- October 18, 2024
వీక్షణం రివ్యూ.. ఆకట్టుకునే థ్రిల్లర్
రామ్ కార్తీక్, కశ్వి జంటగా పద్మనాభ సినీ ఆర్ట్స్ బ్యానర్‌పై పి. పద్మనాభ రెడ్డి, అశోక్ రెడ్డి “వీక్షణం” మూవీని నిర్మించారు. కామెడీ మిస్టరీ థ్రిల్లర్ కథతో దర్శకుడు మనోజ్ పల్లేటి అక్టోబర్ 18న ఆడియెన్స్ ముందుకు వచ్చాడు. మరి ఈ చిత్రం ఎలా ఉంది? ఆడియెన్స్‌ను ఏ మేరకు ఆకట్టుకుంది? అన్నది చూద్దాం.
కథ
హైదరాబాదులో ఒక గేటెడ్ కమ్యూనిటీలో నివాసం ఉండే అర్విన్ (రామ్ కార్తిక్)కు బైనాకులర్స్‌తో అన్ని అపార్ట్మెంట్ల విషయాలను చూస్తూ ఉంటాడు. అలా చూస్తున్న సమయంలోనే అతనికి నేహ(కశ్వి ) మీద ప్రేమ పుడుతుంది. ఆమెను ప్రేమలో పడేసేందుకు తన స్నేహితుడి సహాయంతో అనేక ప్రయత్నాలు చేస్తాడు. చివరకు ఆమె ప్రేమలో పడుతుంది. ఆమెతో ఓ సారి గొడవ అవుతుంది. ఆ టైంలో ఒక ఇంటిని బైనాక్యులర్‌తో చూస్తాడు. ఒక అమ్మాయి రోజుకు ఒక వ్యక్తిని ఇంటికి తీసుకురావడం గమనిస్తాడు. ముందు పెద్దగా సీరియస్‌గా తీసుకోడు కానీ ఆ అమ్మాయి ఏదో పెద్ద క్రైమ్ చేస్తుందని భావించి ఆమె మీద ఫోకస్ చేస్తాడు. ఆ తర్వాత ఆమె హత్యలు చేస్తుందని తెలిసి ఆమెను ట్రేస్ చేసే ప్రయత్నం చేయగా ఆమె చనిపోయి ఎనిమిది నెలలు అయిందని తెలుస్తుంది. అయితే చనిపోయి ఎనిమిది నెలలు అయిన అమ్మాయి ఎలా హత్యలు చేస్తుంది? ఆర్విన్ తన స్నేహితుడు ఛీ ఛీ, బావమరిది(షైనింగ్ ఫణి)తో కలిసి చూసింది నిజమేనా? అసలు ఆ హత్యలు చేసేది ఎవరు? ఎందుకు హత్యలు చేస్తున్నారు? అనే ప్రశ్నలకు సమాధానమే ఈ మూవీ.
నటీనటులు
హీరో పాత్రలో రామ్ కార్తీక్ చక్కగా నటించాడు. పక్కింటి అబ్బాయిలానే కనిపించాడు. ఇక హీరోయిన్గా నటించిన కశ్వి గ్లామర్ పరంగా, యాక్టింగ్ పరంగా ఆకట్టుకుంది. బాలనటిగా తన అనుభవాన్ని ఈ సినిమాలో చూపించింది. అయితే ఈ సినిమాలో మరో కీలక పాత్రలో నటించిన బిందు నూతక్కికి మంచి పాత్ర దొరికినట్లు అయింది. షైనింగ్ ఫణి కనిపించిన ప్రతిసారి నవ్వించే ప్రయత్నం చేశాడు.. మిగతా పాత్రధారులు తమ పరిధి మేరకు మెప్పిస్తారు.
విశ్లేషణ
మన పని మనం చూసుకోవడం అనే పాయింట్ చుట్టూ కథను తిప్పాడు. పక్కవాడి లైఫ్ లో ఏం జరుగుతుంది అని తెలుసుకునే ప్రయత్నం చేసే హీరో ఆ ప్రయత్నంలో భాగంగానే అనేక ఇబ్బందులు ఎదుర్కొంటాడు. ఆ ఇబ్బందులు ఏమిటి? ఇబ్బందులు ఎదుర్కొన్న తర్వాత వాటిని ఎలా అధిగమించాడు? అనే విషయాన్ని దర్శకుడు చాలా చక్కగా ప్రేక్షకులకు తర్వాత ఏం జరుగుతుందో అర్థం కాకుండా సస్పెన్స్ మెయింటైన్ చేస్తూ తెరకెక్కించాడు.
అసలే ఇప్పుడు రొటీన్ చిత్రాలు ఎక్కువ అయ్యాయి. నెక్ట్స్ సీన్ ఏం వస్తుంది? ఏం జరుగుతుంది? అనేది ఆడియెన్స్ ఇట్టే పసిగట్టేస్తున్నారు. కానీ ఈ సినిమా విషయంలో అలా జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నాడు డైరెక్టర్. ఫస్ట్ హాఫ్‌లో హీరో హీరోయిన్ ప్రేమ, గొడవలు అంటూ సరదాగా తీసుకు పోయాడు. హీరో మరో అమ్మాయిని చూడటం, ఆ అమ్మాయి చనిపోయిందని తెలుసుకోవడం.. వంటి విషయాలతో ఇంటర్వెల్ బ్లాక్ అదిరిపోతుంది.
ఇక ఇంటర్వెల్ తర్వాత చనిపోయిన అమ్మాయి ఎలా హత్యలు చేస్తుంది? అని హీరో అతని స్నేహితుల బృందం కనుగొనే ప్రయత్నం చేయడం ఆసక్తికరంగా అనిపిస్తుంది. మరీ ముఖ్యంగా క్లైమాక్స్ అయితే రొటీన్‌కి భిన్నంగా సెకండ్ పార్ట్‌కి లీడ్ ఇచ్చేలా ఉండడం గమనార్హం. నిజానికి దర్శకుడికి ఇది మొదటి సినిమా అంటే నమ్మడం కష్టమే. అంతలా ప్రేక్షకులను ఎంగేజ్ చేయడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యాడు. చాలా చోట్ల ప్రేక్షకులు ఊహకు అందకుండా కథ నడిపించడంలో దర్శకుడికి ఫుల్స్ మార్క్స్ పడతాయి.
టెక్నికల్ టీం విషయానికి వస్తే సంగీత దర్శకుడు సమర్ద్ గొల్లపూడి తన సమర్థతను చాటుకున్నాడు. నిజానికి థ్రిల్లర్ సినిమాలకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ప్రాణం. ఇక ఆయన అందించిన సాంగ్స్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉన్నాయి. సినిమాటోగ్రఫీ కూడా సినిమా మూడ్ మొత్తాన్ని క్యారీ చేయడంలో బాగా ఉపయోగపడింది. సినిమాలోని ఫైట్స్ కూడా భిన్నంగా అనిపించాయి. ఫైట్ డిజైన్ బావుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.
రేటింగ్ : 3.25