• April 20, 2024

‘శబరి’ తర్వాత మనం మరో సినిమా చేద్దామని వరలక్ష్మీ శరత్ కుమార్ గారు చెప్పారు  – నిర్మాత మహేంద్రనాథ్ కూండ్ల ఇంటర్వ్యూ

‘శబరి’ తర్వాత మనం మరో సినిమా చేద్దామని వరలక్ష్మీ శరత్ కుమార్ గారు చెప్పారు  – నిర్మాత మహేంద్రనాథ్ కూండ్ల ఇంటర్వ్యూ

    వెర్సటైల్ ఆర్టిస్ట్ వరలక్ష్మీ శరత్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా ‘శబరి’. మహర్షి కూండ్ల సమర్పణలో మహా మూవీస్ పతాకంపై మహేంద్రనాథ్ కూండ్ల నిర్మించారు. అనిల్ కాట్జ్ దర్శకుడు. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, హిందీ, కన్నడ భాషల్లో మే 3న సినిమా విడుదల అవుతోంది. ఈ సందర్భంగా నిర్మాత మహేంద్రనాథ్ కూండ్ల మీడియాతో ముచ్చటించారు. ఆ ఇంటర్వ్యూ విశేషాలు…

    సార్… ముందు మీ నేపథ్యం గురించి చెప్పండి! సినిమాల్లోకి రావడానికి కారణం?
    మాది గుంటూరు. ఉద్యోగం కోసం అమెరికా వెళ్లాను. కొన్నేళ్లు అక్కడ పని చేశా. నాకు కన్సల్టెన్సీలు, వ్యాపారాలు ఉన్నాయి. వృత్తిరీత్యా, ఉద్యోగరీత్యా నేను ఎక్కడ ఉన్నప్పటికీ… చిన్నతనం నుంచి సినిమా అంటే ఆసక్తి. అందుకని, ఇండస్ట్రీలోకి వచ్చాను.

    ‘శబరి’ సినిమా ఎలా మొదలైంది?
    ఈ సినిమా చేయడానికి ప్రధాన కారణం వరలక్ష్మీ శరత్ కుమార్ గారు. నేను తొలి సినిమా ఏది చేయాలని ఆలోచిస్తున్న సమయంలో మా దర్శకుడు నాకు ఈ కథ చెప్పారు. బాగా నచ్చింది. వెంటనే ఓకే చేశా. అప్పటికే ఈ కథ వరలక్ష్మీ శరత్ కుమార్ గారు విన్నారు. మొదటి సినిమాకు ఏ నిర్మాత అయినా సేఫ్ సైడ్ చూసుకుంటారు కదా! వరలక్ష్మి గారు ముందు నుంచి మంచి క్యారెక్టర్లు సెలెక్ట్ చేసుకుంటున్నారు. ఆవిడ ఓకే చేశారంటే 50 పర్సెంట్ నేను సేఫ్ అని ‘శబరి’కి ఓకే చెప్పా.

    వరలక్ష్మీ శరత్ కుమార్ గారితో ఈ సినిమా జర్నీ గురించి చెప్పండి!
    వండర్ ఫుల్. ఆవిడ మంచి ఆర్టిస్ట్. నిర్మాతలకు ఆవిడ చేసే మేలు చాలా మందికి తెలియదు. దీనికి ఖర్చు చేయమని ఆవిడ ఎప్పుడూ అడగలేదు. బడ్జెట్ పెంచే వ్యవహారాలు ఎప్పుడూ చేయలేదు. ఎందుకు ఇంత ఖర్చు చేస్తున్నారని, వద్దని చెప్పేవారు. ఆవిడతో ఎంత మంచి రిలేషన్షిప్ ఉందంటే… ‘మీకు మరో సినిమా చేస్తాను. మనం చేద్దాం’ అని నాతో చెప్పారు.

    ఈ కథను మీరు ఓకే చేయడానికి కారణం?
    సినిమాలో మదర్ అండ్ డాటర్ ఎమోషన్, సెంటిమెంట్. అది ప్రతి ఇంట్లో, ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అయ్యే పాయింట్. ఎంత బాగా చెప్పగలిగితే అంత బాగా జనాల్లోకి వెళుతుంది. ఒక బిడ్డ కోసం తల్లి పడే తపనను తీసుకుని సైకలాజికల్ థ్రిల్లర్ గా ప్లాన్ చేశాం. ఎమోషన్స్ డిఫరెంట్ వేలో చెప్పాం. కొన్ని సినిమాల్లో మదర్ అండ్ డాటర్ ఎమోషన్స్ చూసి ఉంటారు. ఇందులో మేం డిఫరెంట్ గా చెప్పాం.

