• January 12, 2023

Veera Simha Reddy Review : వీర సింహా రెడ్డి రివ్యూ.. గోపీచంద్ కలిపి కొట్టేశాడు!

Veera Simha Reddy Review : వీర సింహా రెడ్డి రివ్యూ.. గోపీచంద్ కలిపి కొట్టేశాడు!

  Veera Simha Reddy Review బాలయ్య హీరోగా సినిమా వస్తుందంటే మాస్ జనాలకు కాస్త అంచనాలు ఎక్కువే ఉంటాయి. ఇక ఇప్పుడు గోపీచంద్ మలినేని క్రాక్ సినిమాతో ఫాంలో ఉండటంతో.. వీర సింహా రెడ్డి మీద మంచి హైప్ వచ్చింది. అయితే ట్రైలర్ చూశాక ఈ చిత్రం కొత్తగా ఏమీ ఉండదని, పాత కథే మళ్లీ చూపించబోతోన్నారని అర్థమైంది. అయితే ఇప్పుడు ఈ సినిమా జనాల ముందుకు వచ్చింది. వీర సింహా రెడ్డి కథాకమామీషు ఏంటో చూద్దాం

  వీర సింహా రెడ్డి సినిమా కథ ఏమీ కొత్తగా ఉండదు. ఇది వరకు మనం ఫ్యాక్షన్ కథలను ఎన్నో చూశాం. ఊరి పెద్ద ఉంటాడు.. సీమలో కత్తులు పట్టొద్దు, నెత్తురు పారొద్దు అని ఉపన్యాసాలు చెబుతుంటాడు. కానీ అతను మాత్రం ఊచ కోత కోసేస్తుంటాడు. అలానే ఇందులోనూ భావితరాల కోసం కత్తి పట్టాను అంటూ.. నాది సీమ ఫ్యాక్షన్ కాదు.. ఎమోషన్ అని అంటాడు. అయితే అలాంటి వీర సింహా రెడ్డి తాను పెళ్లి చేసుకోవాలని అనుకున్న మరదలు మీనాక్షి (హనీ రోజ్‌)కు దూరంగా ఉంటాడు. అసలు తనకు తన ఎత్తు కొడుకు జై సింహా రెడ్డి ఉన్నాడన్న సంగతే తెలియకుండా బతికేస్తాడు. అలాంటి పరిస్థితి వీర సింహా రెడ్డికి ఎందుకు వచ్చింది? అసలు ఈ భానుమతి (వరలక్ష్మీ శరత్ కుమార్) ఎవరు? వారిద్దరి మధ్య ఉన్న సంబంధం ఏంటి? తండ్రిని చంపుకునేలా చేసిన ప్రతాప్ రెడ్డి (దునియా విజయ్) తన పగను తీర్చుకున్నాడా? అన్నదే కథ.

  బాలయ్య సినిమా అంటే.. బాలయ్య మాత్రమే కనిపిస్తాడు. వినిపిస్తాడు. ఆడుతాడు. పాడుతాడు. నరుకుతాడు. వీర సింహా రెడ్డి సినిమాలోనూ బాలయ్య అన్ని ఎమోషన్స్‌తో ఆకట్టుకుంటాడు. శ్రుతి హాసన్‌ను ఈ సినిమాలో చూస్తే జాలి కలుగుతుంది. ఆమెను ఎందుకు తీసుకున్నారా? అనిపిస్తుంది. ఇక హనీ రోజ్ ఓల్డ్ లుక్ బాగా లేకపోయినా.. సెకండాఫ్‌లో మాత్రం దుమ్ములేపుతుంది. దునియా విజయ్ ఒకే ఎమోషనల్‌లో కనిపించాడు. లుక్ కాస్త భయంకరంగా అనిపించినా నవ్వు కూడా తెప్పిస్తుంది. వరలక్ష్మీకి ఇలాంటి పాత్రలు చాలా వచ్చాయి. అద్భుతంగా చేసి అదరగొట్టేసింది. ఈశ్వరీ రావు, రాజీవ్ కనకాల, సచిన్ ఖేదేకర్ వంటి పాత్రలు తమ పరిధి మేరకు మెప్పిస్తాయి.

