Vikrant Rona Review విక్రాంత్ రోణ కాదు.. వికృతమైన రోణ

Vikrant Rona Review విక్రాంత్ రోణ కాదు.. వికృతమైన రోణ

    Vikrant Rona Review విక్రాంత్ రోణ సినిమా ఈ గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కిచ్చా సుదీప్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడే. కాకపోతే మన వాళ్లకు ఇంకా విలన్ అని మాత్రమే తెలుసు. ఈగ సినిమాతో కిచ్చా సుదీప్ టాలీవుడ్ ఆడియెన్స్ మీద మంచి ముద్ర వేశాడు. అయితే కన్నడ టాప్ స్టార్ అయిన సుదీప్.. విక్రాంత్ రోణ అంటూ నేడు (జూలై 28) ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా ఎలా ఉందో ఓ సారి చూద్దాం.

    ఓ ఊరు.. అందులో కొన్నేళ్లుగా మూతబడి ఉన్న కామారట్టు అనే ఇళ్లు. దాని కేంద్రంగా హత్యలు జరుగుతుంటాయి. అక్కడే ఓ కుటుంబం అంతా హత్యకు గురై ఉంటుంది. అయితే ఎస్సై సురేష్ కూడా హత్య చేయబడతాడు. దీన్ని ఛేదించేందుకు విక్రాంత్ రోణ (సుదీప్) వస్తాడు. ఇక ఈ కథలో జనార్థన్ గంభీర్, ఏకనాథ్ గంభీర్, సంజు, అపర్ణ, మాధవల పాత్ర ఏంటి? ఆ ఊర్లో జరిగే హత్యలు, స్కూల్ పిల్లలు చనిపోతుండటానికి కారణాలు ఏంటి? విక్రాంత్ రోణకు ఆ హత్యలకు ఏమైనా సంబంధం ఉందా? చివరకు ఏం జరిగింది? అనేది కథ.

    విక్రాంత్ రోణ సినిమాలో ఎంతో మంది నటులున్నారు. కానీ ఎవ్వరికీ సరైన కారెక్టరైజేషన్ ఉన్నట్టు కనిపించదు. ఒక్క విక్రాంత్ రోణ పాత్రలో సుదీప్ మాత్రమే మెరుస్తాడు. అంతా తానై నడిపిస్తాడు. ఇక సంజుగా నిరుప్ భండారి పాత్రే ఎక్కువగా హైలెట్ అయినట్టు అనిపిస్తుంది. నీతా అశోక్‌కి కాస్త ఎక్కువ నిడివి ఉన్న కారెక్టర్ దక్కినట్టు కనిపిస్తుంది. అయితే మొత్తానికి సుదీప్ మాత్రమే ఆల్ రౌండర్ అన్నట్టుగా ఉంటుంది. యాక్షన్ సీక్వెన్స్‌లో సుదీప్ అదరగొట్టేశాడు. మిగతా అందరూ పర్వాలేదనిపిస్తుంది.

    ఇక దర్శకుడు ఈ విక్రాంత్ రోణాను ఏ యాంగిల్ తెరకెక్కించాలని అనుకున్నాడు.. ఏ కోణంలో తెరకెక్కించాడు అనే విషయం అర్థం కాదు. అడ్వెంచర్, యాక్షన్, సస్పెన్స్, థ్రిల్లర్, క్రైమ్ ఇలా అన్ని జానర్లను కలిపి చూపించాలని అనుకున్నట్టున్నాడు. కానీ ఏ ట్రాక్ కూడా సరిగ్గా పండలేదనిపిస్తుంది.

    అడవిలో స్మగ్లింగ్ జరుగుతుందా? అనేది కూడా క్లియర్‌గా చూపించరు. ఆ ట్రాక్, దాని కోసం అల్లుకున్న సీన్లు, బయట పడ్డ నిందితులు కూడా ల్యాగ్‌లానే అనిపిస్తుంది. అయిది మెయిన్ ట్రాక్ కాదని తరువాత అర్థమవుతుంది. చిన్న పిల్లల హత్యలు అనేది అసలు ట్రాక్ అని తరువాత తెలుస్తుంది.

    ఇక చిన్న పిల్లల హత్యలను కూడా ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా తెరకెక్కించలేకపోయారు. విక్రాంత్ రోణ కారెక్టర్‌లో ఎక్కడా కూడా ఎమోషన్ కనిపించదు. దానికి ప్రేక్షకుడు కూడా కనెక్ట్ కాడు. యాక్షన్ సీక్వెన్స్ మీద పెట్టిన దృష్టి.. కథ, కథనాలు, ఎమోషన్ల మీద పెడితే బాగుండేదనిపిస్తుంది. చివరకు ఈ విక్రాంత్ రోణ సాదాసీదా రివెంజ్ డ్రామాగా ముగిసింది. ముగింపులో ఇచ్చిన ట్విస్టులు మరీ అంత ఎగ్జైటింగ్‌గా కూడా అనిపించవు.

    సాంకేతికపరంగా అయితే.. కెమెరామెన్, వీఎఫ్ఎక్స్ డిపార్ట్మెంట్లు అదరగొట్టేశాయి. రారా రక్కమ్మ అనే పాట ఒక్కటే బాగుంటుంది. మిగతావన్నీ కూడా వృథా. నిర్మాణ విలువలు అత్యున్నతంగా ఉన్నాయి.

    బాటమ్ లైన్.. విక్రాంత్ రోణ కాదు వికృత రోణ

    రేటింగ్ 2