    మొదటి సినిమా ఐదు భాషల్లో చేయడం రిస్క్ అనిపించలేదా?
    కొంచెం రిస్క్ అనిపించింది. అయితే, మొదటి నుంచి నా నేచర్ కొంచెం రిస్క్ తీసుకునే నేచర్. అమెరికా వెళ్లి ఉద్యోగంలో చేరిన వారానికి వ్యాపారం స్టార్ట్ చేశా. నో రిస్క్ నో గెయిన్ అంటారు కదా! రిస్క్ తీసుకుంటే జీవితంలో పైకి వస్తామని నమ్ముతా. సినిమాల్లోకి వచ్చినప్పుడు ఐదు భాషల్లో చేద్దామంటే ఓకే చెప్పా. కన్నడ, మలయాళ, తమిళ డిస్ట్రిబ్యూటర్లతో మాట్లాడటం నాకు కొత్త. అయినా ఎక్కడా వెనక్కి తగ్గకుండా బాగా చేస్తున్నా.

    అన్ని భాషల్లో ఒకే రోజు విడుదల చేస్తున్నారా?
    అవును అండీ. సేమ్ డే రిలీజ్! నేనే ఓన్‌ రిలీజ్‌ చేస్తున్నా. తెలుగుతో పాటు ఇతర భాషలకు చెందిన ఆర్టిస్టులు ఉన్నారు. గోపీసుందర్‌ గారు మంచి మ్యూజిక్‌, రీ రికార్డింగ్‌ ఇచ్చారు. అన్ని భాషల ఆర్టిస్టులకు నచ్చే చిత్రమిది.

    సినిమాలో యాక్షన్ సీక్వెన్సులు గురించి చెప్పండి!
    కథలో భాగంగా యాక్షన్ సీక్వెన్సులు డిజైన్ చేశారు. ఎమోషనల్ డ్రామా కంటిన్యూ అవుతున్న తరుణంలో యాక్షన్ వస్తుంది తప్ప కమర్షియల్ ఫార్మటులో ఫైట్స్ కావాలని ఏదీ చేయలేదు. దర్శకుడు కథను బాగా రాశారు. వరలక్ష్మి గారు ఎంతో కష్టపడి యాక్షన్ సీక్వెన్సులు చేశారు.

    నిర్మాతగా మీ ఫస్ట్ సినిమా ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉంది?
    ప్రతి కొత్త నిర్మాతకు కొన్ని ఒడిదుడుకులు ఉంటాయి. చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా మంచిగా చేశాం. అందరిలా నాకు సినిమా అంటే ఇష్టమే తప్ప నాకు ఇండస్ట్రీలో తెలిసిన వాళ్లు గానీ, బంధువులు గానీ లేరు. ఒంటిరిగా నిలబడ్డా. సినిమా చేశా. కంప్లైంట్స్ లేవు గానీ చిన్న చిన్న ఇబ్బందులు పడ్డా. నిర్మాతగా మనం ఇక్కడ నిలబడాలంటే కష్టపడి పని చేయాలి. అలాగే కష్టపడ్డా. చిన్నప్పటి నుంచి 18 గంటలు పని చేయడం అలవాటు.

    బడ్జెట్ ఎంత అయ్యింది? ఎక్కువైందని విన్నాం!
    అవును. ముందు చెప్పిన బడ్జెట్ కు, తర్వాత అయిన బడ్జెట్ కు సంబంధం లేదు. ఒక్క పని మొదలు పెట్టినప్పుడు మధ్యలో ఆపకూడదు. బడ్జెట్ విషయాలు పక్కన పెడితే… మంచి సినిమా ప్రేక్షకులకు ఇవ్వకూడదని చేశా. నా సమస్యలు ప్రేక్షకులకు అవసరం లేదు. వాళ్లకు మంచి సినిమా ఇవ్వాలని కష్టపడ్డా. ‘ఎందుకు వచ్చా ఇండస్ట్రీకి’ అని ఎప్పుడూ ఫీల్ కాలేదు.

    నెక్స్ట్ సినిమాలు ఏంటి?
    వరుణ్ సందేశ్ గారు హీరోగా నిర్మాతగా నా రెండో సినిమా ప్రొడక్షన్ లో ఉంది. బిగ్ బాస్ అమర్ దీప్, సురేఖా వాణి గారి కుమార్తె సుప్రీత జంటగా మూడో సినిమా చేస్తున్నా.

    నిర్మాణానికి పరిమితం అవుతారా? దర్శకుడిగా, నటుడిగా చేస్తారా?
    అటువంటి ఆలోచనలు లేవు. మా దర్శకులు ఎవరైనా సరదాగా కనిపించమని అడిగితే సరదాగా చేస్తాను తప్ప నటన నాకు రాదు. అది నా ప్రొఫెషన్ కాదు.  ప్రొడక్షన్ స్టార్ట్ చేసినప్పుడు నిర్మాణం మాత్రమే చేయాలని అనుకున్నా.