- August 25, 2022
liger Movie Review : లైగర్ రివ్యూ.. విజయ్ కష్టం వృథా
liger Review పూరి జగన్నాథ్ సినిమాలు భారీ అంచనాలు విడుదలవ్వడం.. అవి కాస్తా తేడా కొట్టేయడం జరుగుతోంది. ఇస్మార్ఠ్ శంకర్ అయితే పూరికి కొత్త ఊపిరినిచ్చింది. అదే ఇప్పుడు లైగర్‌కు దారి తీసింది. విజయ్ దేవరకొండతో లైగర్ అంటూ పూరి జగన్నాథ్ ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మరి ఈ చిత్రం ఎలా ఉందో ఓ సారి చూద్దాం.
కథ
కరీంనగర్‌కు చెందిన బాలమణి (రమ్యకృష్ణ) తన కొడుక్కి లైగర్ (విజయ్ దేవరకొండ) అని పేరు పెడుతుంది. అతడ్ని మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్‌లో ఛాంపియన్ చేయాలనుకుంటుంది. మార్షల్ ఆర్ట్స్‌లో చాంపియన్ అయిన మైక్ టైసన్‌ను లైగర్ పిచ్చిగా ఆరాధిస్తుంటాడు. ఈ క్రమంలో ముంబైలోని మార్షల్ ఆర్ట్స్ కోచ్ (రోనిత్ రాయ్) వద్ద లైగర్‌ను చేర్పిస్తుంది.మొదటి చూపులోనే లైగర్‌తో తానియా (అనన్య పాండే) ప్రేమలో పడుతుంది. కానీ కొన్ని కారణాల వల్ల లైగర్ ప్రేమను రిజెక్ట్ చేస్తుంది. లైగర్‌తో బ్రేకప్ తర్వాత తానియా ఓ మాఫియా అధినేత చేతిలో కిడ్నాప్‌కు గురి అవుతుంది? అసలు ఆమెను కిడ్నాప్ చేసింది ఎవరు? లైగర్ అనే పేరు ఎందుకు పెట్టింది? చివరకు లైగర్ నేపథ్యం ఏంటి? లైగర్ మైక్ టైసన్ మధ్య ఏం జరిగింది? అనేది కథ.
నటీనటులు
విజయ్ దేవరకొండలోని నటుడి గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఓ అర్జున్ రెడ్డి ఓ గీతగోవిందం. రెండూ వేటికవే. రెండింట్లోనూ మెప్పించాడు. ఇక లైగర్‌లో అయితే కొత్తగా కనిపించాడు. అయితే ఆ పాత్రకు పెట్టిన నత్తి వల్ల సినిమాకు ఉపయోగం జరగకపోగా.. ఫ్లోకి అడ్డం పడ్డట్టు అవుతుంది. పాత్రకోసం తనని తాను మార్చుకున్న తీరు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. అనన్య పాండే హీరోయిన్‌గా అంత మెప్పించలేదనిపిస్తుంది. రమ్యకృష్ణ కొన్ని చోట్ల ఓవర్ యాక్షన్ అనిపిస్తుంది. కానీ ఆమె పాత్రను బాగానే డిజైన్ చేశారు. మిగిలిన వారంతా కూడా అలా వచ్చి పోతుంటారు.
విశ్లేషణ…
లైగర్ సినిమాను చూస్తుంటే.. పూరి చేసిన గత సినిమాలన్నీ గుర్తుకు వస్తే.. అది తప్పేమీ కాదు. ఎందుకంటే పూరి తాను తీసిన సినిమాల్నే మిక్సీలో వేసి తిప్పేసినట్టుగా ఈ చిత్రాన్ని తీసినట్టు అనిపిస్తుంది. ఎక్కడా కూడా కొత్తదనం లేకుండా.. చమక్కులు లేకుండా.. సర్ ప్రైజింగ్ ఎలిమెంట్స్ లేకుండా లాగించేశాడు. కథ ఏంటి.. కథనం ఏంటి అన్నది అందరికీ ఇట్టే అర్థమవుతుంది. ఆసక్తికరంగా లేని కథకు.. మరీ పేలవమైన స్క్రీన్ ప్లే తోడైంది. దీంతో ప్రేక్షకుడికి సహన పరీక్షలా అనిపిస్తుంది.
ప్రథమార్థంలో విజయ్ మ్యానరిజం, యాటిట్యూడ్, యాక్షన్ ఇలా బాగానే అనిపిస్తుంది. అనన్య పాండే లవ్ ట్రాక్ అంతగా ప్రభావం చూపదు. పాటలు కూడా అంతగా ఎక్కవు. వెరసీ ప్రథమార్థం సోసోగా అనిపిస్తుంది. ఇక సెకండాఫ్ అయినా ఏదైనా కొత్తగా ఉంటుందని ఆశిస్తే నిరాశే కలుగుతుంది. క్లైమాక్స్‌లో అందరూ ఊసూరుమంటారు. ఇదేంటి ఇలా ముగించేశాడని అనుకోవాల్సిందే.
పాన్ ఇండియా అంటూ లేని పోని హంగులు అద్దాల్సిన అవసరం లేదని ఈ సినిమాతో మరోసారి నిరూపించారు. మన కథను మనం నిజాయితీగా తీస్తే ఎక్కడి ప్రేక్షకులైనా అంగీకరిస్తారు.. ఆదరిస్తారు. బాలీవుడ్‌ను మెప్పించేందుకు చేసిన పాటలు.. ఏ ఒక్కటి కూడా మన వాళ్లకు ఎక్కేలా లేవు. సినిమాటోగ్రఫీ పర్వాలేదనిపిస్తుంది. పూరి ఎన్నో సీన్లలో విసిగెత్తించేశాడు. వాటిని ఎడిటింగ్లో లేపేయాల్సింది. లాస్ ఏంజిల్స్ ఎపిసోడ్స్ ఏమంతా రక్తికట్టించలేదు. ఈ సినిమా కోసం పెట్టిన ఖర్చు తెరపై కనిపిస్తోంది. కానీ వసూళ్ల రూపంలో వస్తాయా? లేదా? అన్నది చూడాలి.
ప్లస్ పాయింట్స్…
విజయ్ దేవరకొండ
మైనస్ పాయింట్…
కథ, కథనం
పూరి డైరెక్షన్
రేటింగ్: 2
బాటమ్ లైన్ : లైగర్.. బాక్సాఫీస్ వద్ద జీరో ఫిగర్!