  వీర సింహా రెడ్డి సినిమాను పార్టులు పార్టులుగా చూసినప్పుడు బాగానే ఉంటుంది. సినిమాగా చూసినప్పుడే మనకు దర్శకుడి మీద కాస్త జాలి కలుగుతుంది. ఈ సినిమా ఏంటి? మన టాలీవుడ్ ఉన్న స్థాయి ఏంటి?ఎలాంటి సినిమాలు తీయాలి.. ఎలాంటి సినిమాలు తీస్తున్నాం అనే సోయి లేకుండా తీసినట్టుగా అనిపిస్తుంది. ఇప్పుడు మాస్ అనే దానికి కూడా అర్థం మారింది. మాస్ సినిమాలు అంటే కేజీయఫ్, విక్రమ్ వంటి సినిమాలే మాస్ సినిమాలు అని జనాలు నెత్తిన పెట్టేసుకుంటున్నారు.

  ఇలాంటి సమయంలోనూ రొటీన్ రొడ్డ కొట్టుడు సినిమాలు తీసి జనాల మీదకు వదిలేస్తున్నారు. వీర సింహారెడ్డి సినిమా చూస్తే మనకు బాలయ్య నటించిన గత చిత్రాలన్నీ గుర్తుకు వస్తాయి. బాలయ్య తన ఎనర్జీతో, డైలాగ్స్‌తో, ఫైట్స్‌తో మ్యానేజ్ చేశాడు గానీ.. దర్శకుడు మాత్రం దారుణంగా దెబ్బేసినట్టు అనిపిస్తుంది. బాలయ్య అభిమానులకు కూడా ఈ చిత్రం అంతగా నచ్చదేమో. బాలయ్య అభిమానులు ఎంజాయ్ చేసేలా కొన్ని సీన్లు బాగానే రాసుకున్నాడు. డైలాగ్స్, ఫైట్స్ వారిని కచ్చితంగా మెప్పిస్తాయి. అయితే సినిమా పరంగా మాత్రం నిరాశ చెందే అవకాశాలు కనిపిస్తున్నాయి.

  ఈ సినిమాలో లాజిక్స్ వెతికితే మన మీదకే కాస్త జాలి కలుగుతుంది. ఎందుకు నరుక్కుంటున్నారో తెలీదు.. పోలీసులు, ప్రభుత్వాలు ఇలా నిమ్మకు నీరెత్తినట్టు ఉంటాయా? అనిపిస్తుంది. ఓ హోం మినిస్టర్ సైతం ఇలా భయపడతాడా? ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నెన్నో సిల్లీ సీన్స్ కనిపిస్తుంటాయి. అయితే బాలయ్య కాబట్టి తెరపై మనం అలా ఎంజాయ్ చేస్తూ పోతాం. బాలయ్య చెప్పే డైలాగ్స్‌కు మనలోనూ ఎనర్జీ వచ్చేస్తుంది. ఇందులోనూ తన రాజకీయం, తండ్రి గురించి కొన్ని డైలాగ్స్ రాయించుకున్నట్టుగా కనిపిస్తుంది. ప్రభుత్వం మీద వేసిన కౌంటర్లకు ఎలాంటి ప్రతిచర్యలు వస్తాయో చూడాలి.

  తమన్ మరోసారి బాలయ్య మీద ప్రేమను ఆర్ఆర్ ద్వారా చూపించాడు. సాంకేతికంగా ఈ సినిమా ఎంతో ఉన్నతంగా ఉంది. మైత్రీ సంస్థ ఎక్కడా కూడా వెనకడుగు వేయలేదనిపిస్తుంది.

  రేటింగ్ : 2.5

  చివరగా.. కొందరు తెలుగు దర్శకులు ఆలోచనల్లో మార్పు రాదు.. వారి ఆలోచనలు మార్చలేం