్షియల్ లెక్కల పేరిట తప్పుదారి పట్టించలేదు.

    తాను అనుకున్నది, నమ్మింది మాత్రమే తెరకెక్కించాడు. కమర్షియల్ ఫార్మాట్ కోసం కథను బ్రష్టు పట్టించలేదు. హీరోయిజాన్ని ప్రదర్శించాలని, కమర్షియల్ వ్యాల్యూలను అద్దాలని దర్శకుడు ఎక్కడా ప్రయత్నించలేదు. అయితే ఇక్కడే సమస్య వస్తుంది. ఈ సినిమా జనాలందరికీ ఎక్కకపోవచ్చు. ఇలాంటి భావకవిత్వంతో, లోతైన ఘాడతతో స్వచ్చమైన ప్రేమను చూపించి, దానికి విప్లవాన్ని జోడించి చూపిస్తే ఈ తరం వారికి ఎంత వరకు ఎక్కుతుందో అని దర్శకుడు ఆలోచించినట్టు అనిపించలేదు.

    కానీ తాను నిజాయితీగా రాసుకున్న కథను అంతే నిజాయితీగా పక్కదారి పట్టకుండా తెరకెక్కించాడు. ఇక వేణు ఊడుగుల రాసుకున్న కొన్ని డైలాగ్స్ అయితే హంట్ చేస్తూనే ఉంటాయి. ఎంతో లోతైన భావం ఉన్నట్టు కనిపిస్తుంది. స్వచ్చమైన ప్రేమ గురించి సాయి చంద్ పాత్ర చెప్పిన డైలాగ్స్, ప్రేమ అనేది ఓ రుగ్మత అంటూ రానా, సాయి పల్లవి మధ్య వచ్చే సీన్లు ఆయన పెన్నుకు ఉన్న పవర్‌ను చూపిస్తాయి. అలా మొత్తానికి సరళ కథను మాత్రం ఎంతో కన్విన్స్‌గా ముగించాడు దర్శకుడు. ఎవరిది తప్పు అనేది మాత్రం బల్లగుద్దినట్టుగా చెప్పలేకపోయాడు. ఇరు పక్షాల తప్పు వల్లే అలా జరిగిందని చూపించేశాడు.

    కెమెరాపనితనంతో అప్పటి తెలంగాణ సమాజాన్ని మరోసారి కళ్లకు కట్టినట్టు చూపించారు. సురేష్ బొబ్బిలి సంగీతంలో తెలంగాణదనం కనిపించింది. నేపథ్య సంగీతం మరోస్థాయిలో ఉంది. రోమాలు నిక్కబొడుచుకునేలా చేశారు. నిర్మాణ విలువలు అద్భుతంగా అనిపిస్తాయి.

    విరాటపర్వం.. హానెస్ట్ అటెంప్ట్